గద్దలకొండకు ఇస్మార్ట్ బ్రేక్

వరుణ్ తేజ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గద్దలకొండ గణేష్. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ మంచి ఫలితాలు రాబట్టింది. సోమ, మంగళవారాలు కూడా ఫరవాలేదనే కలెక్షన్లు వచ్చాయి. బుధవారం మాత్రం బాగా…

వరుణ్ తేజ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గద్దలకొండ గణేష్. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ మంచి ఫలితాలు రాబట్టింది. సోమ, మంగళవారాలు కూడా ఫరవాలేదనే కలెక్షన్లు వచ్చాయి. బుధవారం మాత్రం బాగా జారింది. సరే రెండో వారం అస్సలు ఒక్క సినిమా లేదు, సైరా వరకు ఈ సినిమానే. అందులోనూ మాస్ సినిమా కాబట్టి, ఇంతో అంతో షేర్ లాగుతుంది, మెల్లగా బయ్యర్లు గట్టెక్కేస్తారు అని అనుకున్నారు అంతా.

కానీ ఉరుము లేని పిడుగులా, పూరి జగన్నాధ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ ను అర్జెంట్ గా ఈ గురువారం నుంచి సెలెక్టివ్ గా థియేటర్లలోకి వదులుతున్నారు. వందలాది థియేటర్లు కాదు కానీ, పదుల సంఖ్యలో, కీలక ప్రాంతాల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. 

పక్కా మాస్ సినిమా ఇస్మార్ట్ శంకర్. మాస్ సినిమా ప్రియులు రెండో సారి చూడగలిగే సినిమా. అటు వాల్మీకి కూడా మాస్ నే. అయితే రెండింటికీ పోటీ అంటే ఇస్మార్ట్ దే పైచేయి అవుతుంది. అందువల్ల రెండోవారం వాల్మీకి/గద్దల కొండ గణేష్ సినిమా కలెక్షన్లను ఇస్మార్ట్ కాస్తయినా దెబ్బతీసే అవకాశం వుంది. 

తక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నా, తొలి రోజు రెస్పాన్స్ బాగుంటే థియేటర్లు పెంచే ఆలోచనలో వున్నారు. అదే కనుక జరిగితే రెండో వారం గణేష్ కలెక్షన్లను గట్టిగా ఎఫెక్ట్ చేస్తుంది ఇస్మార్ట్.