సైరా ట్రయిలర్ వచ్చి గట్టిగా వారంరోజులు కాలేదు. అప్పుడే మరో ట్రయిలర్ వదుల్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. పైగా వార్ ట్రయిలర్ అని పేరు పెట్టారు. సైరా లాంటి మెగా మూవీకి వారంరోజుల తేడాలో మరో ట్రయిలర్ నా? అది కూడా మొదటి ట్రయిలర్ మూడు నిమిషాల మేరకు కట్ చేసారు. మరి ఇప్పుడు ఇంకేం చూసిప్తారు. ఇవన్నీ అలావుంచితే మొదటి ట్రయిలర్ కు మంచి అప్లాజ్ నే వచ్చింది. రెస్పాన్స్ బాగుంది. మరి ఇంత అర్జెంట్ గా రెండో ట్రయిలర్ అవసరం ఏముంది?
ఈ విషయమే ఆరాతీస్తే, ఇదంతా బాలీవుడ్ వ్యవహారం అని తెలుస్తోంది. బాలీవుడ్ జనాలకు యాక్షన్ సీన్లు కావాలి. ఎంత యాక్షన్ వుంటే అంత డబ్బింగ్ రైట్స్ పలుకుతాయి తెలుగు సినిమాలకు. మన హీరో బెల్లంకొండ సినిమాలు, అల్లు అర్జున్ సినిమాలు అంటే అక్కడ జనాలకు అందుకే మోజు.
సైరా సినిమాకు సంబంధించినంత వరకు తెలుగు, కన్నడ వెర్షన్లకు రావాల్సినంత బజ్ వచ్చేసింది. ఓవర్ సీస్ లో కూడా మాంచి కలెక్షన్లు కనిపిస్తున్నాయి. కానీ బాలీవుడ్ సంగతేమిటి? అక్కడ అభాసు కాకూడదు. పైగా అమితాబ్ వున్నారు సినిమాలో. అందువల్ల అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ రావాలి.
అందుకోసమే ఈ రెండో ట్రయిలర్. అచ్చంగా యాక్షన్ సీన్లతో కట్ చేసిన ఈ ట్రయిలర్ ఒక్క నిమిషానికి కాస్త అటు ఇటుగా వుంటుందని తెలుస్తోంది. ఎలాగూ హిందీ ఏరియా కోసం ట్రయిలర్ కట్ చేస్తున్నాం కదా? అని అన్నిభాషల్లో వదుల్తున్నారు ఈ గురువారం నాడు. హిందీ వెర్షన్ సంగతి ఎలావున్నా, తెలుగు వెర్షన్ కు మాత్రం మరింత బజ్ తీసుకువస్తుందేమో ఈ రెండో ట్రయిలర్.