త్రివిక్రమ్ శ్రీనివాస్. తెలుగు సినిమా టాప్ డైరక్టర్లలో ఒకరు. ఆయనకు అంటూ ఓ ఇమేజ్, ఆయనకు అంటూ ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్, ఆయనకు అంటూ ఓ మార్కెట్. అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి సినిమాతో ఆత్మరక్షణలో పడిపోయినట్లు అయింది. ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా చేసారు. చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు అయింది తప్ప, పూర్తి అద్భుతం అని అనిపించుకోలేదన్నది వాస్తవం. అయితే అజ్ఞాతవాసితో నిరాశతో వున్న త్రివిక్రమ్ కు కాస్త ఊపిరిపోసింది.
ఇలాంటి టైమ్ లో అల వైకుంఠఫురములో సినిమా రాబోతోంది. బన్నీతో మూడో సినిమా త్రివిక్రమ్ కు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరువాత ఈ సినిమా చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఈ సినిమా ఓవర్ సీస్ సేల్ ఫినిష్ అయింది. ఎనిమిది కోట్లకు పైగా వచ్చింది. ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడున్న ఓవర్ సీస్ పరిస్థితుల్లో మంచి మొత్తమే.కానీ త్రివిక్రమ్ ట్రాక్ రికార్డు చూసుకుంటే మాత్రం తక్కువే.
ఎందుకంటే పవన్ కాంబినేషన్ లో సినిమా చేసి 18 కోట్ల రేంజ్ లో అమ్మారు. గతంలో మరో సినిమా 12 కోట్ల రేంజ్ లో అమ్మారు. అలాంటిది ఇప్పుడు 8 కోట్ల రేంజ్ కు వచ్చేసారు. ఓవర్ సీస్ లో స్టార్ హీరో మహేష్ బాబుకు మంచి మార్కెట్ వుంది. మహేష్ రాబోయే సినిమా 10 కోట్లరేంజ్ లో రేటు ఫిక్స్ చేసారు. కానీ త్రివిక్రమ్ సినిమా 8 కోట్ల రేంజ్ దగ్గర ఆగిపోయింది.
ఇక్కడ బన్నీ తోడు వున్నాడు. అక్కడ దర్శకుడు అనిల్ రావిపూడి వున్నారు. ఒక విధంగా రెండు సినిమాలు సమ ఉజ్జీలే. కానీ రేటు మాత్రం దీనికి తక్కువ వచ్చింది. ఓవర్ సీస్ లో అల్లు అర్జున్ మార్కెట్ తక్కువ. అందువల్లే అల వైకుంఠపురములో సినిమాకు తక్కువ వచ్చిందా? లేక త్రివిక్రమ్ గ్రాఫ్ తగ్గుతూ వస్తోందా? అన్నది పాయింట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
దర్శకుల్లో శ్రీనువైట్లకు ఒకప్పుడు ఓవర్ సీస్ లో మంచి క్రేజ్ వుండేది. తరువాత ఆయన చేసిన సినిమాలు ఆ మార్కెట్ మొత్తాన్ని కొలాప్స్ చేసాయి. త్రివిక్రమ్ కనుక అల వైకుంఠపురములో సినిమాతో తన స్టామినా మరోసారి ప్రూవ్ చేసుకోకపోతే, ఆయన మార్కెట్ కూడా ఓవర్ సీస్ లో గడ్డుపరిస్థితి ఎదుర్కొంటుంది.
వాస్తవానికి ప్రస్తుతం ఓవర్ సీస్ లో పెద్ద హీరోల మార్కెట్ 8 నుంచి 10 కోట్ల రేంజ్ లోనే వుంది. ఇప్పుడు త్రివిక్రమ్-బన్నీ సినిమా ఆ రేంజ్ ను నిలబెట్టుకోవాలి. మార్కెట్ చేయగలిగారు. కలెక్షన్లు కూడా రాబడితేనే, తరువాత త్రివిక్రమ్ సినిమాల మార్కెట్ ఆధారపడి వుంటుంది. త్రివిక్రమ్ గ్రాఫ్ కిందకా? మీదకా? అన్నది ఈ సినిమా తేల్చేస్తుంది.