పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అకస్మాత్తుగా లైవ్‌లోకి మాజీ మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా జాయిన్ అయ్యారు. దీంతో లోకేశ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. టెన్త్‌లో ఉత్తీర్ణత తగ్గడానికి ప్రభుత్వ విధానాలే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థుల జీవితాలతో టీడీపీ ఆడుకుంటోందని వైసీపీ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో టెన్త్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో లోకేశ్ జూమ్ మీటింగ్ పెడుతున్నారనే సమాచారంతో వంశీ కార్యాలయం నుంచి ల్యాప్‌టాప్ ద్వారా లాగిన్ అయ్యారు. ఊహించని అతిథులు, అది కూడా బద్ధ శత్రువులు జూమ్‌లో ప్రత్యక్షం కావడంతో లోకేశ్‌తో పాటు నిర్వాహకులు ఖంగుతిన్నారు. అసలే లోకేశ్, చంద్రబాబుపై ఇష్టానుసారం నోరు పారేసుకునే కొడాలి నాని, వల్లభనేని వంశీ బూతులు తిడతారనే ఆందోళన నిర్వాహకుల్లో కనిపించింది.
వంశీ ఏదో మాట్లాడాలని ప్రయత్నించగా మ్యూట్‌లో పెట్టారు. ఆ తర్వాత వంశీ, కొడాలి నాని వీడియో కాల్‌ను కట్ చేసి జూమ్ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే, అలాగే వైసీపీ ఎమ్మెల్యే తమ వీడియో కాన్ఫరెన్స్‌లో చొరబడడంపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూమ్‌లో కాదు, నేరుగానే మాట్లాడ్తానని సవాల్ విసిరారు. ఇదిలా వుండగా లోకేశ్ ఇవాళ ఉదయాన్నే లేచిన వేళ బాగుందని, లేకపోతే వాళ్ల చేత తిట్లు తినాల్సి వచ్చేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో ఒక చానల్‌లో టీడీపీ సీనియర్ నేత బాబురాజేంద్రప్రసాద్‌పై వల్లభనేని వంశీ నోరు పారేసుకునే సీన్‌ను గుర్తు చేస్తున్నారు. ఇవాళ అదే ఎపిసోడ్ పునరావృతం అయి వుండేదనే చర్చ జరుగుతోంది. కొడాలి నాని, వల్లభనేని వంశీల కాల్‌ను కట్ చేయకపోయి వుంటే…. లోకేశ్ పరిస్థితి ఊహించుకోవడమే కష్టంగా ఉందని కొందరు నెటిజన్లు సెటైర్ విసరడం గమనార్హం.