రాజ్‌భవన్‌లో శుక్రవారం మహిళా దర్బార్ నిర్వహించాలనే గవర్నర్ తమిళిసై నిర్ణయంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్‌భవన్‌లో మధ్నాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకూ మహిళల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని తమిళిసై నిర్ణయించారు. ఎవరైనా తమ సమస్యలను చెప్పాలనుకుంటే ఒక ల్యాండ్ లైన్ నంబర్ కూడా ఇచ్చారు. అలాగే అధికారిక మెయిల్ ఐడీ ఇచ్చి ,కలిసేందుకు అనుమతి తీసుకోవాలని గవర్నర్ సూచించారు.
ఈ నేపథ్యంలో నారాయణ మీడియా ముందుకొచ్చి గవర్నర్ వైఖరిపై విరుచుకుపడ్డారు. తమిళిసై లక్ష్మణరేఖ దాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా దర్బార్ పేరుతో రాజ్‌భవన్ వేదికగా రాజకీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని గవర్నర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
గవర్నర్‌గా వినతిపత్రాలు తీసుకోవచ్చన్నారు. అందుకు విరుద్ధంగా ప్రజానీకానికి అపాయింట్‌మెంట్ ఇవ్వడం అంటే ఒక రకంగా రాజకీయ కార్యక్రమమే అని నారాయణ అన్నారు.
గవర్నర్ అంటే రాజకీయాలకు అతీతంగా తటస్థ వైఖరితో వుండాలన్నారు. ఒకవైపు బీజేపీ వాళ్లు రాష్ట్రాలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు గవర్నర్ అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వానికి సమాంతరంగా గవర్నర్ ప్రజలను సమీకరించడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. పబ్‌ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందన్నారు. తమిళిసై అనుసరించే వైఖరి అభ్యంతరకరంగా ఉందన్నారు. మహిళా దర్బార్‌ను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.