ప్రముఖ నటుడు వేణుమాధవ్ మృతి చెందారు. ఆరోగ్య పరిస్థితి విషమించి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఆయన మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ ఆయన సికింద్రాబాద్ యశోధా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టుగా తెలుస్తోంది. ఈ నెల ఆరో తేదీ నుంచి వేణుమాధవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది.
నల్లగొండ జిల్లా కోదడకు చెందిన వేణుమాధవ్ తెలుగు తెరపై కమేడియన్ గా రాణించారు. కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. స్వయంగా ఒక సినిమాను కూడా నిర్మించారాయన. చాలా కాలం పాటు నటుడిగా బిజీగా, వెలిగిన వేణుమాధవ్ కెరీర్ కొంతకాలంగా మందగమనంలో పడింది. వేణుమాధవ్ పెద్ద సినిమాల్లో నటించడానికి విరామం వచ్చింది.
కొంతకాలం పాటు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా గట్టిగా తిరిగారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో టీడీపీ తరఫున వేణుమాధవ్ వకల్తాపుచ్చుకుని ప్రచారం చేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'సంప్రదాయం' సినిమాతో వేణుమాధవ్ కెరీర్ ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత వేణుమాధవ్ కెరీర్ కొంతకాలానికి పుంజుకుంది. యంగ్ హీరోలకు సైడ్ కిక్ రోల్స్ లో వేణుమాధవ్ నటిస్తూ రాణించారు. ఎస్వీకే దర్శకత్వంలోనే వచ్చిన 'హంగామా' సినిమాలో అలీతో సహా హీరోగా నటించారు వేణుమాధవ్. ఆ తర్వాత 'భూ కైలాస్', 'ప్రేమాభిషేకం' వంటి సినిమాల్లో కూడా హీరోగా నటించారాయన. ఎన్నో పాత్రలతో ప్రేక్షకులకు హాస్యాన్ని పంచిన వేణుమాధవ్ చిన్న వయసులోనే మరణించడం విషాదకరం.