కోడెల ఆత్మహత్య కేసుపై మానవ హక్కుల సంఘాన్ని కలవనున్నారట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఒకవైపు కోడెల ఆత్మహత్యపై పోలీసుల విచారణ సాగుతూ ఉంది. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిపోలీసులు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు కోడెల కుటుంబీకులు ఆయన సెల్ ఫోన్ ను ఇప్పటివరకూ పోలీసులకు అప్పగించడం లేదట!
ఇలాంటి ఘట్టాలు కొనసాగుతున్న కేసులో చంద్రబాబు నాయుడు మానవహక్కుల సంఘాన్ని కలుస్తారట. కలిసి ఏమని ఫిర్యాదు చేస్తారు? అంటే.. రొటీనే, ప్రభుత్వ వేధింపుల వల్ల కోడెల సూసైడ్ చేసుకున్నారనే తమ రాజకీయ వాదనను, తమ రాజకీయానికి అవసరమైన వాదనను వినిపిస్తారని తెలుస్తోంది.
కోడెల శివప్రసాద్ రావు బతికి ఉన్న రోజుల్లో ఆయనకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని వార్తలు వస్తున్నాయి. కోడెల వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చిందంటూ.. పల్నాడు ఏరియాలో పార్టీ కార్యక్రమానికి కూడా ఆ సీనియర్ నేతను పిలవని వైనం స్పష్టం అయ్యింది. ఆ వ్యవహారంలో కోడెల పేరు వినిపించడం మంచిది కాదనేది చంద్రబాబు నాయుడి లెక్క అని విశ్లేషకులు అంచనా వేశారు.
ఇక కోడెల అప్పటికే ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రి పాలైతే.. అప్పుడు కనీసం పరామర్శించని పెద్దమనిషి చంద్రబాబు నాయుడు. ఆయన బతికి ఉన్నప్పుడు ఏ మాత్రం సపోర్ట్ చేయని, కనీసం మానవతా దృక్పథాన్ని చూపని చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు కోడెల ఆత్మహత్యను తన రాజకీయానికి వాడుకుంటూ ఉన్నారు.
దీనిపై ఇప్పటి వరకూ చేసింది చాలదని మానవహక్కుల సంఘం వరకూ కూడా వెళ్తున్నారట! చంద్రబాబునాయుడి శవరాజకీయాలకు, ఆయన నిస్సిగ్గు పర్వాలకు హద్దే ఉండదా? అని ఇప్పుడు సామాన్య ప్రజలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. పార్టీ నేతల మరణాలతో రాజకీయం చేస్తూ ఉనికిని చాటాలని అనుకోవడం చంద్రబాబుకే సాధ్యం అవుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.