జనసేనాని పవన్‌కల్యాణ్‌పై వైసీపీ నేతల రాజకీయ దాడిని ఎక్కువగా ఎంజాయ్ చేసిందెవరంటే టీడీపీ నేతలే అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే పవన్‌కల్యాణ్‌ను వైసీపీ నేతలు ఎంత ఎక్కువ తిడితే, అంతగా ఆ పార్టీకి కాపులు దూరమై, తమకు దగ్గరవుతారని టీడీపీ నమ్మకంగా ఉంది.
అందుకే నిన్నటి పోసాని కృష్ణమురళి ప్రెస్‌మీట్‌ను ఎక్కువగా ఎల్లో మీడియా కవర్ చేయడాన్ని బట్టి, ఎవరికైనా అనుమానం రాకుండా ఎలా ఉంటుంది.
తన భార్య గురించి పవన్ అభిమానుల్లో కొందరు సభ్యత మరిచి మెసేజ్‌లు పంపడాన్ని పోసాని జీర్ణించుకోలేకపోయారు. దీంతో నోటికి హద్దూఅదుపూ లేకుండా పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణకు దిగారు.
పోసాని భార్యపై పవన్ అభిమానులు, అలాగే పవన్‌పై పోసాని ప్రయోగించిన భాషను సభ్యసమాజం అంగీకరించదు. కానీ టీడీపీ రాజకీయ ప్రయోజనాల రీత్యా పవన్‌పై ఇలాంటి దాడి పదేపదే జరగాలని చంద్రబాబు, లోకేశ్ తదితర టీడీపీ నేతలంతా ఆశిస్తుంటారనే ప్రచారం నడుస్తోంది.
ఈ నేపథ్యంలో పవన్‌పై పోసాని వ్యక్తిగత దాడిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీరిగ్గా కాసేపటి క్రితం స్పందించారు. జగన్‌రెడ్డి, ప్రశాంత్‌కిషోర్ వికృత క్రీడకు పోసాని పెయిడ్ ఆర్టిస్ట్‌గా ఉన్నారని విమర్శించారు.
పోసాని బూతులు సభ్య సమాజం తలదించుకునే విధంగా లేవా? అని ప్రశ్నించారు. జుగుప్సాకరమైన భాషను ప్రయోగించి సంస్కృతి సాంప్రదాయాలను మంటగల్పుతున్నారని ఆయన మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి పోసాని కృష్ణ మురళీ చేత ప్రశాంత్ కిషోర్ టీం మాట్లాడిస్తుంటే జగన్ రెడ్డి ఎందుకు బహిరంగంగా వారించలేదని ఆయన నిలదీయడం గమనార్హం.
సామాన్యులు వినలేని మాట్లాడలేని భాషలో వైసీపీ నేతలు మాట్లాడుతుంటే తాడేపల్లిలో జగన్ రెడ్డి ఆనందంలో మునిగితేలుతున్నారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. మద్యం షాపుల దగ్గర చీప్ లిక్కర్ తాగిన తాగుబోతులు కూడా ఈ విధంగా మాట్లాడరేమో? అని అన్నారు.
పవన్‌పై వ్యక్తిగత దాడిని ఆస్వాదిస్తూ పైకి మాత్రం వైసీపీ నేతలపై విమర్శలు చేయడం అచ్చెన్నాయుడికే చెల్లించదని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. టీడీపీ నేతల మాటలకు అర్థాలే వేరులే అని మరికొందరు నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు.