ఏపీలో సుదీర్ఘకాలం పాటు సాగిన స్థానిక ఎన్నికల ప్రక్రియలో.. కొంతమంది నామినేషన్ వేసిన వారు కూడా మరణించారు! 2020లో దాఖలు చేసిన నామినేషన్లకు గానూ ఇటీవలే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకూ ఇటీవలే విడుదల అయ్యాయి. కొంత ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు పదవీ స్వీకారాలు చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియలో.. కొన్ని చోట్ల నామినేషన్ వేసిన అభ్యర్థులు మరణించడం, ఇతర కారణాలతో కూడా పోలింగ్ ఆగిన వైనాలున్నాయి.
నామినేషన్ల దాఖలకూ, పోలింగ్ తేదీకి మధ్యన చాలా నెలల గడువు రావడం, అదే సమయంలో కరోనా విజృంభణ వంటి కారణాలతో కొందరు అభ్యర్థులు మరణించారు. ఈ కారణాలతో పాటు ఇతర కారణాలతో కలిపి ఏకంగా 13 జడ్పీటీసీ సీట్లకూ, 146 ఎంపీటీసీ సీట్లకూ పోలింగ్ ఆగింది. ఇటీవల ఫలితాలు వెల్లడి అయిన సీట్లతో పాటు.. ఎన్నికలు జరగాల్సిన సీట్లు ఇవన్నీ. ఇప్పుడు వీటి పై ఎస్ఈసీ దృష్టి సారించింది. పోలింగ్ ఆగిన ఈ చోట్ల ఎన్నికల నిర్వహణకు మళ్లీ కార్యాచరణ సిద్ధం అవుతూ ఉంది.
ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు.. వంటి వాటిపై ఎస్ఈసీ దృష్టి పెట్టింది. వీలైనంత త్వరగా ఈ పెండింగ్ సీట్లలో పోలింగ్ ను నిర్వహించాలని ఎస్ఈసీ భావిస్తూ ఉంది. అలాగే పెండింగ్ పంచాయతీ ప్రెసిడెంట్ ఎన్నికలను కూడా నిర్వహించనుంది వీటితో పాటు. 70 గ్రామ పంచాయతీల ఎన్నిక కూడా పెండింగ్ లో ఉంది. వాటిల్లో కూడా పోలింగ్ నిర్వహించడానికి ఎస్ఈసీ రెడీ అవుతోంది.
మరి ఈ ఎన్నికల పట్ల ఏపీలోని పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. ఎలాగూ అధికార పార్టీ సై అంటోంది. ఇక తెలుగుదేశం ఈ ఎన్నికలను కూడా బహిష్కరిస్తుందో లేదో. అలాగే తన అడుగులు పడుతున్నాయన్న పవన్ కల్యాణ్.. వంటి వారు కూడా ఈ పెండింగ్ స్థానిక ఎన్నికలపై దృష్టి నిలుపుతారేమో!
ఈ పెండింగ్ సీట్లే గాక.. కోర్టులో పిటిషన్లతో పలు మున్సిపాలిటీల ఎన్నికలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాటిల్లో కొన్నింటి పై పిటిషన్లన్నీ ఇటీవల క్లియర్ అయ్యాయట. వాటి ఎన్నికల నిర్వహణ పట్ల కూడా ఏపీ ఎస్ఈసీ దృష్టి నిలుపుతున్నట్టుగా సమాచారం.