వ్యక్తులపై పడి ఏడ్చినంతకాలం, పవన్ ఎదగడు!

పవన్ కల్యాణ్ తనకు ఒక రాజకీయ పార్టీ ఉన్నది గనుక.. శాసనసభలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా.. తాను ప్రతిపక్ష నాయకుడిని అని అనుకుంటారు. ఆ హోదాలో కూడా తనను తాను కాస్త ఎక్కువగా…

పవన్ కల్యాణ్ తనకు ఒక రాజకీయ పార్టీ ఉన్నది గనుక.. శాసనసభలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా.. తాను ప్రతిపక్ష నాయకుడిని అని అనుకుంటారు. ఆ హోదాలో కూడా తనను తాను కాస్త ఎక్కువగా ఊహించుకుంటారు. ఆయన కేవలం, అధికార పార్టీని తన ప్రత్యర్థిగా భావిస్తున్న వ్యక్తి మాత్రమే. ‘సరే పోన్లే పర్లేదు’ అనుకున్నా కూడా.. ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మకంగా ప్రభుత్వంలోని లోపాల మీద పోరాడే తరహాలో ఉండాలి. అంతే తప్ప కొందరు వ్యక్తుల వైభవస్థితి గురించి అసూయపడుతూ, ఏడుస్తూ ఉంటే అది వారి బుద్ధిలోపం అవుతుంది తప్ప.. రాజకీయ విధానం అనిపించుకోదు. 

పవన్ కల్యాణ్ తనను తాను ఏపీలో అతిగొప్ప ప్రతిపక్షంగా ఊహించుకుంటే.. కోవచ్చు. ఆయన ప్రభుత్వ విధానాలను నిరసించాలి. లోపాలను చెప్పాలి. నిజంగా ప్రజలకు మంచి జరగాలనుకుంటే.. ఆ లోపాలను దిద్దుకోవడం ఎలాగో చెప్పాలి. ఆయన అవేమీ చేయరు. కొందరు వ్యక్తులను టార్గెట్ చేస్తారు. ఆ వ్యక్తుల మీద విషాన్ని కక్కుతుంటారు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  గురించి పవన్ కల్యాణ్ మాట్లాడే మాటలు వింటే.. ఈ లేకితనం బయటపడుతుంది. ముఖ్యమంత్రి అవినీతి గురించి గానీ, పాలనలో ప్రజాకంటక విధానాల గురించి గానీ పవన్ మాటలు ఉండవు. ఇతరత్రా ఆరోపణలతో విషాన్ని మాటల్లో గుమ్మరించే చేతగాని వైఖరి మాత్రమే ఉంటుంది.పవన్ కల్యాణ్ ఆవేశంగా మాట్లాడే ప్రతి సందర్భంలోనూ వ్యక్తులను టార్గెట్ చేయడం కనిపిస్తుందే తప్ప.. విధానాలపై నిర్మాణాత్మక విమర్శలు ఉండవు. 

కొత్తగా కాదు గానీ, తాజా సభలో ఆయన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్ది మీద పడి ఏడుస్తున్నాడు. రాష్ట్రంలో వైసీపీ ఒక ఉగ్రవాద పార్టీ అట. జనసేనను రౌడీ సేన అని జగన్ అన్నందుకు పవన్ కల్యాణ్ కౌంటర్ ఇది. మేం రౌడీలం అయితే.. మీరు ఉగ్రవాదులు అని ఆయన అభివర్ణిస్తున్నారన్నమాట. అలాంటి ఉగ్రవాద పార్టీకి సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుగా ఉన్నారట. రాయలసీమకు ఆయన చెడ్డపేరు తీసుకువస్తున్నారట. 

అయితే తమాషా ఏంటంటే.. సజ్జల మీద వ్యక్తిగతంగా పడి ఏడవడంపై దృష్టి మళ్లిన తర్వాత.. వైసీపీని ఉగ్రవాద పార్టీగా అభివర్ణించే ప్రయత్నం మొత్తం పలుచన అయిపోయింది. వైసీపీని ఉగ్రవాద పార్టీగా ప్రజల ఎదుట దోషిగా నిలబెట్టాలనుకుంటే.. పవన్ కల్యాణ్ చాలా చక్కగా ఆ పని చేయొచ్చు. 

వైసీపీ కార్యకర్తల, నాయకుల దురాగతాలు ఏవేవి ఉగ్రవాదాన్ని మరిపించేలా ఉన్నాయో వివరించి ఉండొచ్చు. అలాకాకుండా.. ఆయన ఎప్పుడైతే వ్యక్తులను టార్గెట్ చేస్తారో.. అప్పుడు వ్యవహారం కూడా పలచనైపోతుంది. అందుకే రాజకీయాల్లో ఎదగాలని అనుకుంటున్న పవన్.. వ్యక్తులను టార్గెట్ చేసినంత కాలం తాను ఎదగలేనని తెలుసుకోవాలి.