విశాఖలో గ్యాస్ లీక్ ప్రమాద మృతులకు కోటిరూపాయల పరిహారం ప్రకటించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అదే ప్రభుత్వం అంతే మానవత్వంతో ఆలోచించి.. దర్శిత్ కుటుంబానికి కూడా రూ.కోటి పరిహారం ఇప్పించాలి.
ఏ నేరమూ ఏ పాపమూ చేయకుండానే.. కడతేరిపోయిన మూడేళ్ల పసివాడిని బలితీసుకున్న నిర్లక్ష్యాన్ని కొరత వేయాలి. కోటి రూపాయల పరిహారం ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందని కాదు, పసివాడి ముద్దుముచ్చట్లను మరచిపోయేలా చేస్తుందని కాదు.. కానీ పేద ప్రజల ప్రాణాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే విద్యుత్తు అధికారులకు బుద్ధి వచ్చేలా చేయడానికి. విద్దుత్తు సంస్థలద్వారానే ఈ సొమ్ములిప్పించి.. ఎవరి ఇష్టారాజ్యంగా వారు వ్యవహరిస్తోంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, నిర్లక్ష్యానికి కాపు కాయదని జగన్ హెచ్చరిక సంకేతాలను పంపాలి.
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్ట గ్రామంలో జొన్నకూటి వినోద్ గుడిసె మీదుగా విద్యుత్తు అధికారులు అప్పట్లో 33 కెవీ లైను వేశారు. ఇలాంటి దుర్మార్గాలు మనకు పల్లెల్లో చాలా చోట్ల కనిపిస్తాయి. ఇంతేలే పేదల బతుకులు.. ఈ బతుకులు ఎప్పటికీ మారవు.. ఎప్పటికీ వీరు గుడిసెలలోనే మగ్గిపోతూ ఉంటారు.. వీరి బతుకులు మిద్దెలు కాబోయేది ఉండదు అని విద్యుత్తు అధికారుల చిన్నచూపు.
కానీ పాపం.. వినోద్ స్థితి కొంచెం మెరుగుపడింది. చిన్న మిద్దె ఇల్లు కట్టుకున్నాడు. ఇంటిమీదుగా లైన్లు వెళుతున్నాయి. వాటిని తొలగించాలని ఆనాటినుంచి విద్యుత్తు అధికార్లకు మొరపెట్టుకుంటున్నాడు. ఎవరూ పట్టించుకోలేదు. ఇదేమీ జస్ట్ ఈ మూడేళ్లలోనే జరిగిన వ్యవహారం మాత్రమే కాదు.
ఇలాంటి లైన్లు మార్చాలనే ప్రజల విజ్ఞప్తుల పట్ల విద్యుత్తు శాఖ ఎంత నిర్లక్ష్యంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తుందనడానికి ఎప్పటినుంచో ఉన్న ఉదాహరణ మాత్రమే. వాళ్లు మార్చలేదు. సరికదా.. పెద్ద మొత్తాల్లో ఫీజులు కట్టాల్సి ఉంటుందని అన్నారు. అతని ఆస్తి మీద వీళ్లు విద్యుత్తు లైను వేసుకుని.. దానిని తొలగించడానికి అతనే డబ్బులు కట్టాలనడమో పెద్ద దోపిడీ. అతని వల్ల కాదు గనుక కట్టలేకపోయాడు. గడపగడపకు కార్యక్రమంలో తన ఇంటికి వచ్చిన మంత్రి తానేటి వనితకు కూడా తన గోడు మొరపెట్టుకున్నాడు. ఆమె ఏ మేరకు పట్టించుకున్నదో తెలియదు. కానీ.. అధికారులు మాత్రం సమస్య తీర్చలేదు.
ఆ నిర్లక్ష్యం ఫలితమే దర్శిత్ మృతిచెందడం. అంత్యక్రియల తర్వాత అధికారులు అర్ధరాత్రి వచ్చి ఒకే రాత్రిలో లైన్లు మార్చేసి వెళ్లడం ఇంకా ఘోరం. ఇలా పేదల ఇళ్లమీద లైన్లు వేసేసి, వాటిని మార్చడానికి వారు డబ్బులు కడితే తప్ప కుదరదనే విద్యుత్తు శాఖ దోపిడీ పర్వానికి ముకుతాడు వేయాలంటే.. వారితోనే దర్శిత్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం కట్టించాలి.