సాధారణంగా నెంబర్ వన్, నెంబర్ టూ మధ్య దూరం చాలా తక్కువే ఉంటుంది. కానీ రాజకీయ పార్టీల్లో అలా కాదు. ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీల్లో.. ‘నెంబర్ వన్’ అధినేత అయితే.. నెంబర్ టూ ఆయన తరఫున పనులు చక్కబెట్టేవారు మాత్రమే. ఇద్దరి వ్యత్యాసం చాలా ఉంటుంది. నెంబర్ టూ.. నెంబర్ వన్ ను మరిపించే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి.
ఏపీలో ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ‘జనసేన అంటే పవన్ కల్యాణ్ మాత్రమే’ అనే స్థూల నిర్వచనం కరెక్టే. కానీ నెమ్మదిగా ఆయన కార్యకలాపాలు తగ్గుతున్నాయి. జనసేన అంటే నాదెండ్ల మనోహర్ పేరొక్కటే వినిపిస్తోంది. ఆయనొక్కడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బహుశా ఆయన మీద పవన్ కల్యాణ్ కు ఉన్న అతినమ్మకం వల్ల కావొచ్చు. కానీ.. అంత గురికుదరడం వెనుక మర్మం ఏంటి? జనసేనాని వ్యూహం ఏమిటి? అదే ఈవారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ..
జనసేన అంటే పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ అంటే జనసేన. ఈ నిర్వచనం స్వల్పమార్పులకు గురవుతున్నదా? అనే ప్రశ్న ఎదురైతే తటాల్న లేదని సమాధానం చెప్పడం కూడా కష్టం. ఆటలో అరటిపండు వంటి నాగబాబును మినహాయిస్తే, పార్టీ కీలక కార్యక్రమం ఏదైనా జరుగుతున్నప్పుడు వేదిక మీద కూర్చోవడానికి ఆ పార్టీకి ఉన్నది ఇద్దరే నాయకులు.. పవన్, నాదెండ్ల మనోహర్. ఇటీవలి కాలంలో నాదెండ్ల ప్రాధాన్యం పార్టీలో బాగా పెరుగుతోంది. ప్రధాని నరేంద్రమోడీతో వ్యక్తిగత సమావేశానికి హాజరవుతూ కూడా.. నాదెండ్లను వెంటబెట్టుకుని వెళ్లడం ఇందుకు ఉదాహరణ. అనేక విషయాల్లో ఈ ప్రాధాన్యం మళ్లీ మళ్లీ నిరూపణ అవుతూనే ఉన్నది. నాదెండ్ల మనోహర్ మీద.. పవన్ కల్యాణ్ కు అంతటి అపారమైన విశ్వాసం ఏమిటి? ఎందుకు?
వర్తమాన ఏపీ రాజకీయాల్లో మనకు మూడు రకాల నాయకులు కనిపిస్తున్నారు. ఒకరేమో తనను తాను అపరిమితంగా నమ్మే వ్యక్తి. ఎవ్వరి అండాదండా అవసరం లేదు.. అధికారం వచ్చినా రాకపోయినా ఒంటరిగా మాత్రమే నా ప్రస్థానం ఉంటుంది అని తేల్చిచెప్పే జగన్మోహన్ రెడ్డి. మరొకరేమో తన నీడను కూడా తాను నమ్మని వ్యక్తి. తన బలాన్ని కూడా నమ్మలేని, తన బలహీనతను కూడా తెలుసుకోలేని వ్యక్తి! నిత్యం ఎవ్వరితో పొత్తులు పెట్టుకుంటే.. ఈసారి గట్టునపడి అధికారంలోకి వస్తామా అని ఆరాటపడుతూ ఉండే చంద్రబాబునాయుడు! మూడో రకం పవన్ కల్యాణ్!! ఆయనకు తన సామర్థ్యం మీద తనకు అతిశయమైన నమ్మకం. అంతలోనే తన నిర్ణయాధికారం మీద నిత్యసంకోచం. తనకంటె తన పక్కవారి చాతుర్యంమీదనే ఆధారపడి తాను అధికారంలోకి రావాలని అనుకోవడం.
పవన్ కల్యాణ్ వైఖరి చూస్తే అలాగే అనిపిస్తోంది. అయితే నాదెండ్ల మనోహర్ లో అంతటి ప్రత్యేకత ఏముంది? జనసేన పార్టీలో నెంబర్ వన్ స్థాయి కలిగిన నాయకుడిగా వర్ధిల్లడానికి, పవన్ అంతగా ఆయన మీద ఆధారపడడానికి చాలినంత అపారమైన రాజకీయ వ్యూహనిపుణుడా అనే అనుమానాలు అందరికీ కలగొచ్చు. మనోహర్ వైఎస్సార్ హవా ప్రబలంగా ఉన్న 2004లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2009లో కూడా వైఎస్సార్ పుణ్యమాని గెలిచారు.
అప్పట్లోనూ వైఎస్సార్ గాలి బలంగానే వీచినప్పటికీ.. తెనాలి నియోజకవర్గంలో మనోహర్‌కు వచ్చిన మెజారిటీ 2884 మాత్రమే. 2014 వచ్చేసరికి, రాష్ట్ర విభజన పుణ్యమాని, అంతర్ధానం అయిపోయారు. 2018లో జనసేనలో చేరిన మనోహర్ పార్టీలో చాలా కీలంగా ఉంటూ వచ్చారు. ఆ నాటికి రెండుసార్లు ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి స్పీకర్ అనే రికార్డులు మాత్రమే కలిగి ఉన్న నాదెండ్ల మహాగొప్ప నాయకుడని అనుకోడానికి వీల్లేదు. అయితే ఆ పార్టీకి అంతకంటె దిక్కు కూడా లేదు. పార్టీ నిర్వహణలో కీలకంగా ఉంటూ 2019 ఎన్నికల్లో తన సొంత తెనాలి నియోజకవర్గం నుంచే పోటీచేశారు.
పవన్ కల్యాణ్ చరిష్మా అంతో ఇంతో పనిచేసి ఉండాలి. అంతా కలిపి ఆ నియోజకవర్గంలో ఆయనకు లభించిన ఓట్లు కేవలం 30 వేలు. పోనీ రాష్ట్రవ్యాప్తంగా ఎంతో కొంత క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న నాయకుడా అంటే అది కూడా కాదు. ఇప్పుడు జనసేన సారధిగా రాష్ట్రమంతా తిరగాల్సిందే తప్ప, అంతకుముందు స్పీకరు కుర్చీలో లేకపోతే ఆయనను ఎవ్వరూ గుర్తుపట్టరు కూడా. పోనీ అపరిమిత మేథాసంపత్తులు ఉన్న నాయకుడా అంటే.. అది కూడా ఎన్నడూ ఆయన నిరూపించుకున్న దాఖలాలు లేవు.
స్పీకరుగా.. చాలా సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా సభను నడుపుకుంటూ.. కాంగ్రెసు కండువాను ధరించడం జాతీయపతాకకు చిహ్నంగా సమర్థించుకున్నది తప్ప.. ఆయన ట్రాక్ రికార్డులో పెద్ద మేథోప్రదర్శనలేమీ జరగలేదు. మరి జనసేనాని పవన్ కల్యాణ్.. తాను పార్టీ ప్రారంభించినప్పుడు తన వెంట లేని, 2018లో మాత్రమే తన పార్టీలో చేరిన (ఆయనే సంప్రదించి అడిగి చేర్చుకున్నారేమో తెలియదు) నాదెండ్ల మనోహర్ కు అంత ప్రాధాన్యం ఎందుకు కట్టబెడుతున్నారు? ఈ దిశగా కాస్త లోతుగా ఆలోచించినప్పుడు చాలా అంశాలు స్ఫురిస్తాయి.
‘నాదెండ్ల’ కావడమే అర్హత!
మనోహర్ కు ‘నాదెండ్ల’ అనే పదమే అదనపు అర్హత. పవన్ కల్యాణ్ సెంటిమెంట్లను విపరీతంగా నమ్మే వ్యక్తి అనే సంగతి అందరికీ తెలుసు. సెంటిమెంట్లు అందరికీ ఉంటాయి. కానీ, హద్దుదాటి మూర్ఖత్వం, మూఢనమ్మకం అనదగిన రీతిలో ఆయన ఆచారాలు, క్షుద్రపూజలు గట్రా ఉంటాయని అనేక పుకార్లు ఉన్నాయి. మొత్తానికి ఆయన సెంటిమెంటును నమ్ముతారు. ఆ క్రమంలోనే ‘నాదెండ్ల’ వారితో తెలుగుజాతి రాజకీయ చరిత్రలోని గత పుటలలాగా తనకు కలిసి వస్తుందని పవన్ కల్యాణ్ అనుకుని ఉండొచ్చు.
గతంలో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు.. ఎవ్వరు అవునన్నా ఎవ్వరు కాదన్నా ఆయన వెంట నాదెండ్ల భాస్కరరావు అనే ఒక బలమైన రాజకీయ శక్తి ఉంది. రామారావుకు సినీ హీరోగా అసమానమైన ప్రజాదరణ ఉంది. కాంగ్రెసులో ఉన్న నాదెండ్ల భాస్కరరావుకు రాజకీయ తెలివితేటలు, వ్యూహచాతుర్యం ఉన్నాయి. ఎన్టీఆర్ కేవలం తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడంటే.. ఆయన చరిష్మాకు తోడు ఆ తెలివితేటలు కూడా పనిచేశాయి కాబట్టే.
పవన్ కల్యాణ్ కు అది ఒక సెంటిమెంట్ గా ముద్రపడిపోయిందని కొందరు విశ్లేషిస్తున్నారు. నాదెండ్ల భాస్కరరావు వారసుడు నాదెండ్ల మనోహర్ వెంట ఉంటే.. ఎన్టీఆర్ తరహాలోనే అసమానమైన ప్రేక్షకజనాదరణ ఉన్న తాను కూడా 9 నెలల్లో కాకపోయినా.. మరికొంత కాలానికైనా అధికారంలోకి వచ్చి సీఎం అవుతాననేది ఆయన ఒక నమ్మకంగా పలువురు చెబుతున్నారు. రాజకీయాల్లో ఇలాంటి సెంటిమెంట్లు రిపీట్ అవుతాయా? సెంటిమెంట్ లాగా చూసినప్పుడు ఏమో చెప్పలేం గానీ.. నిజానికి తెలివితేటల పరంగా చూసినప్పుడు.. ఎన్టీఆర్ ను వెనుకనుంచి నడిపించిన భాస్కరరావు జీన్స్ నుంచి జెనెటికల్ గా వచ్చిన తెలివితేటలు మనోహర్ కు ఉంటాయి. అదే తరహాలో ఆయనను కూడా పవన్ కల్యాణ్ ను అధికారం దిశగా వెనుకనుంచి నడిపించవచ్చుననేది ఒక అంచనా. అయితే ప్రస్తుతం.. పార్టీ పరిస్థితుల దృష్ట్యా మనోహరే ముందు నడుస్తున్నారు. పవన్ కల్యాణ్ అప్పుడప్పుడూ వచ్చి జాయిన్ అవుతున్నారు.
బేరసారాలకు ఒకరు కావాలి..
పవన్ కల్యాణ్ పార్టీకి ప్రస్తుతం మూడో నాయకుడికి దిక్కులేదు. ఇలాగే ఎన్నికలకు వెళితే.. 2019కంటె ఘోరమైన పరాభవం తప్పదనే బేసిక్ సెన్స్ పవన్ కు కూడా ఉంది. 2024 ఎన్నికల్లోగా ఇంకా పార్టీలోకి పలువురు నాయకులు రావాలి. అందరూ తన కటౌట్ చూసి విజిల్స్ వేసేవారు కాదు.. నిజంగా రాజకీయం తెలిసిన, రాజకీయంలో నలిగిన వారు కూడా కావాలి. ‘నాకు మీరు చాలు..’ అంటూ సినీఫక్కీ డైలాగులు పవన్ వేదికల మీద పలకవచ్చు గానీ.. వాస్తవంలో అవి పనిచేయవు.
ఇతర పార్టీల నుంచి ఆ పార్టీలను నిందించే వాదనలను సిద్ధం చేసుకుని మరీ.. పవన్ మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నందుకు కారణాలు వెతుక్కుని మరీ నాయకులను తీసుకురావాలంటే బేరసారాలు తెలిసిన వారుండాలి. అసలే పెడసరంగా మాట్లాడే అలవాటు ఉన్న పవన్ కల్యాణ్ కు ఆ టేలెంట్ ఉంటుందని అనుకోలేం. అందుకే నాదెండ్ల మనోహర్ ఆసరా తీసుకున్నారనేది, ఆయన మీద అంత అతిగా ఆధారపడుతున్నారనేది ఒక అంచనా.
అసలు వ్యూహం ఇదేనా?
ఇవన్నీ అసలు కారణాలు కాదని.. పవన్ కల్యాణ్ మదిలో అసలైన మరొక వ్యూహం ఉన్నదని కొందరు విశ్లేషిస్తున్నారు. పదేళ్లకు పైగా ముందుచూపుతో సుదీర్ఘకాల వ్యూహంతో.. భవిష్యత్ పరిణామాలను ముందే ఊహించుకుని అప్పటికప్పుడు చాణక్యులను వెతుక్కోవాలంటే కష్టం గనుక.. ముందునుంచే తన వెంట ఉంచుకుని ప్రాధాన్యం ఇస్తున్నారనేది ఇంకో విశ్లేషణ.
అదేంటంటే.. పవన్ కల్యాణ్ కు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనేది బలీయమైన కోరిక. ఆయన చీటికీ మాటికీ ఓ వంద కులాల పేర్లు చెప్పి.. ‘‘ఎప్పుడూ మీ కులాలేనా, మా కులాలనుంచి ముఖ్యమంత్రి కావొద్దా..’’ అంటూ చాలా లేకిగా మాట్లాడుతుంటారు గానీ.. జనసేనకు నిర్ణయాత్మక శక్తిగా నిలవగల సంఖ్యాబలం దక్కితే చాలు.. తానే సీఎం కావాలనేది ఆరాటం. అయితే ఆయన ఒంటరిగా ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు. జనసేన తరఫున అన్ని సీట్లు గెలవనూ లేరు. అలాగని చంద్రబాబు పల్లకీ మోయడానికి సిద్ధపడినంత కాలమూ.. సీఎం చంద్రబాబు అవుతారే తప్ప.. పవన్ కావడం కల్ల. చంద్రబాబు జీవించి ఉండగా.. పవన్ సీఎం కాలేరు.
మరి చంద్రబాబు తర్వాత పరిస్థితి ఏమిటి? ఈ రెండు పార్టీలు అప్పటికి కూడా పొత్తుల్లో ఉండవచ్చు గానీ.. అంతమాత్రాన పవన్ ను సీఎం ఎందుకు చేస్తారు? అసలే తన వారసుడిగా లోకేష్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనేది చంద్రబాబునాయుడు వాంఛ. చంద్రబాబునాయుడు లేని రోజే గనుక వస్తే.. లోకేష్ నాయకత్వాన్ని పార్టీలో అందరూ ఆమోదిస్తారా? అసలే అజ్ఞానానికి పరాకాష్ట అయిన నారా లోకేష్ సారథ్యంలో పార్టీ మొత్తం సర్వనాశనం అయిపోతుందని తమందరి రాజకీయ జీవితాలు భస్మీపటలం అయిపోతాయనే భయం వారిలో ఉండదా? అనే చర్చలు సర్వత్రా నడుస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా చంద్రబాబు తదనంతరం లోకేష్ కు పార్టీ పగ్గాలు, అధికారం ఉంటే ఆ వారసత్వం అంత ఈజీగా మాత్రం రావు. ఆయన పట్ల తిరుగుబాటు ఉంటుంది.
తెలుగుదేశంలో తిరుగుబాటే వస్తే గనుక.. ఆ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుని.. చీలిక వర్గాన్ని తాను చేరదీసి.. తనకున్న అసమాన చరిష్మాను వారికి చూపించి.. తాను సీఎం కావొచ్చుననేది పవన్ కల్యాణ్ దీర్ఘకాలిక వ్యూహం. అలాంటి సందర్భంలో తెలుగుదేశాన్ని చీల్చడానికి, తెలుగుదేశంలో అధికారానికి వెన్నుపోటు పొడవడానికి.. చాలా చాలా చావు తెలివితేటలు ఉన్న వ్యక్తి కావాలి. ఒకసారి తెలుగుదేశాన్ని నాదెండ్ల భాస్కరరావు చీల్చారు. మరోసారి ఆయన వారసుడు నాదెండ్ల మనోహర్ ద్వారా అలాంటి పని సాధ్యమవుతుందనే ఆశతో చేరదీసినట్టుగా కూడా ఒక ప్రచారం ఉంది. తెలుగుదేశంలో లోకేష్ ను ధిక్కరించే సీనియర్లందరినీ చేరదీసి..పవన్ పంచకు చేర్చాలంటే.. నాగబాబు లాంటి సగం ఉడికిన బుర్రలు సరిపోవు. నాదెండ్ల మనోహర్ మాత్రమే సరైన, ఆధారపడదగిన మనిషి అనే నమ్మకం పవన్ కు ఉండొచ్చు.
అంతా ఓకే గానీ..
ఇలాంటి అంచనాలు వర్కవుట్ అయితే ఓకే. కానీ, నాదెండ్ల అనే పేరులోనే మరో సెంటిమెంట్ చరిత్ర కూడా ఉంది. కాంగ్రెసునుంచి ఆయనను తీసుకువచ్చి వెంట ఉంచుకున్న ఎన్టీరామారావును వెన్నుపోటు పొడిచిన చరిత్ర అది. అసమాన ప్రజాదరణ ఉన్న ఎన్టీఆర్ ను గద్దెదించి.. అధికారం దక్కించుకున్న చరిత్ర అది. నాదెండ్ల మనోహర్ ను చూస్తే అలా అనిపించరు. సౌమ్యులు, మెతకగా మాట్లాడతారు. కానీ పవన్ కల్యాణ్ సెంటిమెంట్లను ప్రధానంగా భావించి మనోహర్ ను చేరదీయడమే నిజమైతే గనుక.. ఈ సెంటిమెంటును కూడా గుర్తుంచుకుని ఆయన జాగ్రత్తగా ఉంటే మంచిది.
ఎందుకంటే.. ఇప్పటికే జనసేన అనేది మనోహర్ పార్టీలాగా చెలామణీ అవుతోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వడని అంతా నెంబర్ టూ నేతలతో మాట్లాడాలని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ముఖ్యమంత్రి హోదాలో చెప్పలేనంత పని ఒత్తిడి ఉంటుందని వారు సమర్థించుకోవచ్చు. కానీ పవన్ కల్యాణ్ కు జనసేన అధినేతగా ఇతర పనులు ఏం ఉంటాయి. మహా అయితే సినిమా షూటింగులే కదా! పార్టీ నాయకులు ఎవరు వచ్చి తమ కష్టాలు చెప్పుకోవాలనుకున్నా.. పవన్ అపాయింట్మెంట్ దొరకదని.. అంతా నాదెండ్లతోనే చెప్పుకోవాలని పార్టీలోనే అసంతృప్తి రగులుతోంది. ఎవరైనా రహస్య విషయాలు చర్చించాలన్నా కూడా.. పవన్ కల్యాణ్ సింగిల్ గా వారికి అపాయింట్మెంట్ ఇచ్చి, వారి బాధలు విని, గుర్తుంచుకుని నిర్ణయాలు తీసుకునే రోజులు పార్టీలో పోయాయట. ఎంత ప్రైవేటు అపాయింట్మెంట్ అడిగినా సరే.. పవన్ తో పాటు, నాదెండ్ల కూడా కూర్చుంటారని.. ఆయన ఒక్కరితోనే చెప్పుకోగల కష్టాలకు అసలు అవకాశమే దొరకదని విలపిస్తున్న వారు పార్టీలో అనేకులు ఉన్నారు.
దానికి తోడు.. సాక్షాత్తూ పార్టీ అధినేతే పాల్గొనవలసిన అనేకానేక కీలక కార్యక్రమాలను కేవలం నాదెండ్ల మాత్రమే చక్కబెట్టేస్తున్నారు. ఇటీవలి కాలంలో అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితుల గోడు విన్నా, మరణించిన రైతులకు, పార్టీ కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు ఇస్తున్నా, విజయనగరం వెళ్లి నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించినా.. అన్నీ నాదెండ్ల చేతుల మీదుగానే జరుగుతున్నాయి. అంత బిజీగా ఉండే ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు లే నియోజకవర్గాల సమీక్ష లాంటి కీలక పనులు స్వయంగా తామే నిర్వహిస్తుంటారు. అలాంటిది.. సినిమా షూటింగులు తప్ప ఎలాంటి ఒత్తిడి ఉండని పవన్ కల్యాణ్ పార్టీని పూర్తిగా నాదెండ్ల చేతుల్లో పెట్టేసినట్టుగా వ్యవహరిస్తున్నారు. పరిస్థితి నెమ్మదిగా ఎలా తయారవుతున్నదంటే.. నాదెండ్ల మనోహర్ జనసేనకు సారథిగా, పవన్ కల్యాణ్ అతిథిగా మారుతోంది. ఇలాంటి చర్చ పార్టీలో ముమ్మరంగా జరుగుతోంది. ఇన్ని జరుగుతున్నప్పుడు.. జనసేన పార్టీ అంటేనే.. ‘వన్ అండ్ ఓన్లీ.. నాదెండ్ల’ అని ఎవరికైనా అనిపిస్తే తప్పేముంది.
..ఎల్. విజయలక్ష్మి