మామూలుగా అయితే ఇతర నాయకుల మీద వేధింపుల తరహా ఐటీ దాడులు లేదా ఈడీ దాడులు జరిగిఉంటే తెరాస నాయకులు స్పందించే తీరు ఇంకోరకంగా ఉండేది. విపరీతమైన మాటల దాడులు వెల్లువెత్తేవి. కానీ ఎందుకోగానీ మంత్రి మల్లారెడ్డి మీద ఐటీ సోదాలు జరిగి 15 కోట్లరూపాయలు, బంగారం పట్టుకుపోతే.. తెరాస అగ్రనేతల నుంచి మరీ పెద్ద తీవ్రమైన స్పందన లేదు. ఈలోగా మల్లారెడ్డి ఓ చిన్న నీటిప్లాంటు ప్రారంభించే కార్యక్రమానికి వెళ్లి.. కేసీఆర్ ను ఇరుకున పెట్టే మాటలు సెలవిచ్చారు.
500 మంది పోలీసులను పెట్టి తన ఆస్తులన్నీ సోదా చేయించారని పాపం మల్లారెడ్డి వాపోతున్నారు. తన మీద 15 కేసులుపెట్టారని, వాటికి భయపడనని ఆల్రెడీ సెలవిచ్చిన ఆయన, తన వెనుక కేసీఆర్ ఉన్నంతవరకు తనను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని అనడం విశేషం. ఈ మాట బిజెపి నాయకులకు అస్త్రంలాగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఈ మాటలకు అర్థం.. ‘అక్రమార్కులకు అండగా ఉండి కేసీఆర్ కాపాడుతుంటారు’ అని అర్థం వచ్చేలా ఉంటుంది.‘‘అవును మల్లా రెడ్డి చెప్పింది నిజమే.. జనాన్ని దోచుకునే వాళ్లందరినీ కేసీఆర్ కాపాడుతూ ఉంటాడు’’ అని బిజెపి నాయకులు విమర్శలతో చెలరేగిపోయే అవకాశం పుష్కలంగా ఉంది.
మల్లారెడ్డి అక్కడితో ఆగలేదు.. ‘‘భారస అధికారంలోకి వస్తే.. ఐటీదాడులు ఉండవని, దేశంలో ఎవరు ఎంత సంపాదించుకున్నా సరే.. స్వచ్ఛందంగా వారికి నచ్చినంత పన్ను చెల్లిస్తే సరిపోతుందని ఆయన సెలవిచ్చారు. అంటూ ఆదాయపు పన్ను అనే పద్ధతినే ఎత్తివేయడం అన్నమాట. పన్ను వసూలు చేయడం అనేదే లేకుండా.. ఏ ప్రభుత్వాలు అయినా ఎలా మనగలుగుతాయి. ఒకవేళ మల్లారెడ్డి అంటున్నట్టుగా భారాస కేంద్రంలో అధికారంలోకి వచ్చేస్తే గనుక.. ప్రధాని అయ్యే అవకాశం ఉన్న కేసీఆర్.. ఆదాయపు పన్ను అనేదేలేకుండా.. ఆ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు? ఇదంతా పెద్ద కామెడీ వ్యవహారం.
మల్లారెడ్డి ఇంకో రకంగా కూడా కేసీఆర్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసేశారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లోనూ భారాస పోటీచేస్తుందని ప్రకటించేశారు. ఇప్పటిదాకా భారాస అనేదానికి ఎన్నికల సంఘం గుర్తింపే రాలేదు. ఆ పార్టీ తరఫున ఎక్కడెక్కడ పోటీచేస్తుందో.. స్వయంగా కేసీఆర్ కూడా వెల్లడించలేదు. అంత ధైర్యం చేయలేదు. మహా అయితే తెలుగురాష్ట్రాలు, కొంత కర్ణాటక, కొంత మహారాష్ట్ర , కొంత తమిళనాడు వరకు పోటీచేయవచ్చునని ఊహలు సాగుతున్నాయి.
వీటికి భిన్నంగా.. కేసీఆర్ ఊహలకు, స్థాయికి మించిపోతూ.. దేశమంతా అన్ని రాష్ట్రాల్లో భారాస రంగంలోకి దిగుతుందని మల్లారెడ్డి ప్రకటించం కేసీఆర్ పుట్టిముంచడమే. చేయకపోతే పరువునష్టం.. చేస్తే ఓటములు తప్పవు.. అంతకంటె పరువునష్టం!!