జనసేనాని పవన్‌కల్యాణ్ వారాంతాల్లో వచ్చి, ఆవేశపూరిత ప్రసంగాలు చేయడం, తిరిగి వెళ్లడం అలవాటైంది. అందుకే ఆయన్ను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. మొదట్లో టాలీవుడ్ అగ్రహీరో అనే ఇమేజ్ కొంత వరకూ ఆయనపై ఆకర్షణ వుండేది. రానురానూ అది కాస్త పోయింది. నేను అది చేస్తా, ఇది చేస్తా అని హెచ్చరికలతోనే పుణ్య కాలం కరిగిపోతోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటం గ్రామంలోని తన పార్టీ సానుభూతిపరులకు ఆయన ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మరోసారి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. యుద్ధ వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. నిజానికి ఆయన యుద్ధం చేయాల్సింది వైసీపీతో కాదు. తన బలహీనతలు, నిలకడలేని తనం తదితర అంశాలపై ఆయన యుద్ధం చేయాల్సి వుంది.
పార్టీని బలోపేతం చేసుకోడాన్ని వదిలేసి, వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోస్తా, అంత వరకూ నిద్రపోనని శపథాలు చేయడం నవ్వు తెప్పిస్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కూలదోయాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఆయన కాస్త కామెన్స్‌తో ఆలోచించాల్సిన అవసరం వుంది. నిత్యం ప్రజల్లో వుంటూ, వారి కష్టనష్టాలను తెలుసుకుంటూ తన నాయకత్వంపై నమ్మకాన్ని సంపాదించుకుంటే చాలు. మిగతా పని ప్రజలు చూసుకుంటారు.
ప్రజల కేంద్రంగా ఆయన రాజకీయాలు చేయడం మానేశారు. ఎంత సేపూ తన పార్టీ లేదా తన సామాజిక వర్గం వారితో సమావేశాలకే పరిమితం అవుతూ చాగంటి కోటేశ్వరరావు మాదిరిగా కులాలు, మతాలు, సమాజం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అంటూ ప్రవచనాలు చెబుతున్నారు. జనసేన పార్టీకి ఇప్పటికీ నిర్మాణం లేదు. అధికార పోరులో ఉడత సాయంలా జనసేన ఉపయోగపడుతుందని టీడీపీ ఆశిస్తోంది. జనసేన స్థాయి ఏంటో పవన్ అర్థం చేసుకోవాల్సి వుంది.
వైసీపీని దెబ్బ కొట్టాలంటే బీజేపీ పెద్దలకు, ప్రధానికి చెప్పి చేయనన్నారు. తమ యుద్ధాలకు బీజేపీ పెద్దల మద్దతు అడిగేది లేదని ఆయన తెగేసి చెప్పారు. తాను పుట్టిన ఆంధ్రప్రదేశ్ గడ్డపైనే తేల్చుకుంటానని ఆయన అన్నారు. తానే యుద్ధం చేస్తానని కూడా ఆయన శంఖారావం పూరించారు. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో యుద్ధంపై స్పష్టత వుండాలి. మీటింగ్‌ల్లో చెప్పు చూపిస్తూ, ప్రత్యర్థులపై అవాకులు చెవాకులు పేలినంత మాత్రాన యుద్ధం చేస్తున్నట్టు కాదు. కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జి వుండాలని కోరుకుంటారు.
కనీసం 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే లేని పవన్‌కల్యాణ్ తాను జగన్‌కు పోటీ అనుకోవడమే పెద్ద జోక్. బరిలో నిలవాలంటే వన్ మ్యాన్ షో చేస్తే సరిపోదు. నాదెండ్ల కాకుండా జనసేనలో మరో నాయకుడు కనిపించే పరిస్థితి లేదు. యుద్ధం చేయాలంటే తన శక్తితో పాటు శత్రువు బలాన్ని సరిగా అంచనా వేయాలి. ఇప్పటికైనా ఉత్తుత్తి మాటలు కట్టిపెట్టి, జగన్‌ను ఢీకొట్టేందుకు శక్తిని కూడదీసుకుంటే పవన్‌కే మంచిది.