తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపి ప్రత్యర్థులను లొంగదీసుకోవడం లేదా భయపెట్టడానికి తెరలేపాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మిత్రుల సంస్థల్లో ఐటీ శాఖ పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. కోట్లాది రూపాయల నగదుతో పాటు కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకుంది.
ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తానెప్పుడూ ఇలాంటి దాడులు చూడలేదని అన్నారు. తన కుమారుడిపై ఐటీ అధికారులు చేయి చేసుకున్నారని ఆయన సంచలన ఆరోపణ చేశారు. మరోవైపు ఎన్ని ఆరోపణలు వచ్చినా ఐటీశాఖ వెనక్కి తగ్గలేదు. తన పని తాను చేసుకుపోతోంది.
మంత్రి మల్లారెడ్డితో పాటు మరో 16 మందికి నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇవాళ మల్లారెడ్డి, మరికొందరు విచారణకు హాజరు కావాల్సి వుంది. అయితే ఐటీ శాఖ విచారణకు మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు హాజరవుతారా? లేదా? అనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హాజరు కాకపోతే మల్లారెడ్డి తప్పు చేసినట్టు అవుతుందని, కావున ఆయన వెళ్తారనే టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
తెలంగాణ మంత్రులు, నాయకుల ఇళ్లపై వరుసగా ఈడీ, ఐటీ దాడులు సాగుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ నేతల్ని టెర్రరైజ్ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఎప్పుడు ఎవరి కార్యాలయాలపై దాడులు జరుగుతాయో అని టీఆర్ఎస్ నేతలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న పరిస్థితి.