అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా కోవిడ్ -19 వ్యాక్సిన్ వైపు వడివడిగా అడుగులు పడుతూ ఉన్నాయి. వ్యాక్సిన్ ను తయారు చేయడం అంటే అదొక సుదీర్ఘ ప్రక్రియ అని స్పష్టం చేస్తూనే, వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని పరిశోధకులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు సంస్థలు ఈ ఏడాది అక్టోబర్ కు కోవిడ్ -19 కు పక్కా విరుగుడు వ్యాక్సిన్ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాయి.
ఈ క్రమంలో దేశీయ పరిశోధనలు కూడా ఊపందుకున్నాయి. మరోవైపు వచ్చే నెలలోనే రష్యా వ్యాక్సిన్ మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుందట. ఇప్పటికే తాము రూపొందించిన వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయని రష్యా ప్రకటించింది. అయితే వ్యాక్సిన్ ఎలాంటి ఫలితాలను నమోదు చేస్తుందనేందుకు ఆ మాత్రం పరిశోధన సరిపోదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే రష్యా మాత్రం వచ్చే నెలలో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావడం గురించి ఒకే ధీమా వ్యక్తం చేస్తోంది!
ఇక ఐసీఎంఆర్- భారత్ బయోటెక్ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ దేశీయంగా ఆరంభం అయ్యాయి. దాదాపు 12 విభిన్నమైన చోట్ల ఈ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ చేపడుతున్నారు. తొలి దశలో 375 మంది మీద ఈ వ్యాక్సిన్ ను ప్రయోగిస్తున్నారు. వారిలో వందమందిని ఎయిమ్స్ లోనే ఎంపిక చేశారట. దేశంలోని పలు వైద్యాలయాల్లో వాలంటీర్ల మీద ఈ వ్యాక్సిన్ ప్రయోగం జరగనుంది. ఇక తాము కూడా వ్యాక్సిన్ ను రూపొందించినట్టుగా, హ్యూమన్ ట్రయల్స్ కు సిద్ధమని అహ్మదాబాద్ నుంచి మరో ఫార్మా కంపెనీ ప్రకటించింది. వెయ్యి మంది వలంటీర్ల మీద తమ వ్యాక్సిన్ ను ప్రయోగించనుందట ఈ సంస్థ. 2021 ఆరంభానికల్లా తమ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ ధీమగా చెబుతోంది.
ఇక మరికొన్ని భారతీయ ఫార్మా కంపెనీలు విదేశీ పరిశోధన సంస్థలతో చేతులు కలుపుతున్నాయి. విదేశాల్లో హ్యూమన్ ట్రయల్స్ లో ఉన్న వివిధ వ్యాక్సిన్ ల ను దేశీయంగా అందుబాటులోకి తీసుకురావడానికి కొన్ని సంస్థలు రెడీ అవుతున్నట్టుగా సమాచారం. అలా ఐదారు దేశీయ సంస్థలు విదేశీ పరిశోధన సంస్థలతో ఒప్పందాలు ఖరారు చేసుకుంటున్నాయట. వ్యాక్సిన్ పై పరిశోధనలు విజయవంతం అయితే.. ఎక్కడిక్కడ ఉత్పత్తి కూడా చేసేలా ఉన్నారు. ఈ ఏడాది చివరకు కచ్చితంగా వ్యాక్సిన్ అయితే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ లోపే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తనంతట తానే బలహీన పడితే ప్రపంచానికి అంతకన్నా కావాల్సింది కూడా ఏమీ లేదు!