‘ఆస్క్ మీ’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన నాగబాబు… అభిమానులు అడిగిన ప్రశ్నలకు మాత్రం తనవంటూ సొంత అభిప్రాయాలు చెప్పకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. మరోవైపు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ పోయిందనడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తన తమ్ముడు పవన్‌కల్యాణ్‌పై రచయిత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి మాటల్లో చెప్పలేని, రాయలేని విధంగా దూషణలకు దిగిన నేపథ్యంలో ఆయన ఆస్క్ మీ అంటూ సోషల్ మీడియా వేదికపైకి వచ్చారు.
దీంతో సహజంగానే తమ్ముడిపై పోసాని ఘాటు విమర్శల ప్రస్తావన, దానికి నాగబాబు చెప్పే సమాధానం ఉత్కంఠ రేకెత్తించింది. చివరికి నాగబాబు తుస్సుమనిపించారు. మీ అభిప్రాయం చెప్పయ్యా నాగబాబు అని అభిమానులు అడగ్గా… ఇతరుల అభిప్రా యాలు, చివరికి పోసాని ఒక సందర్భంలో అన్న మాటలనే అప్పగించడం ఆశ్చర్యం కలిగించింది. నాగబాబు తనవంటూ సొంత అభిప్రాయాలు చెప్పకుండా … మీమ్స్, ఇమోజీలు, వీడియోల రూపంలో అదో ‘తుత్తి’ అన్నట్టు ‘మమ’ అనిపించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ అనే కార్యక్రమంలో ‘మళ్లీ పాలిటిక్స్‌లో వస్తారా అంకుల్’ అనే ప్రశ్నకు… ‘నాకు ఇంట్రెస్ట్ పోయింది’ అనే మీమ్‌తో నాగబాబు సమాధానం ఇచ్చారు. ‘పవన్ కల్యాణ్ గురించి మాట్లాడు అన్నా’ అని ఓ అభిమాని అడగ్గా… గతంలో పవన్ కల్యాణ్ గురించి పోసాని కృష్ణమురళి మాట్లాడిన వీడియో పోస్ట్ చేయడం గమనార్హం. భారతదేశంలో టాప్ హీరోల్లో పవన్‌కల్యాణ్ ఒకడని, అతను ఐదుకోట్లు, పదికోట్ల కోసం లంగా పనులు చేయడని పోసాని అన్న మాటల వీడియోను చూపారు.
‘పోసాని గురించి ఒక్క మాట’ అని మరో అభిమాని అడగ్గా ‘సమరసింహారెడ్డి’ సినిమాలో బాలకృష్ణ ‘కుక్కపిల్ల మొరిగిందనుకో’ అనే డైలాగ్ చెప్పే సీన్ ఫొటోను పెట్టారు. మరి ఇదే పవన్‌కల్యాణ్ వివిధ సందర్భాల్లో మోడీ, చంద్రబాబు, లోకేశ్, ఎల్లో మీడియా ధిపతుల గురించి ఏం మాట్లాడారో చూడాలంటూ నెటిజన్లు వీడియోలను తెరపైకి తేవడం ఆసక్తికరంగా మారింది.
ఎప్పుడూ ఒకే అభిప్రాయాలుండవని, ఆ విషయాన్ని పవన్‌కల్యాణ్ రుజువు చేసినట్టుగా మరే నేత మనకు కనిపించరనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.