రివర్స్ టెండరింగ్ ప్రక్రియ అనేది ప్రజాథనం వృథా కాకుండా కాపాడుతుందని, దీంతో ఖజానా సొమ్ము ఆదా అవుతుందని సీఎం పీఠం ఎక్కినప్పట్నుంచీ చెబుతున్నారు జగన్. ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ సత్ఫలితాలనిస్తోంది. ప్రాజెక్ట్ కాంక్రీట్ నిర్మాణం, జలవిద్యుత్ కేంద్ర నిర్మాణానికి పిలిచిన టెండర్లలో ఏకంగా 628కోట్లు ఆదా అయ్యాయి. ఇది జగన్ సర్కార్ సాధించిన ఘన విజయం. అయితే దీన్ని జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ, రివర్స్ టెండరింగ్ పై రివర్స్ గేమ్ మొదలు పెట్టింది.
తక్కువ రేట్లకి పనులు చేస్తే డ్యామ్ నాణ్యతకు హామీ ఉండదని, నాసిరకంగా నిర్మాణాలు చేస్తే ప్రాజెక్ట్ భవిష్యత్ ఎలా ఉంటుందోనని కొత్త లాజిక్ తీస్తోంది టీడీపీ. ప్రాజెక్ట్ వ్యయం తగ్గిందని సంతోషపడటం మానేసి ఇలా వితండవాదం చేస్తోంది. తక్కువ మొత్తానికి టెండర్లు అప్పగించినంత మాత్రాన, నాణ్యత నిర్థారణ-ప్రమాణాల కమిటీ చూస్తూ ఊరుకోదు కదా. నాణ్యతపై సమీక్ష చేసే క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ ఉంటుంది, ఇంజినీర్లు ఉంటారు. పైగా కేంద్రం ప్రతీదీ మానిటరింగ్ చేస్తుంటుంది. అలాంటప్పుడు నాణ్యతా లోపం అనే ప్రశ్నకు తావెక్కడ?
ఈ సంగతి పక్కనపెడితే.. అసలు టీడీపీకి నాణ్యత గురించి మాట్లాడే హక్కు ఉందా అనేది ప్రధానమైన ప్రశ్న. చిన్నపాటి వర్షానికే అసెంబ్లీ చాంబర్లు ఎలా తయారయ్యాయో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. కాంక్రీట్ తో కట్టారా లేక దూదితో కట్టారా అన్నట్టున్నాయి భవనాలు. ఎక్కడ చూసినా లీకేజీలే. ఇక హైకోర్ట్ బిల్డింగ్ సంగతి సరే సరి. ఒక్క పనిలో కూడా నాణ్యత లేదు. ఇలాంటి నేతలు ఇప్పుడు రివర్స్ టెండరింగ్, నాణ్యత అంటూ సుద్దులు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైఎస్ జగన్ నిబద్ధతను ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదు. సొంత పార్టీలోనే అవినీతి-అక్రమాలు జరగకుండా ఎక్కడికక్కడ చెక్ పెడుతున్న ముఖ్యమంత్రి… కాంట్రాక్ట్ కంపెనీల విషయంలో ఉదారంగా ఎందుకుంటారు? పోలవరం భద్రత విషయంలో ఎందుకు రాజీ పడతారు? జగన్ లక్ష్యం ఒక్కటే. టీడీపీ హయాంలో జరిగిన దుబారాను అరికట్టడం, సకాలంలో పోలవరాన్ని పూర్తి చేయడం. రివర్స్ టెండర్లతో ఇవి రెండూ సాధ్యమవుతున్నాయి. ఈ విషయంలో టీడీపీ ఎంత గగ్గోలు పెట్టినా ప్రజలకు నిజాలు తెలుస్తూనే ఉన్నాయి.