సినిమా టైటిల్ ను ఆఖరి నిమిషంలో మార్చారు. వాల్మీకి కాస్తా గద్దలకొండ గణేష్ అయిపోయాడు. అయితే దర్శకుడు హరీష్ మైండ్ లో మాత్రం వాల్మీకి టైటిల్ అలా ఫిక్స్ అయిపోయింది. అందుకే సక్సెస్ మీట్ లో మాటిమాటికీ తన సినిమాను వాల్మీకి పేరుతోనే సంభోదించాడు. అంతేకాదు.. ఈ సినిమా సక్సెస్ ను వాల్మీకి మహర్షికి అంకితమిచ్చాడు.
“ఈ సినిమా వాల్మీకి అనే టైటిల్ తోనే మొదలైంది. ఆ మహర్షి గురించి గొప్పగా చెప్పడానికి ఈ సినిమాతో అవకాశం వచ్చిందని అనుకున్నాను. కానీ కొంతమంది ఒప్పుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో టైటిల్ మార్చాం. కానీ ఓ హైందవ మతంలో పుట్టిన వ్యక్తిగా, రామాయణంపైన, వాల్మీకి మహర్షి పైన ఉన్న గౌరవంతో ఈ సినిమా విజయాన్ని వాల్మీకి మహర్షికి అంకితం చేస్తున్నాం.”
సినిమాను అంకితమిస్తే మళ్లీ కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయని, అందుకే సినిమా విజయాన్ని మాత్రమే అంకితమిస్తున్నానని స్పష్టంచేశాడు హరీష్. విజయమనేది పాజిటివ్ ఎలిమెంట్ కాబట్టి, ఈ సినిమా సక్సెస్ ను ఓ నైవేద్యంగా స్వీకరించాలని కోరాడు. తన సినిమాపై ఎన్నో వివాదాలు నడిచినప్పటికీ.. చివరికి వచ్చేసరికి అన్నీ కామెడీగా మారిపోయాయని అన్నాడు. మరోవైపు సినిమాలోకి పట్టుబట్టి పూజా హెగ్డేను తీసుకునే అంశంపై కూడా రియాక్ట్ అయ్యాడు హరీష్.
“డీజే సినిమాలో పూజాను గ్లామరస్ గా చూపించాను. ఆ సినిమా సక్సెస్ అవ్వడానికి పూజా హెగ్డే గ్లామర్ కూడా ఓ కారణం. అయితే ఆమె మంచి నటి. ఆ టాలెంట్ ను పక్కనపెట్టి కేవలం పూజా గ్లామర్ పైనే ఆధారపడ్డానని అనిపించింది. అందుకే వాల్మీకిలో పట్టుబట్టి పూజాను తీసుకున్నాను. ఇందులో ఆమె పెర్ఫార్మెన్స్ చూసి అంతా మెచ్చుకుంటున్నారు. పైగా శ్రీదేవి పాత్రలో పూజాను తప్ప మరో హీరోయిన్ ను ఊహించుకోలేకపోయాను నేను.”
జిగర్తాండా సినిమాకు రీమేక్ గా వచ్చింది గద్దలకొండ గణేశ్. ఒరిజినల్ వెర్షన్ కు హరీష్ శంకర్ చేసిన మార్పులు క్రిటిక్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ కమర్షియల్ మీటర్ మిస్ అవ్వకుండా మార్పులు చేయడంతో సినిమా ప్రేక్షకులకు నచ్చిందంటున్నాడు హరీష్.