పొత్తు లేదుగానీ.. చేస్తోంది చాలా ఎక్కువే!

అధికారికంగా పొత్తు పెట్టుకున్న పార్టీలు కూడా అంత లావు మేలు చేయడం లేదు. కానీ.. అధికారిక పొత్తులేకపోయినా సరే.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాత్రం.. భారత రాష్ట్రసమితిని గెలిపించడానికి, కేసీఆర్ ను మళ్లీ…

అధికారికంగా పొత్తు పెట్టుకున్న పార్టీలు కూడా అంత లావు మేలు చేయడం లేదు. కానీ.. అధికారిక పొత్తులేకపోయినా సరే.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాత్రం.. భారత రాష్ట్రసమితిని గెలిపించడానికి, కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి తన శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం బలంగానే కనిపిస్తున్న నేపథ్యంలో గులాబీ దళం నాయకత్వంలో సంకీర్ణం వస్తుందని భావిస్తున్నారో ఏమో తెలియదు గానీ.. ఎన్నికల సభల్లో కేసీఆర్ ను వేనోళ్ల శ్లాఘించడానికి ఆయన సమయం కేటాయిస్తున్నారు.

మజ్లిస్ పార్టీకి, భారాసకు మధ్య అనధికారిక పొత్తుబంధం అప్రతిహతంగా కొనసాగుతూ ఉంది. వారిద్దరిదీ నిజానికి ఎప్పటినుంచో కొనసాగుతున్న బంధం. ఈ ఎన్నికల సమయానికి అది ఇంకా విశ్వరూపం దాల్చింది.

ఈసారి ఎన్నికల్లో కేవలం 9 స్థానాల్లోపోటీచేస్తున్న మజ్లిస్ పార్టీ, మిగిలిన చోట్ల భారాసకు అనుకూలంగా పనిచేస్తోంది. ఈ 9 సీట్లు తప్ప.. తతిమ్మా అన్నిచోట్ల ముస్లింలు అందరూ భారాసకు ఓటు వేయాలని ఒవైసీ ఇప్పటికే పిలుపు ఇచ్చారు. ఆ మేరకు పనిచేస్తున్నారు. తాజాగా ఆయన హైదరాబాదు అల్లపూర్ పరిధిలో ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్లుగా ఎలాంటి గొడవలు లేని ప్రశాంతమైన పాలన అందిస్తున్నారని, అందువల్ల మళ్లీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని పిలుపు ఇచ్చారు.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సారథి రేవంత్ రెడ్డి ఆరెస్సెస్ కు చెందిన వ్యక్తి అంటూ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్ రిమోట్ కంట్రోల్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేతుల్లో ఉన్నదని ఆరోపించారు. 

కాంగ్రెసు పార్టీ మీద ఒవైసీ చేస్తున్న ఆరోపణల సంగతి ఓకే. కానీ.. మజ్లిస్ తీరు మీద వెల్లువెత్తుతున్న లోపాయికారీ ఒప్పందాల గురించిన ఆరోపణల సంగతేమిటి? కేసీఆర్ ను ఇప్పుడు ఇంతగీ కీర్తిస్తున్న ఒవైసీ రేపు సంకీర్ణం ఏర్పడే పరిస్థితి వస్తే గనుక.. అప్పుడు భారాసకు బిజెపి మద్దతిస్తే, తాము మద్దతివ్వబోమని ఇప్పుడే తేల్చి చెప్పగలరా? అనే ప్రశ్నలు ప్రజలనుంచి ఎదురవుతున్నాయి.

9 స్థానాల్లో పోటీచేస్తున్న మజ్లిస్.. గోషామహల్ స్టేడియం సెగ్మెంటులో సిటింగ్ బిజెపి అభ్యర్థి రాజాసింగ్ మీద పోటీకి అభ్యర్థిని దింపకపోవడాన్ని కూడా.. భాజపాతో కుమ్మక్కు అయినందుకు సంకేతంగానే పలువురు భావిస్తున్నారు. భాజపా, భారాస, మజ్లిస్ కలసి కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నాయని సీపీఐ అగ్రనేత నారాయణ ఆరోపిస్తున్నారు.

ఆ మాటకొస్తే.. మజ్లిస్- ఒవైసీ కేసీఆర్ తో పొత్తు పెట్టుకోలేదు గానీ.. ఆయన కోసం చాలా చాలాచేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఇదంతా కూడా సంకీర్ణం మీద కలలతోనే కావచ్చుననే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.