ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డం.. మొహం మీద మాట్లాడ్డం మోహన్ బాబు శైలి. తనకు నచ్చకపోతే ఆ విషయాన్ని మొహం మీద చెప్పేస్తారు. ఒక వ్యక్తిపై కోపం ఉంటే ఆ వ్యక్తికే చెప్పాలి తప్ప, మరో వ్యక్తి దగ్గర మాట్లాడకూడదనేది మోహన్ బాబు పాలసీ. ఈ ముక్కుసూటితనంతోనే ఎన్నో వివాదాలకు ఆయన కేంద్ర బిందువయ్యారు. తాజాగా తన కోపాన్ని సీనియర్ హాస్యనటుడు అలీపై కూడా చూపించారు.
90ల్లో అలీని బాగా ప్రోత్సహించిన హీరోల్లో మోహన్ బాబు కూడా ఒకరు. దాదాపు 40 ఏళ్ల సినీప్రయాణం వాళ్లిద్దరిదీ. అలాంటి అలీని కూడా ఓ దశలో పక్కపెట్టారు మోహన్ బాబు. తను నిర్మించే, నటించే సినిమాల నుంచి అలీని తొలిగించారు. ఈ విషయాన్ని అలీ మొహం మీదే చెప్పారు.
“విలన్ లేకుండా సినిమా తీయలేరు. కమెడియన్ లేకుండా కూడా సినిమా తీయలేం. అందుకే నా సినిమాల్లో ఎక్కువ మంది హాస్యనటుల్ని ప్రోత్సహిస్తుంటాను. నా ప్రతి సినిమాలో నిన్న పెట్టుకున్నాను. కానీ తర్వాత నీకు పొగరు ఎక్కువైంది. అందుకే నిన్ను వద్దనుకున్నాను.”
ఇలా అలీని ప్రొఫెషనల్ గా కట్ చేసిన విషయాన్ని ఆయన మొహం మీదే చెప్పేశారు మోహన్ బాబు. పర్మినెంట్ బ్యానర్ లో సినిమాలు తీస్తున్నప్పుడు లక్ష, 2 లక్షల దగ్గర బేరం ఆడకూడదని.. అలా బేరం ఆడడం వల్లనే అలీని కట్ చేయాల్సి వచ్చిందని కూడా చెప్పేశారు మోహన్ బాబు.