శివ సినిమాతో టాలీవుడ్‌కు ఓ మంచి డైరెక్టర్‌గా రాంగోపాల్‌వర్మ పరిచయమయ్యాడు. ఆ తర్వాత గాయం సినిమాతో అభిమా నులను మరింతగా అబ్బురపరిచాడు. ఆ తర్వాత మంచోచెడో వర్మ నిత్యం సినిమా వార్తల్లో డైరెక్టర్‌గా నిలిచాడు. ఏం చేసినా , ఏం తీసినా అందులో వర్మ మార్క్ తప్పని సరి.
రానురాను రాజుగారి గుర్రం ఏదో అయిన చందంగా డైరెక్టర్ కాస్తా వివాదాస్పద, సంచలనాలకు మారుపేరు అయ్యాడు. ఇటీవల ఆ పేరు మరింత పాతాళానికి పడిపోతూ బూతు డైరెక్టర్‌గా కూడా పరిణమించాడు. వర్మ వైఖరి చూస్తుంటే…కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్టు, రాంగోపాల్‌వర్మ ఏమైనా వివాదాలతో పుట్టాడేమో అనే అనుమానం కలుగుతుంది.
మరీ ముఖ్యంగా మెగా కుటుంబం అంటే వర్మకు అసలు గిట్టదు. ఏదో రకంగా మెగా సెలబ్రిటీలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో గిల్లికజ్జాలు పెట్టుకోనిదే వర్మకు నిద్ర పట్టేలా లేదు. తాజాగా ‘పవర్ స్టార్: ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ తెరకెక్కిస్తుండడమే నిదర్శనం. ఈ సినిమాలో అచ్చం పవన్‌కల్యాణ్‌ను పోలిన వ్యక్తి హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్లను పోలిన పాత్రలతో సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సృష్టించిన వివాదం గురించి అందరికీ తెలిసిందే.
పవర్‌స్టార్ సినిమా విషయానికి వస్తే “గడ్డి తింటావా?” పాట మరో రెండు గంటల (సాయంత్రం ఐదు)లో విడుదల కానుంది. ఈ పాటలో హీరో తన గేదెలు, మొక్కలను ఉద్దేశిస్తూ పాట ఆలపిస్తాడని ఆర్జీవీ ప్రకటించాడు. ఇంతటితో ఆగని వర్మ ‘పవర్ స్టార్’ సినిమాలో ఓ క్యారెక్టర్ అంటూ… అతడు ఎవరి పోలికతో అయినా ఉన్నాడా అంటూ ట్వీట్ చేశాడు. ఈ ప్రశ్నలోనే జవాబు ఉంది. ఎదుటి వారిని రెచ్చగొట్టడంలో వర్మ తర్వాతే ఎవరైనా అని చెప్పేందుకు ఈ ట్వీటే నిలువెత్తు ఉదాహరణ.