ఏ మాత్రం సిగ్గులేకుండా మాట్లాడ్డం కొందరు రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. తెలుగు సమాజంలో అలాంటి సిగ్గులేని నేతలెవరో అందరికీ తెలుసు.
జనానికి అన్నీ తెలుసని, ప్రత్యర్థులను విమర్శించే ముందు తామేంటో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలన్న స్పృహ చంద్రబాబులో పూర్తిగా పోయిందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ఏదో మాట వరుసకు అన్నాడే అనుకుందాం, ఆయన్ను భుజాన మోసే మీడియా కూడా దానికే ప్రాధాన్యం ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
టీడీపీ వ్యూహ రచన కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతుల గొంతు కోసే వ్యవసాయ చట్టాలకు పార్లమెంట్‌లో మద్దతిచ్చిన వైసీపీ, ఇప్పుడు సిగ్గు లేకుండా రైతు సంఘాల భారత్ బంద్‌కు మద్దతు పలికిందని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి జగన్ ద్వంద్వ వైఖరి దీనితో బయట పడిందని ఆయన విమర్శించారు. ఇవే తిట్లు తనకు కూడా వర్తిస్తాయని చంద్రబాబు ఎందుకు గ్రహించడం లేదో ఏమీ అర్థం కాదు. ఎందుకంటే ఈ చట్టాలకు టీడీపీ మద్దతు పలికింది.
టీడీపీ కూడా పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాలకు మద్దతు పలికిన విషయాన్ని చంద్రబాబు విస్మరించడం ఆయనకే చెల్లింది. పాలక పక్షమే కాదు, ప్రతిపక్షమైన తాను కూడా రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతిచ్చి, ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా అంటే తమకు భయమని టీడీపీ నిరూపించుకుంది.
అలాంటిది పార్లమెంట్‌లో తామేదో రైతుల పక్షాన నిలిచి, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక చట్టాలకు విరుద్ధంగా పోరు చేసినట్టు చంద్రబాబు పోజు పెట్టడం విమర్శలకు దారి తీస్తోంది. ఏమోనబ్బా ….సిగ్గు లేకుండా బతకేయడం తమకు మాత్రమే సంక్రమించిన హక్కుగా వాళ్లు భావిస్తున్నట్టుంది.