బ్రదర్ అనిల్ అనేది చాలా కామన్ నేమ్. ఎవరిదైనా కావచ్చు. కానీ అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది షర్మిల భర్తే. ఆయన పేరు మీద వచ్చి పడుతున్న కథనాల గురించి, వాటిలో తెలిసో, తెలియకో మిక్సప్ చేసేస్తున్న విషయాల గురించిన వ్యాసమిది. రాజకీయాల్లో లేని వారి వ్యక్తిగత విషయాల గురించి రాయడం భావ్యం కాదు. పైగా వాళ్ల పెళ్లయి 20 ఏళ్లు దాటింది. వాళ్లబ్బాయికే 21 ఏళ్లట. అనిల్ పుట్టుపూర్వోత్తరాల గురించి చర్చ యిప్పుడెందుకు అంటే షర్మిల తెలంగాణ బరిలోకి దిగుతానని ప్రకటించిన దగ్గర్నుంచి, అనిల్ ఫలానాట, కాదు ఫలానా అనే సమాచారం వెల్లువెత్తుతోంది. ఇంటర్నెట్‌తో వచ్చిన చిక్కేమిటంటే సముద్రంలో కొల్లలుగా చిప్పలు దొరికినట్లు కుప్పతిప్పలుగా వివరాలు దొరుకుతాయి. ఏది ఆల్చిప్పో, ఏది ముత్యపుచిప్పో తరచి చూస్తే తప్ప తెలియదు. అలాగే యీ సమాచారాన్ని గట్టి పరీక్షకు గురి చేస్తే తప్ప నమ్మలేని స్థితి వుంది.
షర్మిల వివాహం గురించి సామాన్య ప్రజలకు కూడా తెలిసిన సమాచారమేమిటంటే – ఆమె వరించినవాడు బ్రాహ్మణుడు. వాళ్ల కుటుంబంలో యిమడలేదు వద్దని చెప్పి వైయస్ తన కూతుర్ని చిన్న మేనమామకిచ్చి పెళ్లి చేశారు. కానీ ఆమె కాపురానికి వెళ్లలేదు. కొన్నాళ్లకి వైయస్ తప్పు గ్రహించి, వాళ్లకి విడాకులు యిప్పించారు. ఆ మేనమామ వేరే పెళ్లి చేసుకున్నారు. ఈమె కొన్నాళ్లాగి అనిల్‌ను పెళ్లి చేసుకుని తండ్రికి చెప్పింది. తండ్రి సరేనన్నాడు. వాళ్లకు యిద్దరు పిల్లలు. కర్ణాకర్ణీగా వినబడే విషయం ఏమిటంటే – వైయస్‌కు కూతురి మనసు కష్టపెట్టడం యిష్టం లేదు. సరేననేవాడే కానీ ఆయన తండ్రి రాజారెడ్డి ససేమిరా అన్నారు. పెద్దాయన మాట కాదనలేక వైయస్ షర్మిలకు మేనమామతో పెళ్లి చేశాడు. 1998లో రాజారెడ్డి హత్యకు గురి కావడంతో వైయస్ ధైర్యం చేసి, కూతురికి విడాకులిప్పించేసి, అనిల్‌నిచ్చి పెళ్లి చేయించాడు.
విజయలక్ష్మిగారు యీ మధ్య వెలువరించిన తన ఆత్మకథలో యీ ఉదంతం గురించి రాస్తూ మావగారు అడ్డుపడ్డారని అనలేదు. వైయస్సే ఒప్పుకోలేదని, షర్మిలకు యిష్టం లేని పెళ్లి చేశామని, విడాకులు తీసుకున్నాక మనసు బాగోలేదంటూ తను అమెరికా వెళ్లిందని, అక్కణ్నుంచే ‘నేను అనిల్‌ను పెళ్లి చేసుకున్నాను’ అని ఫోన్ చేసి చెప్పిందని, ఎన్నికలలో టిక్కెట్ల పంపిణీ హడావుడిలో ఉన్న వైయస్ ‘పోనీలే, తన కిష్టమైనవాణ్ని పెళ్లి చేసుకుంది, అదే చాలు’ అనుకుని అంగీకరించారని రాశారు. దానిలో అనిల్ గురించి వివరాలు ఏమీ రాయలేదు. అతనితో స్నేహంగా వుండేదని, తర్వాత ప్రేమగా మారిందని మాత్రం చెప్పారు. తేదీలు స్పష్టంగా రాయలేదు. టిక్కెట్ల పంపిణీ అంటే వైయస్‌కు పనిపడేది అసెంబ్లీ ఎన్నికలే కావచ్చనుకుంటే 1999 కావాలి. అంటే 1998లో రాజారెడ్డి మరణం తర్వాతనే విడాకులు, మారుమనువు జరిగాయని అనుకోవాలి. కానీ వికీపీడియా ప్రకారం 1973 డిసెంబరులో పుట్టిన షర్మిలకు 1995లో పెళ్లయింది. బహుశా అది మొదటి వివాహం కావచ్చు.
ఈ అనిల్ గురించి జనాలకు తెలిసినది – అతని ఇంటిపేరు యినీషియల్ ఎం. ఏం చదివాడో తెలియదు కానీ వ్యాపారస్తుడిగా, ఎవాంజలిస్టుగా ఉన్నాడు. సభల ద్వారా, టీవీల ద్వారా క్రైస్తవ మతప్రచారం చేస్తాడు, పాటలు పాడతాడు, క్రీస్తు గొప్పతనం గురించి చెప్పి చర్చిలకు జనాలు వెళ్లేట్లు చేస్తాడు. అతనికున్న వ్యాపారసంస్థలపై 2013లోనే వివాదం రేగింది. టిడిపి వాళ్లు చెప్పినన్ని కంపెనీలు లేవంటాడతను. బయ్యారం గనులు లీజుకి తీసుకున్నవాళ్లు నా మిత్రులు తప్ప, నేను కాదు, నాకున్న వ్యాపారాలకు పెద్ద టర్నోవరు కూడా లేదు అని చెప్పుకున్నాడు. 2014 ఎన్నికలలో అతను జగన్‌కు సాయపడడానికి క్రైస్తవసంఘాలను పోగుచేశాడని, దానితో బాటు చర్చిలకు సంబంధించిన వాహనాల్లో వైసిపి డబ్బును ఓటర్లకు పంచడానికి తోడ్పడ్డాడని పుకార్లు వచ్చాయి. ఆ మధ్య బిజెపి నాయకుడు జివిఎల్ నరసింహారావు అమరావతి విషయంలో టిడిపి ధోరణిని సమర్థించకపోతే ‘జివిఎల్, అనిల్ మేనత్త కొడుకు, అందుకనే వైసిపికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు’ అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వెంటనే కాదని కూడా వార్తలొచ్చాయి, అఫీషియల్‌గా ఖండనలేవీ లేకున్నా!
ఇప్పుడు షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వస్తూ నేను తెలంగాణ కోడల్ని. పెళ్లయిన తర్వాత అమ్మాయికి మెట్టినిల్లే ముఖ్యం కదా. తెలంగాణ శ్రేయస్సు కోసమే పార్టీ పెడుతున్నాను అన్నారు. దాంతో అనిల్ తెలంగాణ అబ్బాయి అవునా కాదా అనే చర్చకు తెర తీసినట్లయింది. షర్మిల వివరాలు చెప్పటం లేదు కాబట్టి, ఎవరి వూహాగానం వాళ్లు చేసేస్తున్నారు. కాంగ్రెసు నాయకుడు మానవతా రాయ్ ఒక వీడియోలో మాట్లాడుతూ ‘‘ఆమె తెలంగాణ కోడలు ఎలా అవుతుంది? వాళ్ల మావగారు డా. రమణారావుగారిది రాజమండ్రి. ఆయన బాగ్ అంబర్‌పేటలో ఆయుర్వేద వైద్యుడు. ఆయన పోయారు. ఆయన రెండో కొడుకు ఎం.ఎన్. రావు కూడా పేరున్న ఆయుర్వేద డాక్టరు. మొదటి కొడుకు అనిల్. షర్మిల మా అత్తమావలది ఖమ్మం అంటుంది. ఈ ఆంధ్రావాళ్లందరూ ఆంధ్రలో తమ మూలాలు దాచిపెట్టడానికి ఖమ్మం అంటారు. ఖమ్మంలో ప్రతీ వూరూ నాకు తెలుసు…’’ అంటూ ఏప్రిల్‌లోనే మాట్లాడారు. 2013 డిసెంబరులో ఒక వెబ్‌సైట్ యీ రమణారావు గారు తన 70వ ఏట మరణించారని, ఆయన బ్రదర్ అనిల్ తండ్రి అని రాసింది. ఈ సమాచారం ఆధారంగా కాబోలు, బ్రదర్ అనిల్ గురించి గత రెండు నెలలుగా తయారవుతున్న యూట్యూబు వీడియోల్లో ఆయన తండ్రి ఆయుర్వేద వైద్యుడు అని చెప్పేస్తున్నారు.
పదేళ్ల క్రితమే నేను విన్నదాని ప్రకారం – అనిల్ తండ్రి ఆంధ్రా బ్యాంకులో ఎజిఎమ్. హైదరాబాదులో పని చేసే రోజుల్లో కొడుకు షర్మిలతో ప్రేమలో పడడంతో ఆయనకు భయం వేసింది. వైయస్‌తో పెట్టుకుంటే జాగ్రత్త అని కొలీగ్స్ హెచ్చరించడంతో, ఎందుకైనా మంచిదని బొంబాయికి ట్రాన్స్‌ఫర్ చేయించుకుని వెళ్లిపోయారు. అనిల్ కూడా బొంబాయి వెళ్లిపోయాడు. షర్మిల మొదటి వివాహం భగ్నమయ్యాక వైయస్ అనుమతించడంతో కొడుకు షర్మిలను పెళ్లి చేసుకోవడానికి ఆయన సమ్మతించాడు. అప్పటికే అనిల్‌కు వివాహమయిందా, ఆ వివాహం ద్వారా పిల్లలున్నారా, ఆవిడకు విడాకులు యిచ్చి షర్మిలను చేసుకున్నాడా అనేది ఎవరూ చెప్పలేకుండా వున్నారు. అనిల్ కుటుంబానికి, బ్యాంకుకి సంబంధం వుందని మాత్రం జనాల్లో వుండడం చేత కాబోలు కొన్ని వీడియోల్లో ఎందుకైనా మంచిదని తండ్రి బ్యాంకు ఉద్యోగంతో బాటు ఆయుర్వేద వైద్యం చేసేవారు అని కలిపేశారు.
అసిస్టెంటు జనరల్ మేనేజర్ క్యాడరు అధికారికి యింటి దగ్గర ఆయుర్వేద వైద్యం చేసే తీరిక వుంటుందా? అబ్సర్డ్. ఏప్రిల్‌లోనే వచ్చిన ఒక సోషల్ మీడియా పోస్టులో ‘షర్మిల అత్తమామలు బాగ్ అంబర్‌పేటలో వుండేవారు. ఒరిజినల్‌గా రాజమండ్రి వారు. స్టేటుబ్యాంక్ ఆఫ్ ఇండియా నల్లకుంట బ్రాంచ్‌లో పనిచేసేవారు.’ అని వచ్చింది. పనిచేసింది అత్తో, మామో క్లారిటీ లేదు. పైన చెప్పిన మానవతా రాయ్ డాక్టరుగారి భార్యో, కుటుంబసభ్యులో బ్యాంకులో పనిచేసేవారు అన్నాడు. అనిల్ తలితండ్రుల వృత్తి గురించి నిజానికి పెద్దగా చర్చ అనవసరం. ఏదైనా మర్యాదహీనమైన పని చేసి వుంటే ప్రతికక్షులకు రాజకీయంగా ఉపయోగపడేది. కానీ వాళ్ల మూలాల గురించి చర్చ జరుగుతోంది కాబట్టి, తలిదండ్రులెవరనేది చర్చకు వస్తోంది. ఒకవేళ ఆ ఆయుర్వేదవైద్యులే అయి వుంటే, వాళ్లది రాజమండ్రిదే అయి వుంటే, అప్పుడు షర్మిల తెలంగాణ కోడలు అవుతుందా?
నిజానికి యిదో పెద్ద వివాదాస్పదమైన అంశం. తలితండ్రులు ఆంధ్రప్రాంతం నుంచి వచ్చి తెలంగాణలో సెటిలైన కేసుల్లో పిల్లలు తెలంగాణలో పుట్టినా తెలంగాణవాళ్లు అవుతారా? కారా? కారు, అని గుత్తా సుఖేందరరెడ్డి లాటి వాళ్లు హైకోర్టు న్యాయవాదుల విషయంలో వాదించారు. ‘మాయాబజారు’లో ఘటోత్కచుడు ‘బంధుబంధుబంధు…’ అన్నట్లు, ‘ఆంధ్రమూలాల వారి పిల్లలపిల్లలపిల్లలు.. ’ ఎప్పటికీ ఆంధ్రులే అని నిర్వచించారు. వాళ్లు ఆంధ్రను ఎన్నడూ చూడకపోయినా సరే, యిక్కడే పుట్టి, యిక్కడే పెరిగి, యిక్కడే బతికి. యిక్కడే చచ్చిపోయినా తెలంగాణవాదులకు వాళ్లు ఆంధ్రుల కిందే లెక్క. అనిల్ తెలంగాణలో పుట్టాడు, నేను తెలంగాణలో చదివాను కాబట్టి తెలంగాణదాన్నే అని షర్మిల అనవచ్చు. తెలంగాణవాదులు ఒప్పుకోవాలి కదా!
నిజానికి యీ పాయింటును ‘ఓపెన్ హార్ట్’లో ఆర్కె షర్మిలను అడగాల్సింది. ‘నువ్వు తెలంగాణ కోడలివి ఎలా అయ్యావో కాస్త చెప్పమ్మా’ అని. కానీ ఆర్కె అలాటి యిబ్బందికరమైన ప్రశ్నలడగ దలచుకోనట్లుంది. నీకూ మీ అన్నకూ ఆస్తితగాదాలున్నాయా? ఆయన జైలుకి వెళితే సిఎం కావడానికి నీకేమైనా ఛాన్సుందా? వంటి ప్రశ్నలడిగారు తప్ప, మీ ఆయన నేపథ్యమేమిటి? ఆయన క్రైస్తవమత ప్రచారం నీకేమైనా రాజకీయంగా యిబ్బందా అని అడగనే లేదు. అనిల్ గురించి ఆయన అడిగిన ప్రశ్న ఏమిటంటే ఎక్కడ పరిచయమైంది? తిండి దగ్గర పేచీ రాలేదా? అని. ‘ధాబాలో పరిచయమైంది. తనూ నాన్‌వెజ్ తింటాడు. తనింట్లో వాళ్లు తినరంతే.’ అని షర్మిల చెప్పింది. టీవీ ప్రేక్షకులకు వాళ్ల తిండి గురించి ఆసక్తి వుంటుందని ఆర్కె ఎందుకనుకున్నారో తెలియదు. అసలైన ఆసక్తంతా బ్రదర్ అనిల్ రియల్ స్టోరీ అంటూ యీ మధ్య వచ్చిపడుతున్న వీడియోలలో నిజానిజాల గురించి!
మీరు గమనించారో లేదో, యీ మధ్య వస్తున్న వీడియోలలో మరో అనిల్ కుమార్‌ను, షర్మిల భర్త అనిల్‌ను కలిపేస్తున్నారు. అవతలి అనిల్ 1958లో పుట్టాడు. ఈ అనిల్ 1970లో పుట్టి వుంటాడు. ఎందుకంటే షర్మిల ద్వారా క్రైస్తవం పరిచయమైందని, పెళ్లికి ముందే నాకు క్రీస్తు సాక్షాత్కరించాడని ఒక చోట, 26వ ఏట అని మరో చోట, 1996లో అని యింకో చోట అతను యింటర్వ్యూలో చెప్పాడు. దాని ప్రకారం 1970లో పుట్టి, 1996 తర్వాత (1999 కావచ్చు) పెళ్లయి వుండాలి. ఆ యింకో అనిల్ ఐఐటితో సహా అనేక పెద్ద పదవులు చదివాడు. అమెరికాలో కంపెనీలు పెట్టాడు. ఇన్‌సైడర్ ట్రేడింగు చేసి పట్టుబడి శిక్ష అనుభవించాడు. ఆయనకు భార్య వుంది. ఆయన ఎవాంజలిస్టు అవునో కాదో తెలియదు, అసలు తెలుగువాడో కాదో తెలియదు. అయినా ఆయన చరిత్రను, యితని ఫోటోలను కలిపి వీడియోలు తయారుచేసి జనం మీదకు వదిలేరు. బ్రదర్ అనిల్ మొదటి భార్య అంటూ ఒక హిందీ ఆవిణ్ని చూపిస్తున్నారు.
మొత్తం మీద టూ-ఇన్-వన్ బ్రదర్ అనిల్ మనల్ని గందరగోళానికి గురి చేస్తున్నాడు. ఎవరో కావాలని చేస్తున్న పనే యిది. ఎవరై వుంటారు? షర్మిలకు 22 ఏళ్ల క్రితం పెళ్లి కాగా, యిప్పటిదాకా లేని వివాదం తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రమే చెలరేగడమేమిటి? ఇది తెలంగాణ రాజకీయపక్షాల వారు చేస్తున్న పనా? లేక జగన్‌తో విభేదించి వచ్చిందన్న కోపంతో, వైసిపి అభిమానులు చేస్తున్న పనా? తెలియదు. ఏ వ్యక్తి గురించైనా దుష్ప్రచారం జరగడం గర్హనీయం. షర్మిల లేదా అనిల్ ఖండించేదాకా యీ ప్రచారం సాగిపోతూనే వుంటుంది. వాళ్లు ఆ పని మొదలుపెట్టగానే ‘అయితే అనిల్ తలిదండ్రుల మూలాలెక్కడ?’ వంటి ప్రశ్నలు రావచ్చు. ఆంధ్ర అని తేలితే ‘తెలంగాణ కోడలు’ స్టాంపు చెరిగిపోతుందని షర్మిల భయం కావచ్చు. అందుకే యీ ఊహాగానకచ్చేరీలు నిరంతరాయంగా సాగిపోతున్నాయి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2021)