విధేయతకు మరోసారి పట్టం కట్టిన సీఎం జగన్, రెండోసారీ ఆ నేతకే కీలక పదవి
ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (నార్త్ అమెరికా) పదవికి పండుగాయల రత్నాకర్ ను సీఎం వైయస్ జగన్ మరోసారి ఎంపిక చేశారు. ఈ మేరకు సోమవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2019 సెప్టెంబర్ మాసంలో తొలిసారి ఈ బాధ్యతలను చేపట్టిన రత్నాకర్ 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు. 2 ఏళ్ల పదవీ కాలం ముగియడంతో పదవీకాలాన్ని పొడిగిస్తూ సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే చర్యల్లో భాగంగా చేపట్టే ఈ కీలక నియామకంలో రత్నాకర్ మరోసారి చాన్స్ దక్కించుకున్నారు. క్యాబినెట్ హోదా గల ఈ పదవిని గత టీడీపీ ప్రభుత్వం ప్రముఖ పారిశ్రామిక వేత్త కోమటి జయరాంకు కట్టబెట్టింది.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి రత్నాకర్ పార్టీ విధేయుడిగా ఉన్నారు. పార్టీ ఏ పిలుపునిచ్చినా అమెరికాలో ముందుండి అన్ని కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు.
2015లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికా కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టి పార్టీకి విశేష సేవలు అందించారు. సీఎం వైయస్ జగన్, పార్టీలోని కీలక నేతలతోనే కాదు సాధారణ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులతో రత్నాకర్ మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.
రెండో సారి ఈ పదవి రావడం పట్ల ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీఎం వైయస్ జగన్ కు , పార్టీ లో ఇతర నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం వైయస్ జగన్ తన పై ఉంచిన నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెట్టుకుంటానని రత్నాకర్ తెలిపారు.
రాష్ట్ర ప్రయోజనాలు, సీఎం జగన్ గారికి మంచి పేరు తీసుకురావడమే లక్ష్యంగా తన శక్తికి మించి కష్టపడతానని పేర్కొన్నారు. సీఎం జగన్ పాలన దేశానికే ఆదర్శమని, విద్య- వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు, 3 పారిశ్రామిక కారిడార్లు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేలా స్కిల్ కాలేజీల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో సుస్థిర ప్రగతికి సీఎం వైయస్ జగన్ బాటలు వేశారని రత్నాకర్ అన్నారు.
సీఎం వైయస్ జగన్ గారు చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే దిక్సూచీగా నిలుస్తున్నాయని అన్నారు.
పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, 3 పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, 8 మేజర్ పోర్టుల నిర్మాణం, వ్యవసాయ-ఆక్వా ఉత్పత్తుల మార్కెటింగ్, తదితర ప్రత్యేక కార్యక్రమాలతో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వచ్చే మూడేళ్ళలో గొప్పగా అభివృద్ధి చెందబోతోందని,
ఇప్పటికే అనేక మల్టీ నేషనల్ కంపెనీలు రాష్ట్రాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చాయని పేర్కొన్నారు.