ఒకే ఒక్క తప్పు. జనసేనకు మొహం చెల్లకుండా చేసింది. గుంటూరు జిల్లా ఇప్పటం ఎపిసోడ్లో జనసేనాని పవన్‌కల్యాణ్ ఓవరాక్షన్ చేసి, చివరికి అభాసుపాలయ్యారు. ఇప్పటంలో అక్రమంగా తమ ఇళ్లు కూల్చి వేస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరకాటంలో నెట్టేందుకు కొందరు న్యాయస్థానాన్ని వాడుకునేందుకు ప్రయత్నించారు. అయితే నిజం దాస్తే దాగదనే సత్యాన్ని విస్మరించడం వల్ల, తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది.
ఇప్పటంలో ఆక్రమణల కూల్చివేతను అడ్డు పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందే క్రమంలో పవన్‌కల్యాణ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. సినిమాను తలపించేలా ఇప్పటానికి కారుపై ప్రయాణించడం, కొట్టండి, రక్తం చిందించండి అని పిలుపునివ్వడం పవన్‌కే చెల్లింది. అయితే ఇప్పటంలో జనసేన డ్రామాను న్యాయస్థానం బట్టబయలు చేసింది. నోటీసుల విషయమై అబద్ధాలు చెప్పి తమను తప్పు దోవ పట్టించారని హైకోర్టు ఆగ్రహించింది.
తమను మోసగించిన నేరానికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున , 14 మంది పిటిషనర్లకు రూ.14 లక్షల జరిమానాను కోర్టు విధించింది. జరిమానా ఎంతనే విషయాన్ని పక్కన పెడితే, జనసేనాని పవన్ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయింది. దీంతో హైకోర్టు తాజా తీర్పుపై ఎలా స్పందించాలో తెలియక జనసేన తేలు కుట్టిన దొంగలా వుండిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పవన్‌కల్యాణ్ ట్విటర్ అకౌంట్ చూస్తే… చివరిగా ఈ నెల 22న జగన్ ప్రభుత్వంపై వ్యంగ్య కార్టూన్ వుంది. ఇప్పటంపై జనాల్ని తప్పుదోవ పట్టించినందుకు కనీసం వారికి క్షమాపణ చెప్పాలన్న సంస్కారం కూడా జనసేన, ఆ పార్టీ అధిపతికి లేకపోవడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ చర్యల్ని సమర్థించుకోడానికి చిన్న అవకాశం కూడా లేకపోవడంతో మౌనాన్ని ఆశ్రయించడమే ఉత్తమం అని జనసేన భావిస్తున్నట్టుంది.