వైసీపీ ప్రభుత్వం ముద్దుగా పిలుచుకునే దుష్టచతుష్టయం ఏంటో అందరికీ తెలుసు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తో పాటు ఎల్లో మీడియా అధినేతల్ని కలిపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముద్దుగా, కోపంగా దుష్టచతుష్టయమని పదేపదే అంటుంటారు. దుష్ట చతుష్టయం అని విమర్శించకుండా జగన్ మీటింగ్ ముగియదు. అలాంటి దుష్ట చతుష్టయానికి జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు నీతిబోధ చేయడం విశేషం.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, పవన్‌కల్యాణ్‌లపై విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలది చవకబారు రాజకీయం అని విమర్శించారు. టీడీపీ నేతలు పనికిమాలిన ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో చిన్న సమస్యను పెద్ద సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఇప్పటంలో ఆక్రమణలను చట్టబద్ధంగా తొలగించేందుకు శ్రీకారం చుడితే, టీడీపీ, రామోజీరావు, పవన్‌కల్యాణ్ పెద్ద ఇష్యూ చేశారని అంబటి విమర్శించారు.
రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందన్నట్టుగా నానా బీభత్సం చేయడానికి ప్రయత్నించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అనుభవం లేని పవన్‌కల్యాణ్ ప్రభుత్వాన్నే కూల్చివేయాలనే దశకు వెళ్లారని విమర్శించారు. పవన్ ఓవరాక్షన్ చేశారని ధ్వజమెత్తారు. చివరికి ఏం జరిగింది? న్యాయస్థానాలకు వెళ్లారని గుర్తు చేశారు. స్టే తెచ్చుకున్నారన్నారు.
విచారణలో భండారం బయట పడిందన్నారు. ఆక్రమణదారులు అధర్మంగా ప్రవర్తించారనే సంగతి న్యాయస్థానం సాక్షిగా బయటపడిందన్నారు. కోర్టుల్ని మభ్యపెట్టి స్టే తెచ్చుకున్నారని తప్పు పట్టారు. అఫిడవిట్లో తప్పులు రాసి స్టే తెచ్చుకున్నా రన్నారు. కోర్టునే మోసం చేస్తున్నారే…ఇదెక్కడి గోల అర్థం కాలేదని అంబటి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కోర్టులనే మోసగించారంటూ ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున 14 మందికి భారీ జరిమానా కోర్టు విధించిందని ఆయన చెప్పు కొచ్చారు. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయన్నారు. దీన్నిబట్టి అర్థమయ్యేది ఏంటంటే కుట్రలు, కుతంత్రాలు ఎక్కువ కాలం నిలవవన్నారు. ఇప్పటం ఎపిసోడ్లో దుష్ట చతుష్టయం తెలుసుకోవాల్సిన నీతి ఒకటి వుందన్నారు. కుట్రలు, కుతంత్రా లతో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని అనుకుంటే చివరికి తామే అభాసుపాలు అవుతామనే నీతిని ఈ చిన్న ఘటన ద్వారా దుష్ట చతుష్టయం గ్రహిస్తే మంచిదని ఆయన హితబోధ చేయడం విశేషం.