సిగ్గు చేటు: చిన్నారిని రేప్ చేస్తే 5 గుంజీల శిక్ష

మహిళల్ని హింసించే వాళ్లకు, మానభంగం చేసిన వాళ్లకు 5 బెత్తం దెబ్బలు వేయాలంటూ అప్పట్లో ఓ రాజకీయ నాయకుడు సంచలన ప్రకటన చేసి అభాసుపాలయ్యాడు. ఇప్పుడా ప్రకటనను నిజం చేశారు బిహార్ లోని కొంతమంది…

మహిళల్ని హింసించే వాళ్లకు, మానభంగం చేసిన వాళ్లకు 5 బెత్తం దెబ్బలు వేయాలంటూ అప్పట్లో ఓ రాజకీయ నాయకుడు సంచలన ప్రకటన చేసి అభాసుపాలయ్యాడు. ఇప్పుడా ప్రకటనను నిజం చేశారు బిహార్ లోని కొంతమంది పంచాయితీ పెద్దలు. అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారని రేప్ చేసిన వ్యక్తికి 5 గుంజీల శిక్ష విధించి ఇంటికి పంపించారు.

నవాడా జిల్లాకు చెందిన అరుణ్ పండిట్ అనే వ్యక్తి ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్ కొనిస్తానని ఆశచూపించాడు. తన పౌల్డీ ఫామ్ లోపలికి తీసుకెళ్లాడు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

చిన్నారి ద్వారా జరిగిన దారుణాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు, అరుణ్ పండిట్ ను పంచాయితీలో నిలబెట్టారు. అయితే ఊహించని విధంగా అరుణ్ పండిట్ కు 5 గుంజీల శిక్ష విధించారు గ్రామ పెద్దలు. చిన్నారి అబద్ధం చెబుతోందని తీర్పు ఇచ్చారు. ఆ 5 గుంజీల శిక్ష కూడా రేప్ చేసినందుకు కాదంట. చాక్లెట్ కొనిస్తానని చెప్పి మాట తప్పినందుకంట.

తీర్పు విన్న వెంటనే సదరు నిందుతుడు, గ్రామ పెద్దల ఎదురుగానే 5 గుంజీలు తీసి ఎంచక్కా ఇంటికెళ్లిపోయాడు. ఆ టైమ్ లో ఓ వ్యక్తి ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దాన్ని మరికొంతమంది ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంకు ట్యాగ్ చేశారు. దీంతో ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది.

అక్బర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగిన ఈ ఘటనపై నవాడా జిల్లా ఎస్పీ స్పందించాడు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే అగ్రకులానికి చెందిన వ్యక్తి కావడం వల్లనే ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బిహార్ లో ఇంకా పంచాయితీల సంస్కృతి నడుస్తోందనే విషయం కూడా ఈ ఘటనతో మరోసారి బయటపడింది.