వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెల్‌ఫోన్ త్వరగా దొరకాలని ఆయన బద్ధ శత్రువు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని కోరుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఇవాళ ఆయన కుటుంబంతో కలిసి కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో కూడా ఆయన రాజకీయ విమర్శలు చేయడం గమనార్హం.
చివరికి స్వామి వారి చెంతకు వెళ్లినప్పుడు కూడా ప్రత్యర్థులనే తలచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. స్వామి వారి దర్శనం బాగా జరిగిందన్నారు. తాను స్వామి వారిని రెండే రెండు కోరికలు కోరుకున్నట్టు చెప్పారు. ఒకటి దుర్మార్గ పరిపాలన నుంచి రాష్ట్రాన్ని, పిల్లల భవిష్యత్‌ను కాపాడాలని కోరుకున్నట్టు అయ్యన్న చెప్పారు.
రెండో కోరిక గురించి కూడా ఆయన చెప్పారు. తన ఫోన్ పోయిందని పోలీస్‌స్టేషన్‌లో విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేసిన విషయాన్ని అయ్యన్న గుర్తు చేశారు. విజయసాయిరెడ్డి ఫోన్‌లో చాలా ఆధారాలున్నాయని చెప్పుకొచ్చారు. ఆ సెల్‌ఫోన్ త్వరగా దొరికేలా కటాక్షించాలని స్వామి వారిని కోరుకున్నట్టు చెప్పారు.
ఆ ఫోన్‌లో ఢిల్లీ మద్యం కుంభకోణం, విశాఖ భూకుంభకోణం వివరాలన్నీ కూడా ఉన్నాయన్నారు. ఆ ఫోన్ దొరికితే, ఆస్తులన్నీ జప్తు అయితే రాష్ట్రానికి మేలు జరుగుతుంది కాబట్టి ఫోన్ త్వరగా దొరకాలని స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్టు ఆయన చెప్పారు. దైవ సన్నిధిలో కూడా శత్రువుల గురించి ఆలోచిస్తున్నారంటే…. ఎంత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విద్వేషమయం అయ్యాయని అయ్యన్న కోరుకున్న రెండు కోరికలే నిదర్శనం.