మూవీ రివ్యూ: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

చిత్రం: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం రేటింగ్: 2.25/5 తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్‌, రఘు బాబు, శ్రీతేజ్, ప్రవీణ్‌, సంపత్ రాజ్ బ్యానర్: జీ స్టూడీయోస్‌, హస్య మూవీస్ సినిమాటోగ్రఫీ: రామ్…

చిత్రం: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
రేటింగ్: 2.25/5
తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్‌, రఘు బాబు, శ్రీతేజ్, ప్రవీణ్‌, సంపత్ రాజ్
బ్యానర్: జీ స్టూడీయోస్‌, హస్య మూవీస్
సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి
ఎడిటర్: చోటా కె. ప్రసాద్
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
నిర్మాత: రాజేష్‌ దండు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏ.ఆర్ మోహన్‌
విడుదల తేదీ: 25 నవంబర్ 2022

ఒక దశాబ్దానికి పైగా కామెడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న అల్లరి నరేష్ ఈ మధ్య కాస్త సీరియస్ బాట పట్టాడు. “నాంది” తర్వాత మళ్లీ అల్లరి నరేష్ తెర మీదకు వచ్చిన చిత్రం ఇది. సామాజిక చైతన్యానికి చెందిన కథతో తీసిన సినిమా అని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇంతకీ విషయమెలా ఉందో చూద్దాం. 

జంధ్యాల తీసిన “హైహైనాయక” సినిమాలో పెద్ద నరేష్ లాగ ఇక్కడ అల్లరి నరేష్ కూడా తెలుగు టీచర్. తన ఉద్యోగాన్ని ఎవరు తక్కువచేసి మాట్లాడినా ఒప్పుకోడు. నిజానికి ఇలాంటి ఓపెనింగ్ తో అల్లరి నరేష్ హీరో కాబట్టి కామెడీ ట్రీట్మెంట్ అయితే బాగుంటుందనిపిస్తుంది. కానీ ఇది సీరియస్ జానర్ సినిమా. 

ఇక్కడ కథలో అల్లరి నరేష్ తెలుగు టీచరైనా, హిందీ టీచరైనా పెద్దగా తేడా ఏమీ పదేది కాదు. ఎందుకంటే ఇది ఒక మారుమూల కొండ ప్రాంతంలో ఎలెక్షన్ డ్యూటీ పడిన టీచర్ కథ. 

మారేడుమిల్లి అనే సుదూర కొండ ప్రాంతంలో జనానికి ప్రజాస్వామ్యరాజకీయ వ్యవస్థ పట్ల నమ్మకముండదు. ఓట్లేయము అని భీష్మించుకుని కూర్చుంటారు. హీరో తనకున్న సామాజిక దృక్పథంతో, పని పట్ల నిబద్ధతతో, సమయస్ఫూర్తితో ఊరి జనంలో ఎటువంటి మార్పు తీసుకురావడం, తద్వారా ప్రభుత్వంలో కదలిక తీసుకురావడమనేది కథాంశం. అయితే ఇది 2017 నాటి హింది సినిమా “న్యూటన్” నుంచి దాదాపుగా తీసుకున్న స్ఫూర్తి. 

కథాంశంగా బాగానే ఉన్నా ట్రీట్మెంట్ విషయంలో మరింత కామన్ సెన్స్, ఇంకెంతో ఇంటిలిజెన్స్ చూపించాల్సింది. అవి లేకపోవడం వల్ల మంచి సబ్జెక్టే అయినా చివరికొచ్చేసరికి తేలిపోయింది. ఎక్కడా మనసుకి హత్తుకునే ఎమోషనల్ సన్నివేశాలు లేవు. విషయం ప్రేక్షకుల మెదడుకి చేరుతుంది తప్ప మనసుని పట్టుకోదు. దానికి తోడు వీరభద్రుడనే డివైన్ ఎలిమెంట్ ఈ సామాజికచైతన్యాత్మక చిత్రంలో నాన్ సింక్ అయింది. 

ఇలాంటి సినిమాలు గతంలో చాలానే ఉన్నాయి. అయితే గుర్తుంచుకోదగ్గవి ఆనాటి రుద్రవీణ, ఈనాటి జై భీం. అణగారిన ప్రజలకి అండగా నిలవడం, వాళ్లని చైతన్యపరచి మార్పు తీసుకురావడమనే ఎలిమెంట్స్ ఆ సినిమాల్లో మనసుని హత్తుకునేలాగ తీయగలిగారు. అంతటి స్థాయిలో తెరకెక్కించగల సత్తా ఉన్న పాయింటిది. కానీ రచన మరియు ఎగ్జిక్యూషన్లో ఆ రేంజుని అందుకోలేక సాదాసీదాగా నిలిచిపోయింది. 

సంభాషణలు ఒకటి రెండు చోట్ల మెరిసినా ఓవరాల్ గా జస్ట్ ఏవరేజ్. “రెయిన్ రెయిన్ గో ఎవే” చుట్టూ నడిపిన సంభాషణ యూట్యూబ్ ప్రవచనాల్లోనూ, వాట్సాపుల్లోనూ పలుసార్లు చక్కర్లు కొట్టినదే తప్ప ఒరిజినల్ అనిపించుకోదు. 

సంగీత సాహిత్యాల పరంగా “లచ్చిమి…” పాట ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా అడవి వాతావరణాన్ని క్యాప్చర్ చేసిన కెమెరా వర్క్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు కానీ మరింత గ్రిప్పింగ్ గా చేసుండాల్సింది. సన్నివేశం వీక్ గా ఉన్నప్పుడు ప్రేక్షకుల్ని డైవర్ట్ అవ్వకుండా చూడాల్సిన పని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దే. ఇక్కడది జరగలేదు. 

దర్శకత్వపరంగా చూస్తే ఈ సింగిల్ పాయింట్ కథలో చాలా అంశాలు పెట్టేయలనుకున్నారు తప్ప అవసరం, ఔచిత్యం చూసుకోలేదు. పైన చెప్పుకున్నట్టు ఇక్కడ హీరో తెలుగు టీచరైనా మరో టీచరైనా తేడా ఉండేది కాదు. అలాగే కలెక్టర్ ని ఒక మ్యానిప్యులేటరైన రాజనీయనాయకుడిలాగ చూపించడం, ఆ తరువాత క్రమంలో వచ్చే ఎద్దు సీన్.. అన్నీ కృతకంగా ఉండి తేడా కొట్టించాయి. అదేంటో గానీ, ఈ కథలో ఎవ్వరైనే సరే ప్రాణం మీదకొస్తే తప్ప మారరు..అది ఊరి జనమైనా, కలెక్టరైనా సరే. 

ఊళ్లో జనమంతా ఒకలాగుంటే హీరోయిన్ ఆనంది మాత్రం గ్లామరస్ గానే కనిపించింది. ఆమెలో ఆ కొండప్రాంత లక్షణాలుండవు. ఈ మధ్యన వచ్చిన “కాంతార” లో హీరోయిన్ పాత్ర కూడా కథకు తగినట్టుగా డీగ్లామర్స్ గా ఉండి కన్విన్సింగ్ గా అనిపించింది. ఇక్కడ మాత్రం హీరోయినంటే “ఈ మాత్రం ఉండాలి” అనే లెక్కలో ఒక మామూలు టౌనమ్మాయిలా చూపించారు. 

అల్లరి నరేష్ ఎప్పటిలాగానే తన ఈజ్ తో ఈజీగా చేసేసాడు. అతను గతంలో చేసిన కామెడీ సినిమాల్లో లాజిక్కులు, ఇంటిలిజెన్స్ మిస్సైనా నడిచిపోయింది కానీ సీరియస్ సబ్జెక్ట్స్ ఎంచుకున్నప్పుడు మాత్రం వాటి మీద బలంగా దృష్టి పెట్టాలి. 

వెన్నెల కిషోర్ ఉన్నంతలో కాస్త కామెడీ అందించాడు. కానీ ఇంగ్లీష్ టీచరని చెప్పినందుకైనా ఆ ట్రాక్ లో కామెడీ నడిపుండాల్సింది. ప్రవీణ్ ని పూర్తిగా వాడుకోలేదు. సంపత్ కలెక్టర్ గా కంటే మఫ్టీలో ఉన్న ఎస్పీలా ఉన్నాడు. జెమిని సురేష్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే ఉంది. 

డాక్యుమెంటరీని తలపిస్తూ, ఈ మధ్యన రానా హీరోగా వచ్చిన “అరణ్య” ని గుర్తుచేస్తూ అడవుల్లో సాగుతూ ఉండే ఈ సినిమాని ఆదరించాలంటే పెద్దమనసే ఉండాలి. అల్లరి నరేష్ సినిమాల నుంచి ఆశించేది అదే అయితే ఏమో గానీ లేకపోతే కష్టమే. 

బాటం లైన్: నిట్టూర్చిన ప్రేక్షక ప్రజానీకం