అక్క‌డి నుంచే బ‌రిలో రేవంత్‌!

ఈ ద‌ఫా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే వ‌రుస‌గా రెండుసార్లు బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముచ్చ‌ట‌గా మూడోసారి కూడా అధికారంలోకి వ‌స్తామ‌నే ధీమా ఆ పార్టీ నుంచి వ్య‌క్తం అవుతోంది.…

ఈ ద‌ఫా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే వ‌రుస‌గా రెండుసార్లు బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముచ్చ‌ట‌గా మూడోసారి కూడా అధికారంలోకి వ‌స్తామ‌నే ధీమా ఆ పార్టీ నుంచి వ్య‌క్తం అవుతోంది. అయితే క్షేత్ర‌స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూల‌త క‌నిపిస్తోంది. ఇది ఆ పార్టీని అధికారంలోకి తెస్తుందా? అనేది ప్ర‌శ్నార్థ‌క‌మే.

టీపీసీసీకి సార‌థ్యం వ‌హిస్తున్న రేవంత్‌రెడ్డి తామే అధికారంలోకి వ‌స్తామ‌నే ధీమాతో ఉన్నారు. అంతేకాదు, తానే ముఖ్య‌మంత్రి అవుతాన‌ని ఆయ‌న న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రైతులు బ్యాంకు నుంచి రూ.2 ల‌క్ష‌ల రుణం తెచ్చుకోవాల‌ని, అధికారంలోకి రాగానే తాను మాఫీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు కూడా. దీన్నిబ‌ట్టి మ‌న‌సులో ఉన్న‌ది బ‌య‌ట ప‌డిన‌ట్టైంది.

ఈ నేప‌థ్యంలో మ‌రోసారి తాను కొడంగ‌ల్ నుంచే ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బ‌రిలో దిగ‌నున్న‌ట్టు రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఈ మేర‌కు ఆయ‌న ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 2009, 2014ల‌లో ఆయ‌న టీడీపీ త‌ర‌పున కొడంగ‌ల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ త‌ర్వాత ఆయ‌న కాంగ్రెస్‌లో చేరారు. 2018లో బీఆర్ఎస్ ప‌ట్టుప‌ట్టి రేవంత్‌ను ఓడించింది. రేవంత్‌పై బీఆర్ఎస్ అభ్య‌ర్థి ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డి గెలిచారు. 2019లో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజ్‌గిరి నుంచి లోక్‌స‌భ‌కు రేవంత్‌రెడ్డి ఎన్నిక‌య్యారు.

కాంగ్రెస్‌లో త‌న ప‌ట్టు పెంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సార‌థ్యం వ‌హించే స్థాయికి ఎదిగారు. ఇప్పుడాయ‌న సీఎం రేస్‌లో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఇప్పుడా పార్టీకి అత్య‌వ‌స‌రం లేదంటే ఆ పార్టీ మ‌నుగ‌డ ఏమ‌వుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. కొడంగ‌ల్ స్థానానికి ద‌ర‌ఖాస్తు చేసిన సంద‌ర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ త‌న‌ను ఆశీర్వ‌దించాల‌ని కోరారు.

కొడంగల్ నియోజ‌క‌వ‌ర్గానికి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసిందేమీ లేద‌న్నారు. గ‌జ్వేల్‌లో కేసీఆర్ ఓడిపోతాడ‌నే భ‌యంతోనే అక్క‌డి నుంచి పారిపోతున్నార‌ని విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం. అభివృద్ధి చేయ‌డ‌మే కాంగ్రెస్ విధాన‌మ‌ని ఆయ‌న అన్నారు.