ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. విమర్శలు హద్దులు దాటి రాయలేని భాషలో తిట్టుకునే స్థాయికి దిగజారారు. ఇందుకు ఏ పార్టీని మినహాయించాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీలు దొందు దొందే అని అభిప్రాయం వుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడి అరెస్ట్ గురించి మంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు.
చంద్రబాబు 14 ఏళ్ల పాటు అధికారంలో వుండి లక్ష కోట్లు దోచి సింగపూర్‌కు తరలించారని ఆరోపించారు. సింగపూర్‌లో బాబు నియమించుకున్న బినామీని అక్కడి ప్రభుత్వం ఇటీవల అరెస్ట్ చేసిందని మంత్రి చెప్పుకొచ్చారు. నెక్స్ట్ అరెస్ట్ చంద్రబాబే అని ఆయన జోస్యం చెప్పడం విశేషం. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని చెప్పింది చేయడం పవన్‌కు అలవాటే అని విమర్శించారు.
విశాఖలో రుషికొండపై కడుతున్నది ప్రభుత్వ భవనాలే తప్ప, ప్రైవేట్ భవనాలు కావని మంత్రి స్పష్టం చేశారు. విశాఖలో గీతం యూనివర్సిటీకి, అలాగే రామానాయుడు స్టూడియోకి ఎవరి హయాంలో స్థలాలు కేటాయించారో చెప్పాలని మంత్రి కొట్టు డిమాండ్ చేశారు. లోకేశ్ పాదయాత్ర యువగళం కాదు, గందరగోళమని ఆయన సెటైర్ విసిరారు. లోకేశ్‌కు దమ్ముంటే గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు.
బీజేపీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ, ద్వంద్వ విధానాలతో వ్యవహరిస్తోందని మంత్రి విమర్శించారు. రాజధానిపై బీజేపీ భిన్న వైఖరుల్ని వ్యక్తం చేస్తోందని ఆయన తప్పు పట్టారు. కర్నూలు, విశాఖ రాజధానులుగా ఉండాలని ఆ పార్టీనే చెబుతోందని, మళ్లీ అమరావతే రాజధాని అని బీజేపీ నేతలు అంటున్నారని విమర్శించారు.