మూవీ రివ్యూ: కింగ్ ఆఫ్ కొత్త

చిత్రం: కింగ్ ఆఫ్ కొత్త రేటింగ్: 1.5/5 తారాగణం: డుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, షబీర్ కల్లరక్కల్, ప్రసన్న, గోకుల్ సురేష్, చంబన్ వినోద్ జోస్, షమ్మి తిలకన్, అనిఖ సురేంద్రన్, నైలా ఉష…

చిత్రం: కింగ్ ఆఫ్ కొత్త
రేటింగ్: 1.5/5
తారాగణం:
డుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, షబీర్ కల్లరక్కల్, ప్రసన్న, గోకుల్ సురేష్, చంబన్ వినోద్ జోస్, షమ్మి తిలకన్, అనిఖ సురేంద్రన్, నైలా ఉష తదితరులు 
కెమెరా: నిమిష్ రవి
ఎడిటింగ్: ఉమా శంకర్ శతపతి
సంగీతం: జేక్స్ బిజోయ్, షాన్ రెహ్మాన్
నిర్మాత: వేఫేరర్ ఫిలింస్, జీ స్టూడియోస్
దర్శకత్వం: అభిలాష్ జోషి
విడుదల తేదీ: 24 ఆగస్ట్ 2023

ఆమధ్య మహానటి, ఈ మధ్య సీతారామం సూపర్ హిట్ అవ్వడంతో డుల్కర్ సల్మాన్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకి కొన్ని అంచనాలుంటున్నాయి. ప్రతి సారి అంత సాఫ్ట్ సినిమాలు కాకుండా కాస్తంత ఫ్లావర్ మార్చినా ఇతని సినిమాలు చూడడానికి థియేటర్స్ వైపు అడుగులేసేవాళ్లుంటున్నారు. “కింగ్ ఆఫ్ కొత్త” పేరుతో ప్యాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ సినిమాలో ఏముందో చూద్దాం.

1996లో కొత్త అనే ఊరిలో మొదలై, అక్కడే 1986 నాటి ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లి, మధ్యలో లక్నోని టచ్ చేసి చివరికి సిమ్లాలో తేలే కథ ఇది. 

1996లో కొత్తకి ఒక కొత్త సీఐ (ప్రసన్న) వస్తాడు. అక్కడతనికి కన్న (షబీర్) అనే డాన్ గురించి తెలుస్తుంది. ఆ ఊరంతా అతని కబ్జాలో ఉంటుంది. అతనే ప్రభుత్వం, అతనే శాసనం అన్నమాట. ఈ సీఐ ఆ కన్న ని తలబడే క్రమంలో కథ 1986 కి వెళ్తుంది. రాజు (డుల్కర్), కన్నా చిన్ననాటి మిత్రులు. ఇద్దరూ ఒకటే గ్యాంగులో ఉంటారు. కానీ కొన్ని అభిప్రాయబేధాల వల్ల ఇద్దరూ విడిపోవడం, రాజు చేతిలో కన్నా చావు దెబ్బ తినడం, రాజుపై కన్నా తన ప్రతీకారాన్ని తీర్చుకునే ప్రయత్నం..మళ్లీ 1996లో రాజు కొత్తాకి తిరిగిరావడం, ఆ పైన ఏం జరుగుతుందనేని క్లైమాక్స్. 

టైటిల్లో “కొత్త” ఉన్నా కథలో పెద్దగా “కొత్త”దనం ఏమీ లేదు కదా! పోనీ కథనమో? అది చెప్పక్కర్లేదు. 

తెర మీద పాత్రలు భావోద్వేగాలకు లోనౌతున్నా ప్రేక్షకులకి చీమకుట్టినట్టు కూడా అనిపించకుండా, తెర మీద ఎవరు చస్తున్నా ప్రేక్షకులకి ఎలాంటి ఎమోషన్ కలగకుండా, కామెడీ లాంటిది జరుగుతున్నా కనీసం సెంటిమీటరు నవ్వు కూడా తెప్పించకుండా..ఉత్సాహంగా కూర్చున్న జనాన్ని జీవచ్ఛవాల్లా మార్చిన ట్యాలెంటు ఈ దర్శకుడిది. తన మానాన తాను కథ చెప్పుకుపోంటూ పోవడం తప్పితే అసలా కథనం తెర మీద ఎలా ఉంటుందో ప్రేక్షకుల షూస్ లో నిలబడి ఊహించలేకపోయాడు దర్శకుడు.

అన్నీ పాత చింతకాయ సీన్లు, ప్రెడిక్టిబుల్ ఫ్లాష్ బ్యాకులు, పేలవమైన ట్విస్టులు, ట్రోలింగ్ చేసుకోదగ్గ క్లైమాక్స్..వెరసి ఈ చిత్రం చిత్రహింసలు పెడుతుంది. 

ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలన్, ఒక ఫ్లాష్ బ్యాక్..ఇంతకు మించి వివరంగా దీని గురించి చెప్పాలన్నా కూడా నీరసం ఆవరిస్తుంది. 

ఎంతసేపూ స్లో మోషన్ సీన్లు, నోట్లో సిగరెట్లు; హీరోకే కాకుండా ప్రతి క్యారెక్టరుకీ ఎంతో కొంత ఇవే బిల్డప్పులు. 

ఇక డెడ్ బాడీ దగ్గర ఒక సీనుంటుంది. అది కామెడీయా, సీరియస్సా అర్ధం చెప్పినవాళ్లకి ఐన్ స్టీన్ కంటే ఎక్కువ ఐక్యూ ఉందని నిర్ధారించొచ్చు. 

డుల్కర్ సల్మాన్ నటన గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ ఇందులో తన క్యారెక్టర్ డిజైన్ కొత్తగా ఉన్నా నేపథ్యంలో డెప్త్ లేకపోవడం వల్ల తేలిపోయినట్టయ్యింది. కేవలం క్లాస్ ఇమేజ్ నుంచి పక్కకొచ్చి తనలోని వైవిధ్యం చూపించుకోవడానికి ఈ మాస్ సినిమా చేసినట్టుందంతే.

ఐశ్వర్య లక్ష్మి పాత్ర ఫోర్స్డ్ గా ఉంది…హీరోయిన్ ఉండాలి కాబట్టి అన్నట్టుగా!

కన్నాగా కనిపించిన షబీర్ ది మొదట్లో ప్రామిసింగ్ పాత్రలాగ అనిపిస్తుంది. కానీ క్రమంగా అది కూడా వీకౌతూ వచ్చింది. 

మంజుగా నైలా ఉష పవర్ఫుల్ గా కనిపించింది. ఆమె ట్రాక్ ఓకే కానీ కథనంలో సరిగా బ్లెండ్ కాలేదు. 

బట్లర్ ఇంగ్లీష్ తో నవ్వించే ప్రయత్నం చేసిన చంబన్ ఓకే. హీరో తండ్రిగా షమ్మి తిలకన్ పాత్ర బాగుంది. 

సాంకేతికంగా ఈ సినిమాలో చెప్పుకోవడానికేమీ పెద్దగా లేదు. ఇలాంటి సినిమాలకి నేపథ్య సంగీతం చాలా కీలకం. కథనం ఎలా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటే గట్టెక్కేసినవి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ అదృష్టం కూడా కలగలేదు. 

సినిమాలో ఒక్కక్కొడూ చచ్చిపోతుంటే హీరోతో సహా అందరూ పోతే బాగుండు…త్వరగా ఇంటికెళ్లిపోవచ్చు అనే ఫీలింగొస్తుంది ప్రేక్షకులకి. 

దర్శకుడికి క్యారెక్టైరైజేషన్స్ మీద పట్టు లేదని చెప్పడానికి క్లైమాక్సులో ఫైట్ సీనొకటుంది. హీరో ఒక్కొక్క గ్యాంగ్ మేన్ ని చంపుతుంటే మిగిలినవాళ్లు తన అన్నయ్యో, కొడుకో పోయినట్టు ఎమోషనలైపోతుంతారు. అప్పటి వరకు కర్కశంగా కనిపించినవాళ్లు సడెన్ గా ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో అర్ధమవ్వదు. 

ఇక చివరాఖర్న గ్యాంగంతా చచ్చిపోయారు..హమ్మయ్య..అనుకునే లోపు విలన్ మరొక స్పెషల్ గాంగ్ ని దింపుతాడు. వాళ్లందర్నీ చంపడానికి హీరోగారు తగిన సమయం తీసుకుంటూంటే కుర్చీల్లోంచి అప్పటికే లేచిన జనం తెగిన గాలిపటాల్లా మళ్లీ కుర్చీల్లో కూలబడ్డారు. 

ఫైటంతా అయ్యాక హీరో విలన్ కి గన్ను పెట్టి తాను చంపనని, ఆ అవకాశాన్ని ఇంకొకడికి ఇస్తున్నాని చెప్పి ఒకడిని ప్రవేశపెడతాడు. వాడెవడో మనకి అర్ధం కావడానికి కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్లొస్తాయి. పోనీ అదేమైనా ఆ సీనుకి న్యాయం చేసే పాత్రా అంటే అదీ కాదు.

ఆ టైములో “నేను వాడి చేతుల్లో చావను..నీ చేతుల్లోనే చస్తాను..” అంటూ విలన్ హీరోని వేడుకుంటాడు. మొత్తానికి విలన్ తన కోరిక తీరకుండానే చస్తాడు. 

ఈ సుదీర్ఘ క్లైమాక్స్ టార్చర్ ని తట్టుకుని కొన ఊపిరితో ఉన్న ప్రేక్షకులకి సీను సిమ్లాకి చేరుతుంది. 

అక్కడ హీరోకి ఒక ఫోన్ కాలొస్తుంది. 

“దమ్ముంటే రారా చూసుకుందాం” అంటాడు అవతల వ్యక్తితో మన హీరో! అదే సినిమాలో చివరి వాక్యం. 

అదే ఈ సినిమా ప్రేక్షకుడికి విసిరే చాలెంజ్ కూడా అనుకోవాలి! ఇంత చెప్పాకా కూడా దమ్ముంటే వెళ్లండి. 

బాటం లైన్: “కొత్త”టార్చర్