తెలంగాణలో మరో అధికార పార్టీ ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. దీంతో వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టులో గట్టి షాక్ తగులుతున్నట్టైంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారనే అభియోగంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆయన ఎమ్మెల్యే గిరిపై అనర్హత వేటు వేయడంతో పాటు రూ.3 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తంలో డీకే అరుణకు రూ.50 వేలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.
అంతేకాదు, కృష్ణమోహన్‌రెడ్డిపై ఓడిపోయిన డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని హైకోర్టు ఆదేశించడం విశేషం. ఆ మధ్య కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై ఇలాంటి కేసులోనే తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. వనమా ఎన్నిక చెల్లదని, ఆయనపై ఓడిపోయిన జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించడం సంచలనం రేకెత్తించింది.
అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానంలో వనమాకు ఊరట దక్కింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. ఇదిలా వుండగా 2018లో కాంగ్రెస్ తరపున డీకే అరుణ పోటీ చేశారు. టీఆర్ఎస్ తరపున బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బరిలో నిలిచారు. తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ డీకే అరుణ కోర్టును ఆశ్రయించారు. ఆమెకు సానుకూల తీర్పు లభించడం విశేషం.
తెలంగాణలో వివిధ కారణాలతో మంత్రులు, అధిక శాతం అధికార పార్టీ ఎమ్మెల్యేలు న్యాయస్థానాల్లో అనర్హత కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే న్యాయస్థానాల్లో సుదీర్ఘ కాలం విచారణ పేరుతో కాలయాపన జరుగుతోంది. గద్వాల అధికార పార్టీ ఎమ్మెల్యే తాజాగా తనకొచ్చిన వ్యతిరేక తీర్పుపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.