ఏవైనా మొక్కులు మొక్కుకోవడం, కోరిక తీరిన తర్వాత మొక్కు తీర్చుకోవడం సహజం. ఈ క్రమంలో దేవాలయాల్లోని హుండీల్లోకి భారీగా నగదు, నగలు వచ్చి చేరుతుంటాయి. అయితే ఎక్కడైనా అవినీతి, అవకతవకలు జరుగుతాయేమో కానీ.. ఈ మొక్కులు-కానుకల విషయంలో మాత్రం ఎలాంటి తేడా జరగదు. ఎందుకంటే, దేవుడంటే అందరికీ భయమే.
అయితే ఇక్కడో భక్తుడు మాత్రం కాస్త తేడాగా ఉన్నాడు. ఏకంగా దేవుడికే ఎగనామం పెట్టాడు. అతడు వేసిన చెక్ బౌన్స్ అయింది.
సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో నిన్న హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. హుండీ తెరిచి లెక్కిస్తున్నారు అధికారులు. అందులో ఓ చెక్ అధికారుల కంటపడింది. చూస్తే, అందులో ఏకంగా 100 కోట్ల రూపాయలు రాసి ఉంది. దీంతో అంతా అవాక్కయ్యారు. ఆలయానికి ఒకేసారి వంద కోట్ల రూపాయలు వచ్చిందని సంబర పడ్డారు.
అయితే ఇంకాస్త జాగ్రత్తగా గమనిస్తే, అసలు మేటర్ బయటపడింది. వంద కోట్లు అంటూ అంకెలు వేసిన దగ్గర ఓ దిద్దివేత ఉంది. అంతేకాదు, చెక్ పై డేట్ కూడా లేదు. చెక్కుపై బొడ్డేపల్లి రాధాకృష్ణ అనే వ్యక్తి సంతకం మాత్రం ఉంది.
సరే.. ఎలాగోలా మేనేజ్ చేద్దాం అనుకున్నారు అధికారులు. బ్యాంక్ సిబ్బందితో మాట్లాడి చెక్ చెల్లుబాటు అయ్యేలా చేయాలని ప్రయత్నించారు. అక్కడే అసలైన షాక్ తగిలింది. సదరు ఎకౌంట్ లో కేవలం కేవలం 17 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. చెక్ పై మాత్రం వంద కోట్లు రాసి ఉంది.
చెక్ చేయకుండా ఈ చెక్ ను బ్యాంకులో వేసినట్టయితే కచ్చితంగా బౌన్స్ అయ్యేది. అలా ఓ చెల్లని చెక్కును దేవుడికి సమర్పించుకున్నాడు బొడ్డేపల్లి రాధాకృష్ణ అనే అజ్ఞాత(న) భక్తుడు.