‘మా’ ఎన్నికల నేపథ్యంలో నటుల మనసులో మాటలు బయటికొస్తున్నాయి. పరస్పరం విమర్శలతో ‘మా’ ఎన్నికలను హీటెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీగా సీనియర్ నటి జీవితా రాజశేఖర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ప్రధాన ప్రత్యర్థి మంచు విష్ణు ప్యానల్ నుంచి పోటీ చేస్తున్న పృథ్వీ ఆరోపణలు తనకెంతో బాధ కలిగించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నామినేషన్ అనంతరం జీవిత మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి ఎన్నికల కంటే ‘మా’ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయన్నారు. ఎన్ని వివాదాలు వచ్చినా తామంతా ఒక్కటే కుటుంబమని జీవిత వెల్లడించారు. వ్యక్తిగత ఆరోపణలతో పరిశ్రమ పరువు తీయొద్దని ఆమె వేడుకున్నారు.
నటుడు పృథ్వీ ఆరోపణలు తనకు చాలా బాధ కలిగించాయన్నారు. పృథ్వీ వ్యాఖ్యలు చిన్న పిల్లాడిలా ఉన్నాయన్నారు. ‘మా’ అనేది తలెత్తుకొని ఉండాలన్నారు. రెండు ప్యానెల్స్ గురించి మాట్లాడటం బాధగా ఉందన్నారు. ఈ ఎన్నికలను తప్పుదారి పట్టించవద్దన్నారు కోరారు.
ఒకొరినొకరు కించపరుచుకోకుండా ఎన్నికలు సజావుగా జరగాలని ఆకాంక్షించారు. సినీ పరిశ్రమలో రెండు గ్రూపులు ఎందుకు ఉండ కూడదని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీతత్వమే తప్ప శత్రుత్వం లేదన్నారు. రానున్న రోజుల్లో నటీనటుల మధ్య ఇంకెన్ని మాటల మంటలు చెలరేగుతాయో అనే టాక్ నడుస్తోంది.