డైరక్టర్ క్రిష్ ఓ కథ టేకప్ చేసారు అంటే అందులో ఏదో ఓ నావెల్ పాయింట్ వుండి వుండాలి. ఆ నమ్మకం వుంది ప్రేక్షకులకు. ఆయన లేటెస్ట్ సినిమా కొండపొలం. ఓ నవల ఆధారంగా తయారుచేస్తున్న ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది.
ఉన్న ఊళ్లో సదుపాయాలు లేక కొండచరియల్లో గొర్రలు మేపడానికి వెళ్లే వాళ్ల వెతలు. సరైన ఉద్యోగం దొరక్క మందతో కలిసి బతకడానికి డిసైడ్ అయిన కుర్రాడు, ఇలా కష్టాల్లో వున్నవాళ్లను కూడా దోచుకునే దొంగలు, ఇవన్నీ కాక, గొర్రెలను పొట్టన పెట్టుకునే పులి. వీటన్నింటి మధ్య నడిచిన కథగా కనిపించింది క్రిష్ కొండపొలం ట్రయిలర్.
మొదట్లో ఈ సినిమాలో గ్రాఫిక్స్ కీలకంగా వుంటాయని, లయన్ కింగ్ టైపులో వుంటుందని వార్తలు వినిపించాయి. కానీ ట్రయిలర్ లో ఆ హంగామా ఏమీ కనిపించలేదు. పైగా ఆఫ్ బీట్ సినిమా మాదిరిగా క్యారెక్టర్లు, డైలాగులు, సీన్లు పరుచుకున్నాయి.
ట్రయిలర్ లో చిత్రంగా కనిపించిన ఓ అంశం ఏమిటంటే వైష్ణవ్ తేజ్ నటన. డైలాగులు అన్నీ పాఠాలు అప్పగించిన చందంగా వుంది. కళ్లలో ఎక్స్ ప్రెషన్ కనిపించలేదు. తొలిసినిమా లో అంత హుషారుగా చేసిన కుర్రాడు మలి సినిమాకు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో మరి? అడవి విజువల్స్ కూడా యావరేజ్ గా వున్నాయి. తప్ప ఆసక్తి కరంగా అయితే కాదు.