ఇటీవల ఓ సినిమా ఫంక్షన్లో జనసేనాని పవన్‌కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన తీవ్ర విమర్శలు వివాదాన్ని సృష్టించాయి. పవన్ వ్యాఖ్యలపై సినీ రంగం నుంచి మద్దతు కొరవడింది. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్ష పదవికి ఇవాళ నామినేషన్ వేసిన ప్రకాశ్‌రాజ్ తనదైన స్టైల్లో స్పందించారు. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే ప్రకాశ్‌రాజ్… ఇక్కడ మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు కనిపించింది.
పవన్ వ్యాఖ్యలపై నేరుగా మాట్లాడేందుకు ఆయన వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది. తన ప్యానల్ సభ్యులతో కలిసి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇవి ఎన్నికలు కాదని, పోటీ మాత్రమేనని స్పష్టత ఇచ్చారు. గెలిపించేది, ఓడించేది ఓటర్లే అని తెలిపారు.
పవన్ రాజకీయ విమర్శలపై ఆయన స్పందన ఆసక్తికరంగా ఉంది. పవన్‌కల్యాణ్ ఒక రాజకీయ నాయకుడన్నారు. దేశం కోసం పోరాడుతున్నారని తెలిపారు. పవన్ మంచి నాయకుడన్నారు. ఆయనకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయన్నారు. పవన్ కూడా ‘మా’ అసోసియేషన్ మెంబరే అని పేర్కొన్నారు.
ఎవరు ఏం చెప్పినా మంచి కోసమే మాట్లాడతారని ప్రకాశ్‌రాజ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలు.. దానికి వచ్చే ప్రతిఫలం బట్టి ముందుకు వెళ్దామని తెలిపారు. ప్రతి ఒక్కరిలోనూ ఆవేశం, ప్రేమ ఉంటాయని, వాళ్లని మాట్లాడనివ్వాలని ప్రకాశ్‌రాజ్ కోరారు.
తన ప్యానెల్ లక్ష్యం ‘మా’ అభ్యు దయం కోసం పని చేయడమే అని స్పష్టత ఇచ్చారు. రాజకీయ వ్యాఖ్యలపై దయచేసి ఎవరూ ప్రశ్నించవద్దని ప్రకాశ్‌రాజ్ విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఎవరేం చెప్పినా మంచికోసమే అంటూనే, రాజకీయ వ్యాఖ్యలపై ప్రశ్నించొద్దని ప్రకాశ్‌రాజ్ కోరుకోవడంలో ఉద్దేశం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
తానేం మాట్లాడినా ‘మా’ అసోసియేషన్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన ప్రకాశ్‌రాజ్ మాటల్లో కనిపించిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పవన్ వ్యాఖ్యలపై కాకుండా, ఇతరత్రా అంశాలపైనే ప్రకాశ్‌రాజ్ ఎక్కువగా స్పందించడాన్ని టాలీవుడ్ జాగ్రత్తగా గమనిస్తోంది.
మరోవైపు మెగా అనుచరుల ఓట్లను దక్కించుకునేందుకు పవన్‌ను వెనకేసుకొచ్చారనే వాళ్లు కూడా లేకపోలేదు. మొత్తానికి ప్రకాశ్‌రాజ్ తప్పించుకునేందుకే ప్రయత్నించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.