చరిత్ర తిరగరాసే ప్రయత్నం మరో వక్రీకరణ కారాదు!

‘‘చరిత్ర అంటేనే గెలిచిన వాళ్లను పొగుడుతూ రాసే రచన’’ అనే నిర్వచనం మనకు అనేక సందర్భాల్లో వినిపిస్తూ ఉంటుంది. ఏ పురాణంలోనైనా, ఏ తరంలోనైనా జరిగేది ఇదే. ఓడిపోయిన వాళ్ల త్యాగాల గళం.. చరిత్ర…

‘‘చరిత్ర అంటేనే గెలిచిన వాళ్లను పొగుడుతూ రాసే రచన’’ అనే నిర్వచనం మనకు అనేక సందర్భాల్లో వినిపిస్తూ ఉంటుంది. ఏ పురాణంలోనైనా, ఏ తరంలోనైనా జరిగేది ఇదే. ఓడిపోయిన వాళ్ల త్యాగాల గళం.. చరిత్ర పుస్తకాల్లో మనకు కనిపించదు. అందుకే చాలా మంది అంటూ ఉంటారు.. రామాయణాన్ని లంకవాసులు రాసిఉంటే.. రావణుడు హీరోగా ఉండేవాడేమో అని! రామాయణం వరకు ఏమో గానీ.. చరిత్రపుస్తకాల్లోని చాలా విషయాలకు సంబంధించి ఇది వాస్తవమే. 

అయితే.. నిష్పాక్షికంగా వాటిని తూకం వేసి నిజాలు రాసే వారెవ్వరు? ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా.. ఏకపక్ష భావజాలాలతో మగ్గిపోతున్నవే అవుతుండగా.. చరిత్రను తిరగరాయడానికి పూనుకుంటే.. అప్పుడు మాత్రం వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే గ్యారంటీ ఉందా? ఇలాంటి అనేకానేక సందేహాల నడుమ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తేనెతుట్టెను కదిపారు. చరిత్రను తిరగరాయాలని ఆయన పిలుపు ఇచ్చారు. అలాంటి వారికి కేంద్రం అండగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చారు. 

అసలే ఇప్పటికే కేంద్రం అండ చూసుకుని.. అనేకానేక మంది తమకు తోచిన విషయాలను చరిత్ర కింద రాసేస్తున్నారు. ఏదో ఒక చిన్న ఆధారాలను పట్టుకుని.. పాతచరిత్రలను మార్చిరాసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది ప్రభుత్వమే ఇలాంటి భరోసా ఇచ్చిన తర్వాత.. ఇక ప్రభువు మనసెరిగి నడుచుకోవడంలో ముందుండే గణాలు.. కేంద్రం గుడ్ లుక్స్ లోకి వెళ్లేలా.. ఎన్ని రకాల కొత్త చరిత్ర వక్రీకరణలు చేస్తాయో అనే భయం ప్రజల్లో కలుగుతోంది. 

ఈ గొడవంతా లచిత్ బర్ఫకన్ అనే యోధుడి 400 జయంతి వల్ల వచ్చింది. 1670 ప్రాంతంలో అహోం సామ్రాజ్యం (ప్రస్తుత అసోం) లోకి మొఘల్ సేనలు విస్తరించకుండా నిలవరించిన యోధుడు బర్ఫకన్. అలాంటి వీరుల కథలు నిజంగానే మన చరిత్ర పుస్తకాల్లో లేవు. ఆయన జయంతి కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ..  చరిత్రను తిరగరాయాలని పిలుపు ఇచ్చారు. 

ఈ అంశం నిజమే కావొచ్చు. ఎందుకంటే.. మొఘలులకు ముందూ వెనుకా కూడా వారి వారి సామ్రాజ్య విస్తరణను అడ్డుకున్న వందలాది మంది యోధుల వీరత్వాలు, త్యాగాలు కాలగర్భంలోనే మిగిలిపోయాయి. చరిత్ర పుస్తకాలలో అవి లేవు. కేవలం ఆయా ప్రాంతాల స్థానికుల జానపద గాథలలో మాత్రమే ఆ వీరత్వాలు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి గాథలన్నింటినీ వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది.  కేవలం ఆ కాలంలోనే కాదు, బ్రిటిషు హయాంలో జరిగిన విషయాలపై కూడా సరైన చరిత్ర మనకు లేదు. 

అయితే.. ఇలాంటి ప్రయత్నంలో పూర్తిగా ఉన్న చరిత్రను వక్రీకరించేయడం.. ప్రస్తుతం మోడీ పాలనలో హిందూత్వ హవా నడుస్తున్నది గనుక.. చరిత్రను మొత్తం కాషాయీకరించేయడం జరిగితే మాత్రం.. అది ఈ దేశానికి ఈ ప్రభుత్వం చేయగలిగిన అతి పెద్ద ద్రోహం అవుతుంది. అందుకని.. చరిత్రను కొత్తగా ప్రచారంలోకి తేవాలనుకునే ముందు చాలా సంయమనం, నిజాయితీ, నిజమైన దేశభక్తి కలిగిఉండడం అవసరం.