పాపం.. అక్కడ ఎమ్మెల్యేల రేటు పది కోట్లేనా?

తెలంగాణలో కేసీఆర్ సర్కారు కూలిపోయే అవకాశం ఏమాత్రం లేదని తెలిసినప్పటికీ.. నలుగురు ఎమ్మెల్యేలకు సుమారు 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు ఇవ్వజూపారని, ఎమ్మెల్యేలకు ఎర వేశారని ఇప్పుడు కేసు విచారణ జరుగుతోంది.…

తెలంగాణలో కేసీఆర్ సర్కారు కూలిపోయే అవకాశం ఏమాత్రం లేదని తెలిసినప్పటికీ.. నలుగురు ఎమ్మెల్యేలకు సుమారు 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు ఇవ్వజూపారని, ఎమ్మెల్యేలకు ఎర వేశారని ఇప్పుడు కేసు విచారణ జరుగుతోంది. సర్వత్రా రచ్చరచ్చ అవుతోంది. అయితే కూలిపోయే చాన్సులేని వేళ.. ఒక్కో ఎమ్మెల్యేకు 50 కోట్లు (పైలట్ రోహిత్ రెడ్డికి 100 ఇస్తామన్నారట) ఇస్తారా.. ఈ ఆఫర్ నిజమేనా? అనే సందేహాలు ప్రజల్లో ఉణ్నాయి. 

ఆ విషయం పక్కన పెడితే.. ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉన్న చోట ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఒక్కొక్కరికి కేవలం 10 కోట్లు మాత్రమే ముట్టజెప్పినట్టుగా ఇప్పుడు ఇంకో వ్యవహారం వినిపిస్తోంది. కాకపోతే ఇది రెండేళ్ల కిందట! ఎంతగా రెండేళ్ల పాత బేరం అయినా.. మరీ బహిరంగ మార్కెట్ లో రేట్లు అంత పెరిగిపోయాయా? లేదా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పదికోట్లు మాత్రమే ఉన్న బేరం, తెరాస ఎమ్మెల్యేల విషయంలో 50 కోట్లుగా బిజెపి డిసైడైందా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. 

రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ ఏలుబడి సాగిస్తున్నదే గానీ.. ఆ పార్టీలోని ముఠాలు నిత్యం కుమ్ములాడుకుంటూ.. పార్టీ పరువును నిత్యం బజార్న పడేస్తున్నాయి. సీఎం అశోక్ గహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సచిన్ పైలట్ పార్టీ ద్రోహి అని, విశ్వాస ఘాతుకుడని అంటూ అలాంటి వ్యక్తితో సీఎం స్థానాన్ని భర్తీ చేసే సాహసం పార్టీ చేయదని గహ్లోత్ నిప్పులు చెరగడం తాజా పరిణామం. 

2020లో తన ప్రభుత్వాన్ని కూల్చడానికి పైలట్ వర్గం ఎమ్మెల్యేలో గురుగ్రామ్ లో క్యాంపు నడిపారని, బిజెపి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వారితో బేరాలు జరిపారని, ఒక్కో ఎమ్మెల్యేకు పది కోట్లు ఇచ్చారని, ఆధారాలున్నాయని గహ్లోత్ అంటున్నారు. అలాంటి తిరుగుబాటు ద్రోహిని సీఎం చేస్తే పార్టీ నాశనం అవుతుందనేది ఆయన మాట. నిజానికి, ఆయన సచిన్ ను విమర్శిస్తున్నట్టుగా కాదు.. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని బెదిరిస్తున్నట్టుగానే ఈ మాటలు ఉన్నాయి. 

అశోక్ గహ్లోత్ ను ఏఐసీసీ అధ్యక్షుడిని చేయాలనుకున్న సోనియా.. రాజస్థాన్ లో ఆయన వర్గం సచిన్ పైలట్ సీఎం కాకుండా అడ్డుపడడానికి ముఠాలను ఎగదోస్తున్నారనే ఆరోపణలతో పక్కన పెట్టింది. ఆయనకు పాపం నోటిదాకా వచ్చిన పదవి కూడా దక్కకుండా పోయింది. సచిన్ మీద అసలే ఉన్న విభేదాలకు తోడు ఈ కక్ష పెరిగి ఉంటుంది. 

తాజాగా రాజస్తాన్ లోకి రాహుల్ ‘భారత్ జోడో’ యాత్ర ప్రవేశించబోతున్న నేపథ్యంలో.. వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయడానికి రాష్ట్ర నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్ యోచిస్తున్నదని సంకేతాలు అందుతున్న తరుణంలో.. గహ్లోత్ వంటి సీనియర్ నాయకుడు.. సచిన్ పైలట్ మీద తీవ్రమైన అభ్యంతరకరమైన విమర్శలతో పార్టీకి నష్టదాయకమైన రీతిలో మాట్లాడడాన్ని అధిష్టానం ఎలా స్వీకరిస్తుందో గమనించాలి.