ఈ హోటల్ లో మినిమం బిల్లు రూ.2 లక్షలు

హోటల్ కు వెళ్లి టిఫిన్ చేస్తే బిల్లు ఎంతవుతుందో అందరికీ తెలుసు. స్టార్ హోటల్ లో బిల్లు కాస్త ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ఇలా అడుగుపెట్టి, అలా బయటకొచ్చేందుకు 2 లక్షలు…

హోటల్ కు వెళ్లి టిఫిన్ చేస్తే బిల్లు ఎంతవుతుందో అందరికీ తెలుసు. స్టార్ హోటల్ లో బిల్లు కాస్త ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ఇలా అడుగుపెట్టి, అలా బయటకొచ్చేందుకు 2 లక్షలు బిల్లు వేసే హోటల్ ఒకటుందని తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్ అది.

స్పెయిన్ లోని వాలన్సియా నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబిజా ద్వీపంలో ఉంది ఈ రెస్టారెంట్. దీని పేరు సబ్లీమోషన్. ఈ హోటల్ లో మినిమం బిల్లు అక్షరాలా 2 లక్షల రూపాయలు. కుటుంబం మొత్తానికి కాదు, కేవలం ఒక వ్యక్తికి అయ్యే బిల్లు మొత్తం ఇది.

సమ్మర్ లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే ఈ హోటల్ తెరుస్తారు. ఇందులో భోజనం చేయాలంటే ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిందని తెలుపుతూ మీకో టికెట్ అందిస్తారు. ఆ టికెట్ ను కూడా భుజించవచ్చు.

ఇక రెస్టారెంట్ లోకి అడుగుపెట్టగానే మీ కోసం ప్రత్యేకంగా 25 మంది సిబ్బంది ఉంటారు. వాళ్లంతా కేవలం మీకోసం మాత్రమే పనిచేస్తారు. మీకు 20 రకాల ఆహార పదార్థాలు వడ్డిస్తారు. పూర్తిగా ఆర్గానిక్ ఉత్పత్తులతో తయారుచేసిన ఆహార పదార్థాలవి.

3 గంటల పాటు రెస్టారెంట్ లో ఉండి, ఆ 20 రకాల ఆహార పదార్థాల్ని రుచి చూసి, 2 లక్షల రూపాయల బిల్లు చెల్లించాలన్నమాట. ఆ 3 గంటల్లో భోజనంతో పాటు లేజర్ షో, వర్చువల్ రియాలిటీ, ప్రొజెక్షన్ మ్యాపింగ్ లాంటి అనుభూతుల్ని కూడా అందిస్తారు.

బెస్ట్ ఇన్నొవేటివ్ ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ కింద ఈ హోటల్ అంతర్జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. ఇంతకీ ఈ రెస్టారెంట్ ఎందుకింత ప్రత్యేకమో తెలుసా? కేవలం మీకోసం మాత్రమే వరల్డ్ ఫేమస్ చెఫ్ ప్యాకో రాంకెరో ఈ ఆహార పదార్థాలు తయారుచేస్తాడు. బయట ఈ రుచులు ఎక్కడా దొరకవు. తయారుచేయడానికి ప్రయత్నించినా కుదరదు.