అదొక మతరాజ్యం. మధ్యయుగం నాటి ఆచారాల దేశం. అలాంటి దేశంలో కరోనా విపరీత స్థాయికి చేరింది ఒక దశలో. అది కూడా ప్రపంచంలో అప్పుడప్పుడే కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఆ వైరస్ తో తీవ్ర ఇక్కట్ల పాలైన దేశాల్లో ఒకటి అది. అదే ఇరాన్. మార్చి నెలలోనే అక్కడ కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదైంది. అంతలోనే రంజాన్ వచ్చింది. ఆ పరిస్థితుల్లో అసలు ఇరాన్ ఏమైపోతుందో అని చాలా మంది భావించారు. అయితే అనూహ్యంగా కరోనా కేసులను ఇరాన్ నియంత్రించగలిగింది!
ఎనిమిది కోట్ల జనాభా ఉన్న ఆ దేశంలో మార్చి-ఏప్రిల్ నెలలకే రెండు లక్షల స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అంతంత మాత్రం సౌకర్యాలు, ప్రజల్లో అవగాహన తక్కువ ఉండే దేశమైన ఆ పర్షియన్ రాజ్యంలో కరోనాను చాలా వరకూ నియంత్రించుకున్నారు. ఒక దశలో రోజు వారీ కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. ఆ తర్వాత రెండో దశ వ్యాప్తి చెందినా, పరిస్థితి నియంత్రణలోనే ఉందక్కడ!
ఇప్పుడు ఇరాన్ ప్రస్తావన ఎందుకంటే.. అలాంటి మధ్యయుగం కాలం నాటి దేశం నావెల్ కరోనా వైరస్ ను నియంత్రిచగలిగితే, మనది అభ్యున్నతి సాధించిన దేశమని ఫీలయ్యే ఇండియన్లు ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? అనేది! కరోనా కేసుల సంఖ్య దేశంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతూ ఉంది. ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి ప్రజల తీరే! పరిస్థితి ఏమిటో కూడా అర్థం చేసుకోకుండా ఇంకా తిరిగే వాళ్లు తిరుగుతూనే ఉన్నారు. తమకేం కాదు, వైరస్ సోకినా ఏం కాదు అనే భావన చాలా మందిలో బలీయంగా నెలకొంది. కేసుల సంఖ్య పెరుగుతుంటే ప్రభుత్వాలను తిట్టడం పెద్ద పనేం కాదు. ప్రజలు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తే ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది?
కర్ణాటకలో లాక్ డౌన్ పెట్టారు. అయినా బెంగళూరులో వాహనాలు పగలంతా ఇష్టానుసారం తిరుగుతున్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. పోలీసులు అక్కడక్కడ ఉన్నా వాహనాలను ఆపడం లేదట. ఎందుకంటే.. ఎవరికి కరోనా ఉంటుందో ఎవరికి తెలుసు? ప‌్రతి వాహనాన్నీ ఆపి, కీస్ లాక్కొని, డాక్యుమెంట్స్ చూపమని, వారితో చర్చించి.. సర్ధిచెప్పి, ఫైన్ వేసి వాళ్లను పంపించే ధైర్యం పోలీసులకు కూడా ఇప్పుడు లేనట్టుంది. వాళ్లను ఆపి తాము కరోనా తెచ్చుకోవడం కన్నా.. కామ్ గా నిలబడిపోయేదే మేలని పోలీసులు కూడా ఒక అభిప్రాయానికి వచ్చి ఉండవచ్చు. వాళ్లవి కూడా ప్రాణాలే కదా! తిరిగే వాడికి లేని తీట తమకెందుకు అని పోలీసులు కూడా కామ్ గా ఉంటున్నారు. అందుకు వారిని కూడా తప్పు పట్టలేం.
భారతీయులు తమ సొంత మైన నిర్లక్ష్యభావన నుంచి వందశాతం, పూర్తిగా బయటకు వచ్చే వరకూ కరోనా నియంత్రణ సాధ్యం కాదని స్పష్టం అవుతోంది. కష్టమో, నష్టమో అని వంద కోట్ల కు మించి కొన్ని కోట్ల మంది ఉన్న భారతీయులంతా కరోనా విషయంలో పూర్తి స్పృహలోకి వచ్చే వరకూ రోజువారీ కేసుల పెరుగుదలను లెక్కబెట్టుకోవాల్సిందేనేమో!