బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌లో ఇంకా అగ్గి రాజుకుంటూనే ఉంది. విమర్శలు, ప్రతి విమర్శల స్థాయి దాటిపోయింది. ఇప్పుడు ఏకంగా సవాల్ వరకు పరిస్థితి వచ్చింది. బాలీవుడ్‌లో నెపోటిజంపై మరోసారి బాలీవుడ్ క్వీన్ సంచలన ప్రకటన చేశారు. ఈ దఫా ఏకంగా ఆమె తన పద్మశ్రీ అవార్డ్‌నే వెనక్కి ఇస్తానని ప్రతినబూనారు.
సుశాంత్ ఆత్మహత్య తర్వాత నెపోటిజంపై ఘాటుగా స్పందిన హీరోయిన్లలో కంగనా రనౌత్ ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. ఒక జాతీయ చానల్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నెపోటిజంపై చేసిన విమర్శల గురించి ప్రశ్నించగా ఆమె ఘాటైన సమాధానమిచ్చారు. తన విమర్శలు, వాదనలను నిరూపించుకోకపోతే తన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇస్తానని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
సుశాంత్ మరణానంతరం కంగనా స్పందిస్తూ…సుశాంత్‌ది ఆత్మహత్యా లేక పథకం ప్రకారం చేసిన హత్యా అంటూ బాలీవుడ్‌పై పదునైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కంగనా విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
జాతీయ చానల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను మనాలీలో ఉండగా ముంబయ్ పోలీసులు ఫోన్ చేశారన్నారు. సుశాంత్ కేసు విచారణకు సంబంధించి తన స్టేట్‌మెంట్ తీసుకోడానికి ఎవరినైనా పంపించాలని కోరానన్నారు. అయితే పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.
సుశాంత్ మరణానికి సంబంధించి తాను అన్ని విషయాలను బహిరంగంగా మాట్లాడినట్టు ఆమె చెప్పుకొచ్చారు. తాను పారిపోయే రకం కాదన్నారు. ఒకవేళ తన విమర్శలను నిరూపించకపోతే…పద్మశ్రీ పురస్కారాన్ని తన వద్దే ఉంచుకునే అర్హత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని స్పష్టంగా ప్రకటించారామె. మొత్తానికి బాలీవుడ్‌ను బాలీవుడ్ క్వీన్ ప్రకటన కంగారెత్తిస్తోంది.