దర్శకుడు ఆర్జీవీ బతకనేర్చిన తనం మరెవరికీ రాదేమో? సరైన టైమ్ లో సరైన స్టెప్ వేసి, సరైన కంటెంట్ తీసుకుని, డబ్బులు చేసేసుకోవడం నేర్చేసుకున్నారు. అందుకే ఇప్పుడు గంటల సినిమాలు కాదు, నిమిషాల సినిమాలు లక్షలు పెట్టి తీసి, టికెట్ పెట్టి కోట్లు సంపాదించే పనిలో వున్నారు. రెండు అడల్ట్ మూవీ లు ఎటిటిలో వదిలిన తరువాత తొలిసారి పొలిటికల్ మూవీని ఏటిటిలోకి వదులుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను పోలిన నటుడిని తీసుకుని వచ్చి, పవర్ స్టార్ అనే సినిమాను తీస్తున్నారు.
ఈ సినిమాను ముందే చెప్పినట్లు పవన్ తొలిప్రేమ విడుదల డేట్ కు వదలుతున్నారు. ఈ లోగా ఈ సినిమా ట్రయిలర్ ను 22న విడుదల చేస్తున్నారు. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే ఈ ట్రయిలర్ చూడడానికి 25 రూపాయలు టికెట్ పెట్టడం. ప్రపంచంలో ఓ ట్రయిలర్ కు టికెట్ పెట్టడం ఇదే తొలిసారి. ఆర్జీవీకే చెల్లింది ఇది.
పైగా పవర్ స్టార్ సినిమాకు కూడా ఓ ఆఫర్ ప్రకటించారు. ముందుగా టికెట్ తీసుకుంటే 150 రూపాయలు, లేదూ అంటే 250 రూపాయలు అంటూ ప్రకటించారు. ఈ విధంగా కూడా డబ్బలు చేసుకునే మార్గమే అనుకోవాలి. ఎందుకంటే వన్స్ సినిమా విడుదలయిపోయి, అందులో ఏం వుంది, ఏం లేదు అన్నది తెలిసాక, జనం చూడడం తగ్గిపోతుంది. పైగా ఆర్జీవీ సినిమాలు అంటే ఆరంభంలో హడావుడి తప్ప, విడుదలయ్యాక పెద్దగా ఏం వుండదని టాక్ వుంది. అందువల్ల ముందుగానే 150 టికెట్, విడుదలయ్యాక 250 అంటే, జనాలు ముందుగానే టికెట్ తీసుకునే అవకాశం వుంది.
ఆ విధంగా కూడా మరింత కలెక్షన్లు పెంచుకోవచ్చు. మొత్తం మీద ఆర్జీవీ అన్ని విధాలా సినిమా వ్యాపారంలో ఆరితేరిపోయారు అనుకోవాలి.