మన సమాజంలో అవయవదానంపై పెద్దగా అవగాహన లేదు. ఇంకా చెప్పాలంటే అవయవ దానంపై ఇంకా మూఢ విశ్వాసాలున్నాయి. ఉదాహరణకు నేత్రదానం చేస్తే మరో జన్మలో అంధులుగా జన్మిస్తారనే భావన 90 శాతం మంది ప్రజల్లో బలంగా ఉంది. దీంతో నేత్రదానం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జీవితాంతం అంధత్వంలో బతుకుతున్న వారు లేకపోలేదు.
మనిషి చనిపోయిన తర్వాత మూడు నుంచి మూడున్నర గంటల్లోపు నేత్రాలను దానం చేయవచ్చు. దీంతో ఇద్దరికి చూపు ప్రసాదించి వాళ్ల జీవితాల్లో వెలుగు నింపొచ్చు. ఇటీవల కాలంలో నేత్రదానంపై వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. దీని వల్ల గతంలో కంటే నేత్రదానం చేసేవాళ్లు ఒక మోస్తరు వరకు ముందు కొస్తున్నారు.
ఇక ఇతర అవయవాల దానం విషయానికి వస్తే….ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు బ్రెయిన్ డెడ్ అయితే కిడ్నీలు, ఇతరత్రా అవయవాలను దానం చేసే అవకాశం ఉంది. అలాగే మొత్తం మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వడం వల్ల వైద్య విద్యార్థులు ప్రాక్టికల్‌గా విద్యనభ్యసించడానికి దోహదం చేసినట్టు అవుతుంది. అవయవ దానం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.
తాజాగా ప్రముఖ హీరోయిన్ పాయల్‌ఘోష్ అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తన నిర్ణయానికి కారణాలను కూడా ఆమె వెల్లడించారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ తన మిత్రుడు ఇటీవల చనిపోయాడని తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా అవయవదాతలు ముందుకు రాకపోవడంతో అతను ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చినట్టు పాయల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తనను ఎంతగానో బాధించిందన్నారు.
ఈ నేపథ్యంలో తన మిత్రుడి లాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో అవయవదానం చేయాలని తాను గట్టిగా నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. మరణానంతరం మరి కొందరికి కొత్త జీవితాల్ని ఇచ్చేందుకు అవయవదానం ఒక్కటే ఏకైక మార్గమని ఆమె చెప్పుకొచ్చారు. గొప్ప ఆశయంతో తీసుకున్న నిర్ణయం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. భళా పాయల్ అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు.