ఇంకా ప్రాంతీయ పార్టీ నాయకుడేనా?

ప్రతి రాజకీయ పార్టీలోనూ అది ప్రాంతీయ పార్టీ కావొచ్చు, జాతీయ పార్టీ కావొచ్చు ఏదో ఒక లొల్లి జరుగుతూనే ఉంటుంది. అది నాయకుల మధ్య వ్యక్తిగతంగా కావొచ్చు లేదా ఏదో ఒక సబ్జెక్టు పైన…

ప్రతి రాజకీయ పార్టీలోనూ అది ప్రాంతీయ పార్టీ కావొచ్చు, జాతీయ పార్టీ కావొచ్చు ఏదో ఒక లొల్లి జరుగుతూనే ఉంటుంది. అది నాయకుల మధ్య వ్యక్తిగతంగా కావొచ్చు లేదా ఏదో ఒక సబ్జెక్టు పైన కావొచ్చు. పాతవారికి, కొత్తగా పార్టీలో చేరినవారికి (ఫిరాయింపుదారులకు) మధ్య ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది. కాని కాంగ్రెసు పార్టీలోనే ఎక్కువ గొడవలు జరుగుతున్నట్లు మీడియాలో ప్రచారం అవుతుంటుంది. కాంగ్రెసులో గొడవలకు తక్కువలేని మాట వాస్తవమే. కాని కాంగ్రెసు అంటేనే గొడవల పార్టీ అని, ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారనే పేరు పడిపోయింది. ఆ పేరుకు తగినట్లుగానే నేతల వ్యవహారశైలి ఉంటుంది. కొన్నాళ్లుగా పీసీసీ అధ్యక్ష పదవిపై గొడవ జరగ్గా, ఇప్పుడు హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నిక పార్టీలో చిచ్చు రేపింది. దీనికి టీడీపీ నుంచి కాంగ్రెసులో చేరిన 'దూకుడు నాయకుడు' రేవంత్‌ రెడ్డి కేంద్ర బిందువుగా మారాడు.

ఆయన వ్యవహారం చివరకు క్రమశిక్షణ చర్యలదాకా పోతోంది. దూకుడుగా వ్యవహరించడం, దూసుకుపోవడం, ఎవ్వరినైనా సరే నిలదీయడం, కడిగేయడం…ఇవన్నీ రేవంత్‌ రెడ్డి లక్షణాలు. టీడీపీలో ఉన్నప్పుడూ దూకుడుగానే ఉన్నాడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా పట్టుబడినా కూడా ఏమాత్రం భయపడకుండా సీఎం కేసీఆర్‌పై ఒంటికాలిపై లేచాడు. నడిబజారులో నిలబడి దుమ్ముదులిపేశాడు. కేసీఆర్‌ అంతు చూస్తానన్నాడు. తాను ఏ తప్పూ చేయలేదని, ఏం చేసుకుంటావో చేసుకోపొమ్మన్నాడు. ఇలాంటి రేవంత్‌ రెడ్డి కాంగ్రెసులో చేరినంతమాత్రాన మారిపోతాడా? కాంగ్రెసు జాతీయ పార్టీయే కావొచ్చు. కాని ఆయనేమీ జాతీయ నాయకుడు కాదు కదా. ఆయనే కాదు, తెలంగాణ కాంగ్రెసులో ఉన్న నాయకులెవరూ జాతీయ భావాలు తొణికిసలాడే నేషనల్‌ లీడర్స్‌ కాదు కదా.

వీళ్లందరిలోకి రేవంత్‌ రెడ్డి పక్కా లోకల్‌. 'అన్న నిలుచుంటే మాస్‌..అన్న నడిచొస్తే మాస్‌' టైపు నాయకుడు. రేవంత్‌ దూకుడును ఇష్టపడేవారు సామాన్య జనంలో చాలామంది ఉన్నారు. కాని కాంగ్రెసు పార్టీలో నచ్చడంలేదు. ఆయన స్పీడును తట్టుకోలేకపోతున్నారు. ఇంత స్పీడు కాంగ్రెసు పార్టీలో పనికిరాదని, ఇది జాతీయ పార్టీ అని సీనియర్లు రేవంత్‌ మీద ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. పార్టీలో నువ్వు చాలా జూనియర్‌ అనే విషయం గుర్తుపెట్టుకోమంటున్నారు. 'నీ వ్యవహారశైలి ప్రాంతీయ పార్టీలో నడుస్తుందేమోగాని జాతీయ పార్టీలో నడవదు బిడ్డా' అని హెచ్చరిస్తున్నారు. రేవంత్‌ కారణంగా కాంగ్రెసు గ్రాఫ్‌ పడిపోయిందని పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ కోదండ రెడ్డి కోపం తెచ్చుకున్నాడు.

వి.హనుమంతరావు అలియాస్‌ వీహెచ్‌ 'నీ ప్రాంతీయ పార్టీ స్టైల్‌ ఇక్కడ నడవదు బిడ్డా' అన్నాడు. ఒకవిధంగా చెప్పాలంటే రేవంత్‌ను కాంగ్రెసు పార్టీ నాయకులు ఓన్‌ చేసుకోలేకపోతున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెసులోకి వెళ్లినప్పటినుంచే రేవంత్‌ చాలా ఇబ్బంది పడుతున్నాడు. కాంగ్రెసులో చేరిప్పటినుంచే దూకుడు మొదలుపెట్టడంతో వీడెవడ్రా బాబూ అని విసుక్కున్నారు. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నిక వ్యవహారం పూర్తిగా నల్లగొండ జిల్లా నేతలదేనని, వేరే జిల్లాకు చెందిన రేవంత్‌ ఎందుకు కల్పించుకోవాలని నేతలు ప్రశ్నిస్తున్నారు. పీసీసీ అధినేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తన భార్య ప్లస్‌ మాజీ ఎమ్మెల్యే పద్మావతిని ఉప ఎన్నిక అభ్యర్థిగా డిసైడ్‌ చేయగానే రేవంత్‌ ఓ అభ్యర్థిని ప్రతిపాదించాడు. దీంతో నల్గొండ జిల్లా వ్యవహారంలో వేలు పెట్టడానికి నువ్వెవరివి అని ప్రశ్నిస్తున్నారు.

ఇక రేవంత్‌ అసెంబ్లీలో విద్యుత్‌ సమస్యపై చర్చ జరుగుతున్నప్పుడు కాంగ్రెసు ఎమ్మెల్యేలు లేకుండాపోయారని, సంపత్‌ కుమార్‌కు యురేనియం విషయంలో ఏబీసీడీలు తెలియవని కామెంట్‌ చేశాడు. దీంతో పరిస్థితి గరంగరంగా తయారైంది. పీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్‌ పోటీదారుగా ఉండటంతో అతన్ని కానివ్వకూడదనే పంతంతో ఆ ఎన్నికను ఆపేయించారు. ఇప్పుడు హుజూర్‌నగర్‌ గొడవ మొదలైంది. రేవంత్‌ కాంగ్రెసులో చేరిన తొలి రోజుల్లోనే టీడీపీలో మాదిరిగా అంతా తానై వ్యవహరిద్దామనుకున్నాడు. పార్టీని లీడ్‌ చేద్దామనుకున్నాడు. సొంత ప్లాన్‌లతో ముందుకు పోదామనుకున్నాడు. దీంతో సీనియర్లు అడ్డుకట్ట వేశారు. కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను ఎంతైనా విమర్శించేందుకు స్వేచ్ఛ ఉంది. కాని అందరినీ అధిగమించి ముందు నడుస్తానంటే కుదరదన్నారు.

పార్టీలో చేరగానే టీఆర్‌ఎస్‌ మీద, కేసీఆర్‌ పైనా ఈ యువ నాయకుడు రెచ్చిపోవడంతో కాంగ్రెసు నేతలు హ్యాపీగా ఫీలయ్యారు. కాని టీడీపీలో మారిదిగా అక్కడ తన హవా నడిపించాలనుకోవడం,  తాను చెప్పినట్లు ఢిల్లీలోని హైకమాండ్‌ వింటుందనుకోవడంతో తిప్పలు వచ్చిపడ్డాయి. టీడీపీలో ఉన్నప్పుడు అధ్యక్షుడు రమణ కంటే రేవంత్‌ ఎంతో పాపులర్‌. టీడీపీలో ఈయన 'ఫైర్‌బ్రాండ్‌'. అధినేత చంద్రబాబునే మించిపోయాడు. రేవంత్‌పై కొందరు ఆయనకు ఫిర్యాదులు చేసినా, పార్టీ ఉనికి కాపాడుతున్న నేతగా భావించి స్వేచ్ఛ ఇచ్చారు. కాని కాంగ్రెసులో కుదురుతుందా?

సినిమా రివ్యూ: బందోబస్త్‌        సినిమా రివ్యూ: వాల్మీకి