తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి బహుశా ఇంతటి దారుణ రాజకీయ పరిస్థితిని ఎప్పుడూ అనుభవిచి ఉండదు. దాదాపు పాతికేళ్లుగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ సార్వత్రిక ఎన్నికల్లో మూడు సార్లు ఓడిపోయింది. 2004లో చిత్తు చిత్తుగా ఓడిపోగా, 2019లో అంతకన్నా చిత్తు అయ్యింది.
ఇప్పుడు మరింత విశేషం ఏమిటంటే టీడీపీ అన్ని రకాల రాజకీయ పదవులకూ దూరం అయిపోయింది. ఆ పార్టీకి పదవుల్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు టీడీపీ నేతలకు పదవులు లేవు, పదవుల్లో టీడీపీ నేతలు లేరు. ఒకటని కాదు.. పై నుంచి కింది వరకూ అదే కథ.
23తో ఆట కట్టు!
ఏ ముహూర్తాన గత టర్మ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు చేర్చుకున్నారో కానీ, 2019 ఎన్నికల్లో సరిగ్గా ఆ పార్టీ తరఫున 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా నెగ్గారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఒక రాష్ట్రంలో కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కలిగి ఉండటం టీడీపీ ఫెయిల్యూర్.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ పార్టీ 67 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉండేది. అక్కడకూ నాటి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశాయి. అయినా వైసీపీ 67 మంది ఎమ్మెల్యేలతో గౌరవప్రదమైన ఓటమిని ఎదుర్కొంది.
టీడీపీ మాత్రం 23 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయ్యింది. అది కూడా అధికారాన్ని చేతిలో ఉంచుకుని ఎన్నికలకు వెళ్లి అలాంటి ఓటమిని మూటగట్టుకుంది. అలా ఏకంగా 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి ఎమ్మెల్యేలు లేకుండా పోయారు!
రాజ్యసభ సభ్యుల వలస!
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చిత్తు అయినా.. అంతకు ముందు ఎమ్మెల్యేల నంబర్ తో సంక్రమించిన నామినేటెడ్ పోస్టులతో ఆ పార్టీ ఉనికి కొంత వరకూ నిలిచింది. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు మిగిలారు. అయితే పార్టీ అధికారం కోల్పోగానే రాజ్యసభ సభ్యులు వలస వెళ్లిపోయారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులు చలో బీజేపీ అన్నారు. వారికి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఉన్నాయనే అంటారు.
చంద్రబాబు ఆశీస్సుల మేరకే వారు బీజేపీలో చేరారంటారు. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీ బలం ఒక్క ఎంపీ స్థానానికి పరిమితం అయినట్టుగా ఉంది. లోక్ సభలో ముగ్గురు ఎంపీలు, రాజ్యసభలో ఒక్క ఎంపీ ఉన్నారు టీడీపీకి. తమది జాతీయ పార్టీ అని తెలుగుదేశం వాళ్లు చెప్పుకుంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు టీడీపీకి జాతీయాధ్యక్షుడు! అయితే టీడీపీ ఉన్న మొత్తం ఎంపీల సంఖ్య మాత్రం నాలుగు! నాలుగు ఎంపీ సీట్లతో తమది జాతీయ పార్టీ అని చెప్పుకునే కామెడీ టీడీపీకే చెల్లుతోంది!
ఎమ్మెల్యేల్లో ఇద్దరు ముగ్గురు గాయబ్!
తెలుగుదేశం పార్టీ తరఫున గత ఎన్నికల్లో నెగ్గిన 23 మందిలో కూడా ఇద్దరు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో చట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు. వారు అధికారికంగా ఆ పార్టీలోకి చేరడం లేదు. ఆ పార్టీలో చేరాలంటే ఉప ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంటుందనే షరతు ఉంది. ఈ నేపథ్యంలో వారు తమ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చి, వైఎస్ఆర్ సీపీతో దోస్తీ చేస్తున్నారు.
ఇప్పటి వరకూ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ తరహాలో రూటు మార్చారు. దీంతో ఆ నియోజకవర్గాల్లో కూడా టీడీపీకి అధికార ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
జగన్ ఛాన్సిచ్చి ఉంటే?
చంద్రబాబులా ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా చేపట్టి ఉంటే ఇప్పుడు టీడీపీ కథ మరోలా ఉండేదేమో! నీవు నేర్పిన విద్యయే.. అన్నట్టుగా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వరస పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే వారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద నెగ్గిన 23 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ పచ్చ కుండువాలు వేసింది. వారిలో నలుగురుని మంత్రులుగా కూడా చేసింది.
ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేశారంటారు. మరి అలాంటి కథే ఇప్పుడు నడిచి ఉంటే.. టీడీపీ ఎమ్మెల్యేల బలం నాలుగు ఐదు స్థాయికి పడిపోయేదేమో! చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు.. తప్ప మిగిలిన వారిలో కచ్చితంగా టీడీపీలో ఉంటారనే పేర్లు చెప్పడం కష్టం. అధికార పార్టీ నుంచి ఆహ్వానం రావాలే కానీ లగెత్తుకు వెళ్లే వాళ్లే ఎక్కువ. ఇదంతా చంద్రబాబు నేర్పిన రాజకీయమే.
అధికారం ఎక్కడ ఉంటే ఎమ్మెల్యేలు అక్కడే ఉండాలనే కుటిల రాజకీయ నీతిని చంద్రబాబు నాయుడు గత టర్మ్ లో అనుసరించారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే అనుకుంటే.. టీడీపీ కి ప్రాతినిధ్యం మిగిలే నియోజకవర్గాల సంఖ్య నాలుగైదు మించికి మిగలవు!
ఎమ్మెల్సీల బలం కూడా తరిగిపోతోంది!
మొన్నటి వరకూ మండలిలో తమకు మెజారిటీ ఉందంటూ టీడీపీ చాలా హడావుడే చేసింది. జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించుకున్న బిల్లులను కూడా మండలిలో అడ్డుకుంది. తద్వారా తాము పై చేసి సాధించినట్టుగా చెప్పుకుంది. అయితే మండలిలో కూడా బలం తరిగిపోతోంది. ఒక్కో ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తవుతోంది. రేపో మాపో లోకేష్ కూడా మాజీ ఎమ్మెల్సీగా మిగిలిపోనున్నారు.
ఇక మండలిలో టీడీపీ తరఫున నామినేట్ అయ్యే కొత్త నేతల సంఖ్య కూడా చెప్పుకునేది ఏమీ ఉండదు. గవర్నర్ కోటా దగ్గర నుంచి ఎంపీటీసీ ల బలంతో ఎన్నికయ్యే ఎమ్మెల్సీల వరకూ.. ఎక్కడా టీడీపీ ఉనికి ఉండబోదు. మండలిలో కూడా టీడీపీ ఒకటీ అర సీట్లతో మిగలబోయే సమయం మరెంతో దూరంలో లేనట్టుంది.
స్థానిక ఎన్నికల్లో మరో దెబ్బ!
ఒక పార్టీ ఉనికిలో ఉండాలంటే ఎమ్మెల్యేలు,ఎంపీలే ఉండనక్కర్లేదని అనుకుందాం. క్షేత్ర స్థాయిలో అయినా ఆ పార్టీ నాయకత్వం ఏదో ఒక పదవిలో ఉంటే అదో ముచ్చట. అయితే ఇప్పుడు టీడీపీ ఎన్ని మున్సిపాలిటీల్లో పాగా వేసింది? ఎన్ని జడ్పీ చైర్మన్ పదవులు ఆ పార్టీకి దక్కుతాయి? అనేది విస్మయకరమైన అంశంగా మారింది. ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఆ పార్టీ జెండా పాతింది ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే!
ఇక జడ్పీ చైర్మన్ ల విషయానికి వస్తే అసలు జడ్పీటీసీ మెంబర్ ఎక్కడైనా గెలిస్తే అదే ఆ పార్టీకి పరమాన్నం అయ్యింది. అలాంటిది చైర్మన్ పదవిని గెలుచుకోవడం అసంభవం! గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్షేత్ర స్థాయి నిర్మాణం అంటూ ఒకటి లేకపోయినా మూడు జడ్పీపీఠాల్లో పాగా వేసింది. అప్పటికి కాంగ్రెస్ పార్టీ చేతిలో అధికారం ఉండటంతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి ఎటూ కలిసి రాలేదు.
ఒకరకంగా ముక్కోణపు పోరు లాంటిది సాగింది. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు జడ్పీ చైర్మన్ పీఠాలను సాధించుకునేంత స్థాయిలో ఉనికిని చాటుకుంది. ఇప్పుడు టీడీపీ ఎక్కడా జడ్పీ పీఠాల విషయంలో టీడీపీ కనీస దూరంలో కూడా లేదు! జిల్లాకు ఒకటీ అర జడ్పీటీసీ సీట్లను కూడా నెగ్గలేకపోయిన ధీనస్థితిలో ఉంది టీడీపీ. గతంలో టీడీపీ ప్రతిపక్ష వాసంలో ఉన్నప్పుడు ఇంత దారుణమైన రాజకీయ పరిస్థితి అయితే ఉండేది కాదు!
టీడీపీ తరఫున ఎమ్మెల్యేలు, ఎంపీ పదవుల్లో ఉన్న నేతల సంఖ్య ఎంత ఉన్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం టీడీపీకి కొన్ని పదవులు ఉండేవి. కొన్ని మున్సిపాలిటీల్లో ఢీ అంటే ఢీ అన్నట్టుగా టీడీపీ తగులుకునేది కాంగ్రెస్ తో. వైఎస్ హయాంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా టీడీపీ తమకు కంచుకోటల్లాంటి మున్సిపాలిటీలను నిలబెట్టుకుంది. పలు చోట్ల అధికార పార్టీకి ధీటుగా సీట్లను గెలుచుకుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ సూది మొనను కూడా మోపలేకపోయింది. అలా ఒక బలమైన ప్రతిపక్షంగా టీడీపీ ఉనికిని చాటుకుంది.
స్థానిక ఎన్నికలు ఎప్పుడైనా అధికార పార్టీలకే ఎక్కువ మొగ్గు ఉంటుంది. ఆ పరిస్థితుల్లో టీడీపీ 30 శాతం స్థానిక ఎన్నికల సీట్లలో ఉనికిని చాటుకుంది. క్షేత్ర స్థాయిలో పచ్చచొక్కాల వారు ఎంపీటీసీలు, జడ్పీ సభ్యులుగా, వీలైతే చైర్మన్లుగా, ఎంపీపీలుగా, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ల దగ్గర నుంచి, మున్సిపల్ చైర్మన్లుగా ఇలాంటి రకరకాల పదువుల్లో కనిపించే వారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా.. ఇలాంటి ప్రాతినిధ్యానికి అయితే లోటు ఉండేది కాదు.
ఆ ప్రాతినిధ్యమే కీలకం!
ఏదైనా రాజకీయ పార్టీ మనుగడలో క్షేత్ర స్థాయి క్యాడర్ కు రాజకీయ అవకాశాలు దక్కడమే కీలకమైన అంశం. ప్రతి చోటా ఎమ్మెల్యేలే ఉండనక్కర్లేదు. కేవలం ఎమ్మెల్యేలే వెళ్లి అందరి చేతా ఓట్లు వేయించలేరు. తమ పార్టీ వాణిని ప్రజల్లోకి తీసుకెళ్లలేరు. ఈ పనిలో ఎక్కువ వాటా తీసుకునేది పంచాయతీ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, జడ్పీ సభ్యులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లే. వీళ్లే అనునిత్యం ప్రజలతో టచ్లో ఉంటారు. ప్రజలు కూడా ఏ పని విషయంలో అయినా వీరి వద్దకే వెళ్తారు. సరిగ్గా ఇలాంటి చోట టీడీపీ జీరో అయిపోయిందిప్పుడు.
జీరో అంటే నిఖార్సైన జీరో! గతంలో ఎన్నడూ చూడని రాజకీయ ధీనస్థితి ఇది. ఇలా క్షేత్ర స్థాయిలో టీడీపీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి వచ్చింది. తాము ఎన్నికలను బహిష్కరించినట్టుగా టీడీపీ, పచ్చమీడియా ఏదో గొప్పగా చెప్పుకోవచ్చు కానీ ఇలా పార్లమెంట్ స్థాయి నుంచి పరిషత్ వరకూ ప్రాతినిధ్యం కోల్పోవడం వల్ల చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది అనడంలో వింత ఏమీ లేదు!
టీడీపీకి పదవులు లేకపోవడం, పదవుల్లో పచ్చచొక్కాలు లేకపోవడం అనే సమీకరణం.. వచ్చే సార్వత్రిక ఎన్నికలపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది!