జాతకాలు అదృష్టాలను కొంతమంది నమ్మరు కానీ కొన్ని విషయాలను చూస్తూంటే మాత్రం తప్పక నమ్మాల్సిందే. విశాఖ విభజన ఏపీలో పెద్ద జిల్లా. అటువంటి జిల్లాకు చైర్ పర్సన్ అంటే మంత్రి పదవితో సమానం. ఆ హోదాను అందిపుచ్చుకోవడానికి పెట్టి పుట్టాలి.
విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా జల్లిపల్లి సుభద్ర ఎంపిక కావడం అంటే మామూలు విషయం కానే కాదు. ఆమె పుట్టింది విశాఖ జిల్లా ఏజెన్సీ ముంచంగి పుట్టు మండలంలోని జోలాపుట్ట్ పంచాయతీ శివారు లబ్బర్ గ్రామం. అతి పేద కుటుంబంలో పుట్టిన సుభద్ర ఒకనాడు గెస్ట్ టీచర్ గా పనిచేశారు. ఈ రోజు ఆమె ఎంతోమందిని శాసించే జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అయ్యారు.
ఈ పదవి కోసం చాలా మంది ప్రయత్నాలు చేశారు. కానీ ఆమెనే ఈ పదవి వరించింది. నిజానికి చివరాఖరు నిముషంలో జెడ్పీటీసీగా పోటీ చేసిన సుభద్ర రాజకీయ జీవితం గట్టిగా రెండేళ్ళు కూడా కాదు, కానీ జగన్ మెచ్చి ఆమెకు జెడ్పీ కిరీటం తల మీద పెట్టారు.
మొత్తం మీద చూసుకుంటే లక్కుంటే జాతకం గిర్రున తిరిగిపోతుంది అనడానికి ఈ గిరిజన మహిళ ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి. ఇక జెడ్పీటీసీగా ఆమె పోటీ చేసిన ముంచింగుపుట్టు మండలం మహిళలకు రిజర్వ్ కావడం, అలాగే, ఎంతో కాలంగా వైసీపీలో ఉన్న ఆమె అన్నకు పోటీ చేసే అవకాశం లేకపోవడంతో సుభద్రకు నాడు అలా జాక్ పాట్ తగిలింది.