బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్… చివరగా విడుదలైన ఈ హీరో సినిమా 'జీరో'. ప్రయోగాత్మకంగా రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని నమోదు చేయలేదు. అంతకు ముందు కొన్ని సినిమాలు కూడా డిజాస్టర్లుగా నిలిచాయి. 2017లో విడుదలైన మూడు సినిమాలూ ఫెయిల్యూర్ అయ్యాయి. స్థూలంగా చూస్తే.. 2013లో వచ్చిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' తర్వాత షారూక్ కు చెప్పుకోదగిన హిట్ లేదు! హ్యాపీన్యూయర్ , దిల్ వాలే, ఫ్యాన్, రయిస్.. ఇలా ఉంది షారూక్ ఫెయిల్యూర్ ల జాబితా.
ఏడు సంవత్సరాలుగా సరైన హిట్ లేకపోయినా షారూక్ స్టార్ డమ్ కు అయితే కొదవలేదు. ఇదే సమయంలో వేరే వ్యాపారాలతో బిజీగా ఉన్నాడు. షారూక్ హోం ప్రొడక్షన్లో పలు సినిమాలు రూపొందాయి. వాటితో పాటు ఐపీఎల్ వ్యాపారంతో సహా షారూక్ బ్రాండ్ వ్యాల్యూ ఉంది. అయితే ఎటొచ్చీ సినిమాలే లేవు. ఏడాదిన్నర నుంచి ఏ సినిమానూ ఈ హీరో ఓకే చేయలేకపోయాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఫ్యాన్ ఆకట్టుకోలేకపోవడంతో.. మళ్లీ ఎలాంటి కథను ఎంచుకోవాలో షారూక్ కే పాలుపోయినట్టుగా లేదు.
ఆ మధ్య దక్షిణాది దర్శకులు పలువురితో షారూక్ చర్చలు జరిపినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమాలేవీ ఇప్పటి వరకూ పట్టాలెక్కలేదు. తను ఏడాదిన్నర గా సినిమాలేవీ చేయలేకపోవడం పట్ల వ్యంగ్యంగా స్పందించాడు షారూక్. తన మైనం బొమ్మ పక్కన దిగిన ఫొటోను పోస్టు చేసి, ఏడాదిన్నర నుంచి ఆ బొమ్మ, తను కూడా ఇంటికే పరిమితం అయినట్టుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఇంతకీ షారూక్ తదుపరి సినిమా ఎప్పుడనే అంశం గురించి ఆయనకే క్లారిటీ ఉన్నట్టుగా లేదు!