“టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యల్ని పవన్ కల్యాణ్ బలంగా ఎత్తిచూపారు. టాలీవుడ్ కోసం గట్టిగా నిలబడ్డారు. ఎన్నో సమస్యల్ని తన గొంతుకతో వినిపించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని బహిరంగంగా విమర్శించి, టాలీవుడ్ కు అండగా నిలిచారు.” నిన్న పవన్ కల్యాణ్ స్పీచ్ విన్న చాలామంది ఇలానే అనుకొని ఉంటారు.
కానీ ఇండస్ట్రీ ఇలా అనుకోవడం లేదు. సింపుల్ గా చెప్పాలంటే.. మొత్తం వ్యవహారాన్ని పవన్ కెలికి కంపు చేశాడని అనుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ను మనసులోనే తిట్టుకుంటున్నారు.
మొత్తం బూడిదలో పోసిన పన్నీరు
ప్రభుత్వంతో అత్యంత చాకచక్యంగా చర్చలు జరుపుతోంది టాలీవుడ్. జగన్ సర్కారుకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తుల్ని సైతం పక్కనపెట్టి, ''మరి కొంతమంది'' మాత్రమే వెళ్లి కలుస్తున్నారు. దాదాపు చర్చలు కొలిక్కి వచ్చేశాయి. మంత్రి పేర్ని నాని టాలీవుడ్ సమస్యలన్నింటినీ శ్రద్ధగా విన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చలు జరిపి ఇండస్ట్రీని ఆదుకుంటామని, సభాముఖంగా, మీడియా ముఖంగా ప్రకటన కూడా చేశారు.
అంతా సెట్ అయిందని ఇండస్ట్రీ పెద్దలు కూడా తమలో తాము సంతోషిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే గాంధీ జయంతి తర్వాత అపాయింట్ మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి జగన్ వద్ద టాలీవుడ్ అంశాన్ని లేవనెత్తాలనుకున్నారు పేర్నినాని. అంతలోనే పవన్ కల్యాణ్ మైక్ పుచ్చుకున్నారు. మొత్తం వ్యవహారాన్ని కంగాళీ చేసి పడేశారు. ఓవైపు టాలీవుడ్ లో కొంతమంది పెద్ద మనుషులు కలిసి ఇన్నాళ్లూ చేసిన కృషి, నడిపించిన వ్యవహారం, సాగించిన లాబీయింగ్ మొత్తాన్ని ఒక్క ప్రసంగంతో కాలువలో కలిపేశారు.
ఇలాంటి టైమ్ లో పేర్ని నాని, టాలీవుడ్ అంశాన్ని జగన్ ముందు ఎత్తితే అది ఆయనకే ప్రమాదం. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చిందని, మరోసారి మొదట్నుంచి మొత్తం ప్రక్రియ ప్రారంభించాలని ఇండస్ట్రీ పెద్దలు తలలుపట్టుకున్నారు.
చిన్న నిర్మాతల కొంప ముంచిన పవన్
పవన్ కల్యాణ్ స్పీచ్ ఇలా ముగిసిందో లేదో, అప్పట్నుంచి రాత్రంతా ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులు ఫోన్లలో మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పేర్ని నానిని కలుస్తామంటూ మథనపడుతున్నారు. మరీ ముఖ్యంగా కాస్త యాక్టివ్ గా ఉండే ఓ చిన్న నిర్మాత ఓపెన్ గానే పవన్ ను విమర్శిస్తున్నాడు.
సినిమాకు 50 కోట్లు పారితోషికం తీసుకుంటున్న పవన్ కల్యాణ్ కు చిన్న నిర్మాతల కష్టాలు ఎలా తెలుస్తాయంటూ ప్రశ్నిస్తున్నాడు. పవన్ తన తిక్క వాగుడుతో పరిశ్రమను ఆదుకోవడం మాట అటుంచి, మొత్తంగా చిన్న సినిమాల గొంతు కోశాడని ఆక్రోషిస్తున్నాడు.
ఏపీ సర్కారు జారీ చేసిన జీవో-782ను చిన్న సినిమా నిర్మాతలంతా స్వాగతిస్తున్నారు. టిక్కెట్ రేటు అందుబాటులో ఉంటే చిన్న సినిమాలు చూసేందుకు కూడా ప్రేక్షకుడు మొగ్గుచూపుతాడనేది ఛోటా నిర్మాతల వాదన. దీనికితోడు చర్చలు ఫలించి FDCద్వారా సినీ థియేటర్స్ కు బ్యాంకు వడ్డీకి రుణ సౌకర్యం కల్పించడం, ఏపీలో షూటింగ్ చేసే చిన్న చిత్రాలకు సబ్సిడీని అందించడం లాంటివి జరిగితే చిన్న నిర్మాతలకు అంతకంటే ఇంకేం కావాలి.
ఇవన్నీ మంత్రికి ఇచ్చిన రిప్రజెంటేషన్ లో ఉన్నాయి. ఆదుకునే విషయంలో జగన్ సానుకూలంగా స్పందిస్తారని నాని కూడా ప్రకటించారు. ఇలా ఓవైపు చర్చలు దాదాపు 90శాతం కొలిక్కి వచ్చిన టైమ్ లో పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై విమర్శలు చేసి మొత్తం వ్యవహారాన్ని పాడుచేశారని బాధపడుతున్నారు టాలీవుడ్ పెద్దలు.
టాలీవుడ్ ను బలిపశువును చేసిన పవన్
ప్రభుత్వం కేవలం ఓ వ్యక్తిపై కక్షతో నిర్ణయం తీసుకోదు. అలా తీసుకుంటే ఆ ప్రభుత్వానికే మచ్చ. పైగా దాని వల్ల ఎవ్వరికీ ఎలాంటి ఉపయోగం ఉండదు. కేవలం నిర్మాత శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, టాలీవుడ్ లావాదేవీల్లో పారదర్శకతను పెంచే క్రమంలో ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థ, బి-సి సెంటర్లలో అందుబాటు టిక్కెట్ రేట్లు లాంటి అంశాల్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది.
దూరదృష్టితో చూస్తే ఈ చర్యలన్నీ టాలీవుడ్ ను మెరుగుపరిచేవే తప్ప, పవన్ పై కక్ష తీర్చుకునేవి కాదు. టిక్కెట్ రేట్ల సీలింగ్ అనేది ప్రతి రాష్ట్రంలో ఉన్నదే. ఈ విషయాల్ని కూడా మరిచిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడేశారు పవన్ కల్యాణ్.
పవన్ కల్యాణ్ కు, వైసీపీకి మధ్య రాజకీయ శత్రుత్వం ఉండొచ్చు. ఆ శత్రుత్వాన్ని పవన్ ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నాడు. ప్రతి చిన్న విషయానికీ వైసీపీ సర్కారును బద్నామ్ చేస్తూ తన కడుపు మంటను చల్లార్చుకుంటూనే ఉన్నారు. కానీ చివరికి తన కసి తీర్చుకోవడం కోసం ఇండస్ట్రీని కూడా ఆయన బలిపశువును చేస్తారని టాలీవుడ్ పెద్దలు అస్సలు ఊహించలేకపోయారు.
టాలీవుడ్ సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ కు సభాముఖంగా, అత్యంత వినమ్రంగా విన్నవించుకున్న చిరంజీవి కూడా ఈ పరిణామాన్ని ఊహించి ఉండరు. నిజంగా ఇలాంటి ప్రమాదం జరుగుతుందని ఊహించి ఉంటే, పవన్ ను ఫంక్షన్ కు రాకుండా ఆపేసి, తనే వెళ్లేవారు.
ఏదైతేనేం, ఏం జరగకూడదనుకున్నారో అదే జరిగింది. పవన్ మాటలతో ఇండస్ట్రీకి జరగాల్సిన డ్యామేజీ మొత్తం జరిగిపోయింది. ఏపీలో ఆక్యుపెన్సీ గురించి, టిక్కెట్ రేట్ల గురించి, సెకెండ్ షో-బెనిఫిట్ షోల గురించి సినీజనాలు ఇక మరిచిపోవడం మంచిది. సినిమాకు 50 కోట్లు తీసుకొని ఇండస్ట్రీకి పవన్ చేసిన ''మేలు'' ఇది.